మార్చురీలోనే సాజిద్‌ మృతదేహం | Australia Shooting Case: Family Refuses to Claim Sajid Body | Sakshi
Sakshi News home page

మార్చురీలోనే సాజిద్‌ మృతదేహం

Dec 22 2025 5:55 PM | Updated on Dec 22 2025 7:30 PM

Australia Shooting Case: Family Refuses to Claim Sajid Body

అంత్యక్రియలకు ముందుకు రాని భార్య

కుమారుడిపై 59 కేసులు- ఫిలిప్పీన్స్‌లో శిక్షణ

తోటి వ్యక్తుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్న సాజిద్‌ను తాను క్షమించనని.. ఆ డెడ్‌బాడీని తాను చూడనని.. అంత్యక్రియలు చేయనని... పోలీసులకు స్పష్టం చేసింది ఆస్ట్రేలియా ముష్కరదాడి కింగ్‌పిన్‌ సాజిద్‌ భార్య వెర్నా. ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బోండీ ముష్కర కాల్పుల ఘటనలో 16 మంది ప్రాణాలు కోల్పోయిన తెలిసిందే.

ఆ కాల్పులు జరిపి 16మందిని పొట్టన పెట్టుకున్న సాజిద్‌ అక్రమ్‌ను అదే రోజు పోలీసులు కాల్చి చంపేశారు. అయితే డిసెంబర్‌ 14న జరిగిన ఈ ఘటన తర్వాత అతని మృతదేహాన్ని తీసుకెళ్లమని సాజిద్‌ కుటుంబీకులను, భార్య వెర్నాను పోలీసులు కోరినా.. ఆమె మాత్రం భర్త మృతదేహాన్ని తీసుకెళ్లి ఖననం చేయడానికి నిరాకరించింది. దీంతో సాజిద్‌ అంత్యక్రియలు చేయడానికి ఆస్ట్రేలియా పోలీసులే సిద్ధమవుతున్నారు.

ఏం జరిగింది ఆరోజు
డిసెంబర్‌ 14న ఆస్ట్రేలియాలోని  బోండిలోని చనుకా బై ది సీ ఈవెంట్ పై ఒక్క సారిగా విరుచుకు పడ్డ సాజిద్‌ అక్రమ్‌, అతని కుమారుడు నవీద్‌ అక్రమ్‌ మారణకాండ సృష్టించిన విషయం తెలిసిందే. ఎవరూ ఊహించని ఈ ఉగ్రదాడి కారణంగా ఒక్కసారిగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. ఎంతో ఉత్సాహంగా జరుగుతున్న ఈవెంట్‌ ఒక్కసారిగా మారణహోమంగా మారిపోయింది. క్షణాల వ్యవధిలో 16మంది ప్రాణాలు గాల్లో కలిశాయి.

సుమారు 100 మంది గాయాల బారిన పడ్డారు. ధైర్యం చేసిన మరో స్థానికుడు అహ్మద్‌ ధైర్య సాహసాలు ప్రదర్శించి... తూటాలకు భయపడకుండా సాజిద్‌ను ఎదుర్కొని ప్రాణనష్టాన్ని నివారించగలిగాడు. అప్పట్లో అక్కడికి చేరుకున్న పోలీసులు సాజిద్‌ను కాల్చి చంపేయడం.. అతని కుమారుడు నవీద్‌ను అదుపులోకి తీసుకోవడంతో డెత్‌గేమ్‌కు ఫుల్‌స్టాప్‌ పడింది. మారణకాండ గురించి తెలుసుకున్న ప్రపంచ దేశాలు తీవ్రవాద ఘటనను ఖండించాయి.

నవీద్‌పై 59 కేసులు
ఆ తర్వాత పోలీసుల దర్యాప్తు ప్రారంభమైంది. మారణహోమాన్ని సృష్టించిన సాజిద్‌ అదే రోజు చనిపోవడంతో అతని డెడ్‌బాడీని కరోనర్ కార్యాలయంలోని మార్చురీకి తరలించి తదుపరి దర్యాప్తుపై పోలీసులు ఫోకస్‌ చేశారు. అక్కడి చట్ట ప్రకారం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పచెప్పాల్సి ఉంటుంది. కానీ భార్య వెర్నా మాత్రం ఆ డెడ్‌బాడీని తాను తీసుకెళ్లనని స్పష్టం చేసింది. ఈ తీవ్రవాద ఘటనలో ప్రధాన పాత్ర పోషించి పోలీసుల కాల్పుల్లో మరణించిన సాజిద్‌ కుమారుడు 24ఏళ్ల నవీద్‌ మాత్రం ప్రాణాలతో పోలీసులకు చిక్కాడు.

