క్వాన్లాంగ్ గార్డెన్‌కు పునర్జన్మ
ఫర్బిడెన్ సిటీలో ‘శతాబ్దపు రహస్యం’ ఆవిష్కరణ
పూర్వ వైభవం వెనుక పాతికేళ్ల కఠోర శ్రమ
‘భయంకరం’..!!
సింగపూర్‌కు చెందిన ఆర్కిటెక్ట్ హో పుయ్–పెంగ్, 1980ల చివర్లో బీజింగ్‌లోని నిషిద్ధ నగరాన్ని మొదటిసారి సందర్శించినప్పుడు, ఆయన నోటి నుండి వచ్చిన మొదటి మాట ఇదే. 600 ఏళ్ల చరిత్ర ఉన్న ఒకప్పటి రాజప్రాసాదం చెత్తతో, పాడుబడిన గిడ్డంగులతో నిండిపోవడం ఆయనను నివ్వెరపరిచింది. కానీ అదే ’భయంకరమైన’ దృశ్యం ఇప్పుడు చైనా అత్యంత అద్భుతమైన వారసత్వ సంపదగా ఎలా మారింది? ఒకప్పుడు మూతపడిన ఓ చిన్న వనం, యావత్ ప్రపంచ దృష్టిని ఎలా ఆకర్షిస్తోంది? ఈ మార్పు వెనుక శతాబ్దపు రహస్యం దాగుంది. పాతికేళ్ల కఠోర శ్రమ ఉంది.
చరిత్రలో నిషిద్ధ నగరం
పదిహేనో శతాబ్దంలో మింగ్ రాజవంశం పాలనలో కుటుంబం నివాసం, కార్యకలాపాల కోసం దీనిని నిర్మించారు. ఆ తర్వాత క్వింగ్ రాజవంశపు చక్రవర్తులు దీనిని స్వా«దీనం చేసుకుని ఎన్నో భాగాలను పునరుద్ధరించారు. 1925లో, చివరి క్వింగ్ చక్రవర్తి పు యీని ఇక్కడి నుంచి పంపించేసిన తర్వాత ఈ ప్రదేశంలో ’ప్యాలెస్ మ్యూజియం’ ప్రారంభమైంది. అయితే, పునరుద్ధరణ పనులు చాలా ఆలస్యంగా మొదలయ్యాయి. చాలా ఏళ్లపాటు ఆ ప్రాంతాల మరమ్మతులు సరిగ్గా జరగకపోవడం, ఈ కట్టడాలు ఎక్కువగా చెక్కతో నిర్మించడం వల్ల తరచూ మంటలు చెలరేగి తీవ్రంగా దెబ్బ తిన్నాయి.
వందేళ్ల తర్వాత గార్డెన్ కనువిందు
దశాబ్దాలు గడిచాయి.. మళ్లీ హో పుయే–పెంగ్ సందర్శించేసరికి రూపురేఖలు మారిపోయాయి. ప్యాలెస్ మ్యూజియం 100వ వార్షికోత్సవం సందర్భంగా, దాని ఈశాన్య భాగంలోని ఒక చిన్న ప్రదేశంపై అందరి దృష్టి పడింది. సెపె్టంబర్ 30న ప్రజల కోసం తెరిచిన ఈ ప్రాంతాన్ని మ్యూజియం వర్గాలు ‘మొత్తం ప్రాంగణంలోనే అత్యంత అందమైన తోట’గా అభివరి్ణంచాయి.
అదే ’ఖియాన్ లాంగ్ గార్డెన్’
సుమారు ఒక శతాబ్దం పాటు మూతపడిన ఈ గార్డెన్, 1770ల్లో కేవలం ఐదేళ్లలోనే నిర్మాణం పూర్తి చేసుకుంది. దీని పునరుద్ధరణకు ప్యాలెస్ మ్యూజియం, వరల్డ్ మాన్యుమెంట్ ఫండ్‌తో కలిసి ఏకంగా 25 ఏళ్లపాటు శ్రమించింది.
వానలోనూ సందర్శకుల తాకిడి
ఇటీవల చైనాలో గోల్డెన్ వీక్ సెలవుల్లో, వర్షం పడుతున్నా ఈ ’ఖియాన్ లాంగ్ గార్డెన్’ లోపల సందర్శకులు బారులు తీరారు. చక్రవర్తి ఖియాన్ లాంగ్ పేరు మీదుగా ఈ తోటకు ఆ పేరు వచ్చింది. ఇది చక్రవర్తికి ఒక వ్యక్తిగత ఏకాంత నివాసంగా ఉండాలనే ఉద్దేశంతోనే దీనిని చాలా గోప్యంగా డిజైన్ చేశారు. 6,000 చదరపు మీటర్ల విస్తీర్ణంతో, ఇది ఒక ఫుట్‌బాల్ మైదానం కంటే చిన్నది. ఈ అద్భుత ప్రయత్నాన్ని చైనా నాయకుడు జి జిన్‌పింగ్ కూడా ప్రశంసించారు, నిషిద్ధ నగరం కేవలం ఒక భవన సముదాయం కాదు.. అది గత వైభవం. ఆ వంద సంవత్సరాల ప్రయాణానికి ‘వందనం’.
– సాక్షి, నేషనల్ డెస్క్


