అమెరికా రాజకీయాల్లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభావం ఇప్పటికీ బలంగానే కొనసాగుతోంది. ఆయన మద్దతు లభిస్తే ఎన్నికల్లో విజయం దాదాపు ఖాయమనే (స్ట్రయిక్ రేటు ఎక్కువ) అభిప్రాయం రిపబ్లికన్ పార్టీలో గట్టిగా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ ఎన్నికలు ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేపుతున్నాయి. ట్రంప్ మద్దతు పొందిన కెన్ పాక్స్టన్ ప్రైమరీలో తొలి అడ్డంకిని దాటి, ఇప్పుడు ప్రధాన ఎన్నికల పోరుకు సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకునే తదుపరి రాజకీయ నిర్ణయం పై అందరి దృష్టి నిలిచింది.
టెక్సాస్ చాలా కాలంగా రిపబ్లికన్ పార్టీకి బలమైన కోటగా ఉంది. ఇటీవల జరిగిన రిపబ్లికన్ ప్రైమరీలో ట్రంప్ మద్దతుతో రాష్ట్ర అటార్నీ జనరల్ కెన్ పాక్స్టన్, సీనియర్ సెనేటర్ జాన్ కార్నిన్‌ను ఓడించి అభ్యర్థిత్వాన్ని దక్కించుకున్నారు. అయితే ప్రైమరీలో గెలవడం ఒక విషయం అయితే, సాధారణ ఎన్నికల్లో మొత్తం రాష్ట్ర ఓటర్లను ఆకట్టుకోవడం మరో విషయం.
ఈ పరిస్థితుల్లో కెన్ పాక్స్టన్‌కు ఎదురవుతున్న గట్టి పోటీని రిపబ్లికన్ పార్టీ కీలక పరీక్షగా చూస్తోంది. డెమోక్రటిక్ పార్టీ తరఫున జేమ్స్ టలారికో నుంచి పెరుగుతున్న సవాల్, ఆయన బలమైన ఫండ్‌రైజింగ్, అలాగే పాక్స్టన్‌పై ఉన్న పాత అవినీతి ఆరోపణలు రిపబ్లికన్లకు రాజకీయంగా ప్రతికూలంగా మారే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో టెక్సాస్ సెనేట్ పోరు రిపబ్లికన్ పార్టీకి “ఇజ్జత్ కా సవాల్”గా మారిందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
తన మద్దతుతో అభ్యర్థిగా నిలిచిన కెన్ పాక్స్టన్‌ను గెలిపించేందుకు ట్రంప్ తన వద్ద ఉన్న అత్యంత భారీ ఎన్నికల నిధిని ఖర్చు చేస్తారా లేదా? ఇదే ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో చర్చకు దారితీసింది
రిపబ్లికన్లకు ట్రంప్ వద్ద ఉన్న నిధి కీలకంగా కనిపిస్తోంది. అమెరికాలో ఎన్నికలు అత్యంత ఖరీదైన రాజకీయ ప్రక్రియల్లో ఒకటి. టెలివిజన్ ప్రకటనలు, సోషల్ మీడియా ప్రచారం, ప్రజా సమావేశాలు, ప్రచార బృందాలు, ఓటర్లను చేరుకునే కార్యక్రమాల కోసం కోట్లాది డాలర్లు అవసరమవుతాయి. అందుకే రాజకీయ నాయకులు, పార్టీలు ముందుగానే భారీ మొత్తంలో విరాళాలు సేకరిస్తుంటాయి.
ట్రంప్‌కు అనుబంధంగా ఉన్న మాగా (MAGA Inc), సూపర్ పాక్(PAC) వద్ద ప్రస్తుతం 356 మిలియన్ డాలర్ల(సుమారు రూ.3,000 కోట్లు) నిధి ఉంది. ఇది అమెరికా రాజకీయాల్లో అత్యంత భారీ ఎన్నికల నిధుల్లో ఒకటిగా భావిస్తున్నారు. ఈ డబ్బు ప్రధానంగా ట్రంప్ అభిమానులు, వ్యాపారవేత్తలు, పార్టీ మద్దతుదారుల విరాళాల ద్వారా సమీకరించబడింది. అయితే..
👉ట్రంప్ ఈ డబ్బును టెక్సాస్ కోసం పాక్స్టన్ కోసం ఖర్చు చేస్తే ఏమవుతుంది?.. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, భారీ ప్రకటనలు, ప్రచార కార్యక్రమాలు, ప్రత్యర్థులపై రాజకీయ దాడులు చేపట్టేందుకు అవకాశం లభిస్తుంది. దీంతో పాక్స్టన్‌కు ఎన్నికల్లో స్పష్టమైన ఊతం లభించే అవకాశం ఉంది. ముఖ్యంగా టలారికో ఆర్థిక బలాన్ని ఎదుర్కోవడానికి ఇది ఉపయోగపడవచ్చు.
👉అయితే ట్రంప్ ఈ నిధిని ఖర్చు చేయకుండా దాచిపెడితే పరిస్థితి భిన్నంగా ఉండొచ్చు. పాక్స్టన్ తన సొంత నిధులతోనే ఎన్నికల పోరాటం చేయాల్సి వస్తుంది. ఒకవేళ టెక్సాస్ వంటి కీలక రాష్ట్రంలో రిపబ్లికన్లు ఓడిపోతే, అమెరికా సెనేట్‌లో పార్టీ బలం తగ్గే అవకాశం ఉంటుంది. అలా జరిగితే భవిష్యత్తులో ట్రంప్ రాజకీయ అజెండాను అమలు చేయడంలో కూడా ఇబ్బందులు తలెత్తవచ్చు.
👉అలాగే.. ట్రంప్ నిధిని వెంటనే ఖర్చు చేయకూడదని భావించే వర్గాలు కూడా ఉన్నాయి. 2026 మధ్యంతర ఎన్నికలతో పాటు రాబోయే జాతీయ రాజకీయ పోరాటాల కోసం ఈ డబ్బును నిల్వ ఉంచడం వ్యూహాత్మకంగా మంచిదని వారు వాదిస్తున్నారు. అందుకే ట్రంప్ ఇప్పటివరకు తన తుది నిర్ణయాన్ని వెల్లడించలేదు.
మొత్తంగా చూస్తే, టెక్సాస్ ఎన్నిక ఇప్పుడు కేవలం ఒక సెనేట్ సీటు కోసం జరిగే పోటీ కాదు. ట్రంప్ రాజకీయ ప్రభావం, ఆయన ఆర్థిక శక్తి, అలాగే రిపబ్లికన్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలకు సంబంధించిన కీలక పరీక్షగా మారింది. ట్రంప్ తన ‘రూ.3,000 కోట్ల’ రాజకీయ నిధిని తెరపైకి తీసుకొస్తారా? లేదంటే సరైన సమయం కోసం దాచిపెడతారా?.. ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో ఈ బిగ్ గేమ్ హాట్ టాపిక్‌గా మారింది.