అతన్ని విచారించిన ఆస్ట్రేలియా పోలీసులు అతనిపై మొత్తం 59 కేసులు నమోదు చేశారు. వీటిలో 16 హత్య కేసులు, ఉగ్రవాద చర్యకు పాల్పడిన కేసుతో పాటు తీవ్రవాద కార్యకలాపాలు, ఇతర కేసులున్నాయి. విచారించగా... తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్‌లోని మిండనావోలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు, ఐసిస్ నుంచి ప్రేరణ పొందినట్లు నవీద్‌ పోలీసుల విచారణలో వెల్లడించాడు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో అనే ద్వీపంలో 1990 నుంచి ఐఎస్‌ తీవ్రవాదులు ఆవాసం పొందుతున్నట్లు సమాచారం.

దూరమైన బంధువులు
అంతటి ఘోరానికి పాల్పడ్డ సాజిద్‌ గురించి హైదరాబాద్‌లోని కుటుంబీకులు సైతం అతని మరణంపై ఎలాంటి సంతాపం వ్యక్తం చేయడం లేదు. సాజిద్‌ ఇప్పుడు కాదు... 1998లోనే దూరమయ్యాడని... తాజా ఉదంతం కారణంగా అతను మరింత దూరమయ్యాడని చెబుతున్నారు. అతనిలో అంతటి రాక్షసత్వం ఉందని... అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని టోలీచౌకీలో నివాసముంటున్న అతని వృద్ధ తల్లి, సోదరుడు చెబుతున్నారు.

ఆస్తులు కూడ బెట్టిన సాజిద్‌
తీవ్రవాదం జీర్ణించుకున్న సాజిద్‌ గతంలోనే భార్యతో కూడా దూరమయ్యాడట. అయితే ఘటనకు ఆరు నెలల ముందు నుంచి భార్యతో తిరిగి సత్సంబంధాలు కొనసాగిస్తున్నట్లు భార్య వెర్నా పోలీసులకు వివరించింది. అయినా భార్యతో కాకుండా కుమారుడితో కలిసి కాంప్సీ ప్రాంతంలో ఓ చిన్న ఇల్లు అద్దెకు తీసుకుని అక్కడే నివసిస్తున్నాడు. అంతకు ముందే భారీగా ఆస్తులు కూడబెట్టిన సాజిద్‌  తొలుత 7లక్షల డాలర్లకు మూడు పడకగదుల ఆస్తిని 2016లో కొనుగోలు చేసి భార్య వెర్నా పేరిట రిజిస్టర్‌ చేయించాడు. ఆ తర్వాత  5 లక్షల డాలర్లతో మరో ఇంటిని కొనుగోలు చేశాడు. అతను మరణించిన నాటికి అతని ఆస్తుల విలువ సుమారు 2 మిలియన్‌ డాలర్ల వరకు ఉన్నట్లు ఆస్ట్రేలియా అధికారులు గుర్తించినట్లు సమాచారం.

మార‌ణ‌కాండ‌కు ప‌క్కా స్కెచ్‌
మారణకాండ సృష్టించడానికి తండ్రీ కొడుకులు పక్కా స్కెచ్‌ వేసినట్లు పోలీసులు గుర్తించారు. డిసెంబర్‌ 14న సాయంత్రం7గంటల సమయంలో కాంప్సీ ప్రాపర్టీ నుండి బోండి బీచ్ కు వెళ్లారు. క్యాంప్ బెల్ పరేడ్ లో హ్యుండాయ్ ఎలాంట్రా కారును పార్క్ చేసి, వాహనం కిటికీపై ఐసిస్ జెండాను ఎగరవేశారు. బోండి బీచ్ నుండి మీటర్ల దూరంలో ఉన్న పార్కులో హనుక్కా మొదటి రోజును జరుపుకుంటున్నప్పుడు యూదు కుటుంబాలపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులకు చిక్కిన కొడుకు నవీద్‌ ఇచ్చిన ఆధారాలతో ఆ సాయంత్రం, సిడ్నీ నైరుతి ప్రాంతంలోని బోనీరిగ్ లోని ఒక ఇంటిని పోలీసులు చుట్టుముట్టారు ఆ ఇంటిని వెర్నా, సాజిద్ లు  కలిసి 2016లో కొనుగోలు చేశారని గుర్తించారు.

ఇండియాలో నేర చ‌రిత్ర లేదు
హైదరాబాద్‌కు చెందిన సాజిద్‌ ఆస్ట్రేలియాకు వలస వచ్చిన తర్వాత ఆరుసార్లు ఇండియాకు వచ్చి వెళ్లినట్లు తెలంగాణ డీజీపీ శివధర్‌రెడ్డి వెల్లడించారు.  ముఖ్యంగా ఆస్తి సంబంధిత అంశాలు, అతని వృద్ధ తల్లిదండ్రులను పరామర్శించడం లాంటి కారణాలతోనే వచ్చి వెళ్లాడు. అయినప్పటికీ, అతని తండ్రి మరణించినప్పుడు అతను భారతదేశానికి రాలేదు. ఉపాధి నిమిత్తం 1998లో ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన సాజిద్‌ 1999లోనే యూరప్‌కు చెందిన ఓ మహిళను వివాహం చేసుకున్నాడు. వారికి ఓ కుమారుడు, ఓ కుమార్తె ఉన్నారు.

