
వాషింగ్టన్: భారత్‌పై అమెరికా సుంకాల విధింపుపై ఉపాధ్యక్షుడు జెడి వాన్స్ కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యాను అడ్డుకునేందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. భారత్‌పై ఒత్తిడి పెట్టినట్టు చెప్పుకొచ్చారు. ఇదే సమయంలో రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదని వాన్స్ విశ్వాసం వ్యక్తం చేశారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాన్స్ మాట్లాడుతూ..‘రష్యాకు చమురు ఆర్థిక వ్యవస్థ నుంచి వచ్చే ఆదాయాన్ని తగ్గించడం, తద్వారా అది యుద్ధాన్ని కొనసాగించలేకపోవడం ఈ చర్యల లక్ష్యం. అధ్యక్షుడు ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఇటీవల జరిగిన సమావేశం తర్వాత ఏర్పడిన అడ్డంకులు ఉన్నప్పటికీ, రష్యా-ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగించడంలో అమెరికా మధ్యవర్తి పాత్ర పోషించగలదు. రష్యాపై ట్రంప్ బలమైన ఆర్థిక ఒత్తిడిని తెచ్చారు.
ఎలా అంటే.. భారత్‌పై అదనపు సుంకాలు విధించడం ద్వారా , చమురు నుంచి వచ్చే రష్యా ఆదాయాలు తగ్గిపోతాయి. రష్యా దాడులను ఆపివేస్తే, దానిని మళ్ళీ ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో చేర్చవచ్చని, కానీ దాడులు కొనసాగితే, అది ఒంటరిగా ఉండాల్సి వస్తుందనే సందేశాన్ని ఇవ్వడానికి ట్రంప్ ప్రయత్నించారని అన్నారు. ఉక్రెయిన్‌పై బాంబు దాడులను ఆపమని రష్యాను బలవంతం చేయడానికి ట్రంప్ దూకుడుగా ఆర్థిక ఒత్తిడి విధానాన్ని అవలంభించారు. భారత్ ద్వితీయ సుంకాలను విధించడం కూడా ఇందులో భాగమని తెలిపారు.
మరోవైపు.. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలుపై అమెరికా విమర్శలు చేసింది. భారత వస్తువులపై ట్రంప్ సుంకాన్ని 50 శాతానికి రెట్టింపు చేయడం వల్ల భారత్-అమెరికా సంబంధాలలో ఉద్రిక్తతలు పెరిగాయి. ఇదే సమయంలో రష్యా చమురును ఎక్కువగా కొనుగోలు చేసే చైనాపై ట్రంప్ ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో, ట్రంప్ తీరును పలు దేశాల నేతలు తీవ్రంగా విమర్శిస్తున్నారు.