చుట్టూ చేపలు... వాటి మధ్యలో లంచ్
సాధారణంగా రెస్టారెంట్లలోకి నీరు చేరితే యజమానులు కన్నీళ్లు పెట్టుకుంటారు. కానీ, థాయ్‌లాండ్‌లోని ఈ రెస్టారెంట్ యజమానికి మాత్రం వరద నీరే అదృష్ట దేవతలా మారింది! డైనింగ్ టేబుళ్ల మధ్య చేపలు ఈదుతుంటాయి. కస్టమర్‌లకు అద్భుతమైన అనుభూతిని అందిస్తున్నాయి. ఈ వింత రెస్టారెంట్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. ఆహారం ఆస్వాదిస్తూ.. కాళ్ల దగ్గర ఈదే చేపలను చూసేందుకు ఇక్కడ జనం బారులు తీరుతున్నారు.
చేపలతో కలిసి విందు!
మధ్య థాయ్‌లాండ్‌లోని ఒక రెస్టారెంట్‌లో భోజనం చేయడం అద్భుతమైన అనుభూతినిస్తుంది. ఆ భోజనానుభవం కోసమే కస్టమర్‌లు పోటెత్తుతున్నారు. వరద నీటిలో కూర్చున్నాక.. కాళ్ల కింద చేపలు చేసే సందడి చూస్తూ.. సరదా సరదాగా భోజనం చేస్తూ ఆస్వాదిస్తున్నారు. పక్కనే ఉన్న నది ఉప్పొంగి 11 రోజులైనప్పటి నుంచి, వరద ముంపునకు గురైన నదీతీర రెస్టారెంట్ ఇంటర్నెట్‌లో ఒక సంచలనంగా మారింది.
నీటిలో కూర్చుని ఫొటోలు దిగడానికి లేదా చేపలకు మేత వేస్తూ.. ఆ హడావిడిని ఫొటోలు తీయడానికి కస్టమర్‌లు ఉత్సాహంగా వస్తున్నారు. బ్యాంకాక్‌కు సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న నఖోన్ పాఠోమ్ ప్రావిన్స్‌లోని పా జిత్ రెస్టారెంట్‌లో కుటుంబాలు లంచ్ ఆస్వాదిస్తున్నాయి. చుట్టూ చేపలు ఈదుతుంటే చిన్నపిల్లలు ఆసక్తిగా తిలకిస్తున్నారు. వెయిటర్లు చేపల సూప్ లేదా చికెన్ నూడుల్స్ గిన్నెలను నేర్పుతో టేబుల్స్ వద్దకు తీసుకొస్తున్నారు.
ఎవరూ రారనుకున్నా..
పా జిత్ రెస్టారెంట్ 30 ఏళ్లకు పైగా నదీతీరంలో స్థిరంగా ఉందని యజమాని పోర్న్‌కామోల్ ప్రాంగ్‌ప్రెంప్రీ తెలిపారు. దాదాపు నాలుగేళ్ల క్రితం తొలిసారి రెస్టారెంట్ మునిగినప్పుడు ఆమె తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ‘కస్టమర్‌లు ఎవరూ రారని అనుకున్నాను.. కానీ అప్పుడు ఒక కస్టమర్ వచ్చి, ఇక్కడ చేపలు ఉన్నాయని ఆన్‌లైన్‌లో పోస్ట్ చేశారు. అప్పటి నుండి చాలా మంది ఇక్కడ తినడానికి గుమిగూడారు’.. అని ఆమె గుర్తు చేసుకున్నారు.
లాభాలే లాభాలు
వరదల కారణంగా తన వ్యాపారం పెరిగిందని, రోజుకు దాదాపు 10,000 బాట్‌ల (భారత కరెన్సీలో సుమారు రూ.23,000) నుండి 20,000 బాట్‌ల (సుమారు రూ.46,000) వరకు తన లాభం రెట్టింపయ్యిందని ఆమె వివరించారు.
పిల్లలు ఇష్టపడే రెస్టారెంట్
అదే ప్రావిన్స్‌లో నివసించే 29 ఏళ్ల చోంఫునట్ ఖంతనితి.. తన భర్త, కొడుకుతో కలిసి ఇక్కడికి వచ్చారు. ‘ఇక్కడ చాలా బాగుంది. పిల్లలను ఇక్కడికి తీసుకురావచ్చు. చేపలను చూసినప్పుడు వారు అల్లరి చేయడం తగ్గిస్తారు. థాయ్‌లాండ్‌లో ఇలా చేపలు పైకి వచ్చేది ఈ ఒక్కచోట మాత్రమేనని అనుకుంటున్నాను’.. అని ఆమె చెప్పారు. 63 ఏళ్ల బెల్లా విండీ.. తన కాళ్లను చేపలు కొరుకుతున్న అనుభూతిని ఆస్వాదించాలని ఈ రెస్టారెంట్‌కు వచ్చారు. ‘సాధారణంగా, నీరు చాలా ఎక్కువగా ఉంటే చేపలు ఇక్కడికి వస్తాయి. ఇక్కడి ప్రకృతి అనుభవం ఈ రెస్టారెంట్ ముఖ్య ఆకర్షణ, ఇది ప్రజలను ఆకర్షిస్తుంది’.. అన్నారు.
ఇతర ప్రాంతాలకు నష్టమే
ఈ వరదలు పా జిత్ రెస్టారెంట్‌కు అసాధారణ అదృష్టాన్ని తెచి్చనప్పటికీ, థాయ్‌లాండ్‌లోని అనేక ఇతర ప్రాంతాలను మాత్రం తీవ్రంగా దెబ్బతీశాయి. జూలై చివరి నుండి, వరదల కారణంగా 12 మంది మరణించారని, ఇద్దరు తప్పిపోయారని ప్రకృతి విపత్తుల విపత్తుల నివారణ మంత్రిత్వ శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. శుక్రవారం నాటికి, 13 ప్రావిన్స్‌లలో, ముఖ్యంగా ఉత్తర, మధ్య ప్రాంతాలలో 4,80,000 మందికి పైగా ప్రజలు వరదలతో ప్రభావితమయ్యారని వివరించింది.
కష్టాన్ని ఇష్టంగా మార్చుకుని..
కష్టాన్ని కూడా ఇష్టంగా మార్చుకోవచ్చని ’పా జిత్’ రెస్టారెంట్ నిరూపించింది. నదీతీరం మునిగిపోయినా, దాన్ని వినూత్న ’డైనింగ్ డెస్టినేషన్’గా మార్చుకుంది. కస్టమర్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఈ అరుదైన అనుభవాన్ని ఆస్వాదించేందుకు థాయ్‌లాండ్ పౌరులే కాదు, ప్రపంచ పర్యాటకులు కూడా ఇక్కడికి క్యూ కట్టడం ఖాయం! మీకు కూడా ఈ వింత రెస్టారెంట్ గురించి తెలుసుకోవాలనుందా?.. చూడాలనిపిస్తోందా?..
– సాక్షి, నేషనల్ డెస్క్