భారతీయ పాస్ పోర్ట్ కలిగి ఉన్న 50 ఏళ్ల సాజిద్‌కు ఇండియా నుంచి నేర చరిత్ర లేదు. అతను భారతదేశంలో రాడికలైజ్ అయ్యే అవకాశం లేదని అధికారులు భావిస్తున్నారు. హైదరాబాద్ లోని అతని కుటుంబం కూడా అతని "రాడికలైజేషన్" గురించి "తమకు తెలియదు" అని చెబుతున్నారు. ఇప్పటికీ మధ్యతరగతి అధికంగా ఉన్న టోలిచౌకిలోని ఓ ఇంట్లో సాజిద్‌ తల్లి, సోదరుడు నివాసముంటున్నారు. సాజిద్‌ గురించి.. అతని రాకపోకల గురించి తమకేమీ తెలియదని ఇరుగు పొరుగు వారు కూడా చెప్పడం గమనార్హం.

ఫిలిప్పీన్స్‌లో నెల రోజులు తీవ్ర‌వాద‌ శిక్ష‌ణ‌
అయితే తండ్రీ కొడుకులు ఫిలిప్పీన్స్‌ లో తీవ్రవాద శిక్షణ పొందినట్లు సంకేతాలు స్పష్టం అయ్యాయి. గత నవంబర్‌లో నెల రోజల పాటు దక్షిణ ఫిలిప్పీన్స్‌  పర్యటనకు వెళ్లిన సాజిద్‌, నవీద్‌లో అక్కడే స్కెచ్‌ వేసినట్లు తెలుస్తోంది. వాళ్లిద్దరూ మిండనోవా అనే ద్వీపంలో "సైనిక తరహా శిక్షణ" పొందినట్లు ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు.  ఫిలిప్పీన్స్ అధికారులతో సంప్రదింపులు జరుపుతున్న ఆస్ట్రేలియన్ అధికారులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. దక్షిణ ఫిలిప్పీన్స్ లోని మిండనావో ద్వీపం.. 1990 దశకం నుంచే ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులకు షెల్టర్‌జోన్‌గా మారిందని... తీవ్రవాదులు తరచూ  సందర్శించే మిండనోవా ద్వీపం వారికోసం ఓ హాట్ స్పాట్ అని చెప్పవచ్చు.

తండ్రీ కొడుకులిద్దరూ నవంబర్ 1న సిడ్నీ నుంచి ఫిలిప్పీన్స్ చేరుకున్నట్లు ఫిలిప్పీన్స్ బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ అధికారులు స్పష్టం చేశారు. మిండనావోలోని దావావో నగరానికి వెళ్లే ముందు వారు మనీలాలోని నినోయ్ అక్వినో అంతర్జాతీయ విమానాశ్రయంలో దిగారు. ఇద్దరూ దావావోను తమ తుది గమ్యస్థానంగా మార్క్‌ చేసినట్లు బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్ తెలిపింది. వీళ్లిద్దరూ ఫిలిప్పీన్స్‌లో ఏ విధమైన ఉగ్రవాద శిక్షణను పొందారనే అంశాలను రాబట్టేందుకు  ఫిలిప్పీన్స్ అధికారులతో ఆస్ట్రేలియా పోలీసులు చర్చలు సాగిస్తున్నారు.

అయితే ఐసిస్‌తో సంబంధాలున్నాయన్న వాదనను ఫిలిప్పీన్స్‌ అధ్యక్షుడు మార్కోస్‌ తిరస్కరించారు. అయితే ఐసిస్ తో సంబంధం ఉన్న ఉగ్రవాదుల సంఖ్య కేవలం 50 మాత్రమే ఉందని ఫిలిప్పీన్స్‌ సైన్యాధికారి తెలిపారు. తిరిగి తండ్రీ కొడుకులు నవంబర్‌ 28న దావావో నుండి మనీలాకు కనెక్టింగ్ విమానంలో అక్కడి నుంచి బయలుదేరి సిడ్నీ చేరుకున్నారు. ఉగ్రవాదుల వాహనం నుండి ఇస్లామిక్ స్టేట్ కు సంబంధించిన రెండు జెండాలను స్వాధీనం చేసుకున్నారు, ఐసిస్‌తో సంబంధం కలిగి ఉన్నాయనడానికి కొన్ని ఆధారాలను ఆస్ట్రేలియా పోలీసులు సేక‌రించారు.

- మ‌హ‌మ్మ‌ద్ అబ్దుల్ ఖ‌దీర్‌, సాక్షి డిజిట‌ల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement