అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన | Trump says US will hit Iran very hard tonight | Sakshi
Sakshi News home page

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన ప్రకటన

Jun 11 2026 6:53 PM | Updated on Jun 11 2026 7:38 PM

Trump says US will hit Iran very hard tonight

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి బెదిరింపులకు దిగారు. ఈ రాత్రి ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బతీసేలా భీకర దాడులు చేస్తామని హెచ్చరించారు. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరిగాయి.

ట్రూత్‌ సోషల్‌ వేదికగా ట్రంప్‌ ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్‌లో ఆయన ఇప్పటికే ఇరాన్‌ మిలటరీ శక్తి, సామర్థ్యాలను తుత్తునీయుల్ని చేశామని, తదుపరి సైనిక చర్య ఆసన్నమైందని పేర్కొన్నారు. అంతేకాదు, ఈ రాత్రి ఇరాన్‌ ప్రభుత్వానికి నిద్ర కరువవుతుంది. ఆ దేశానికి చెందిన నేవి, ఎయిర్‌ఫోర్స్‌, రాడార్‌, యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్స్‌తో పాటు మిగిలిన రక్షణ వ్యవస్థలను సర్వనాశనం చేస్తామని స‍్పష్టం చేశారు. 

అదే సమయంలో వెనిజువెలా తరహాలో ఇరాన్‌లోని ఖర్గ్‌ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుని, ఆయిల్‌, గ్యాస్‌ మార్కెట్లను ఆధీనంలోకి తీసుకుంటామని తెలిపారు. ఈ నిర్ణయం వెనిజువెలా, అమెరికాకు అద్భుతంగా కలిసివస్తుందని అన్నారు. ఇరాన్‌-అమెరికా దాడుల కారణంగా పశ్చిమాసియాలో యుద్ధం తారాస్థాయికి చేరువవుతున్న తరుణంలో, దౌత్యపరమైన అంశాలపై మరింత అనిశ్చితి నెలకొంది.

ఓవైపు బెదిరింపులు.. మరోవైపు చర్చలు 
ఓవైపు ఇరాన్‌ను బెదిరిస్తున్నప్పటికీ అమెరికా-ఇరాన్‌ల మధ్య ప్రాథమిక ఒప్పందంపై చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇరాన్‌, యూరోపియన్‌ దేశాల వర్గాల సమాచారం ప్రకారం, సుదీర్ఘ చర్చల్లో పలు అంశాలపై విభేదాలు తలెత్తుతున్నాయని రాయిటర్స్‌ నివేదిక తెలిపింది. ముఖ్యంగా విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన ఇరాన్‌ నిధుల విడుదలే ప్రధాన అడ్డంకిగా మారింది.

ఇరాన్‌ ఆయిల్‌ అమ్మకాల ద్వారా సంపాదించిన బిలియన్ల డాలర్లు దక్షిణ కొరియా, ఖతార్, యూఏఈ వంటి దేశాల బ్యాంకుల్లో ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ లావాదేవీలు డాలర్లలోనే జరుగుతాయి. అమెరికా ఆంక్షల చట్టాల ప్రకారం, డాలర్‌ ఆధారిత లావాదేవీలను నియంత్రించే అధికారం అమెరికాకు ఉంది. అందువల్ల అమెరికా ఒత్తిడి కారణంగా ఆ దేశాల బ్యాంకులు ఇరాన్‌ నిధులను ఫ్రీజ్‌ చేశాయి. అమెరికా మార్కెట్‌ యాక్సెస్ కోల్పోకుండా ఉండటానికి ఆ బ్యాంకులు ఆంక్షలను పాటించాయి.

ఇరాన్‌ నిలిపివేసిన 6 బిలియన్ల నుంచి 12 బిలియన్ల వరకు నిధులను విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తోంది. కానీ అమెరికా మాత్రం మానవతా సాయం కింద షరతులతో కొద్దికొద్దిగా మాత్రమే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. ఈ కారణంగా ఇరాన్‌తో అమెరికా మధ్య సంఘర్షణ మరింత తీవ్రతరమవుతోందని వర్గాలు వెల్లడించాయి. సైనిక దృష్ట్యా ఈ యుద్ధం అంతులేని మార్గమని, ఇరాన్‌పై దాడి చేసి అమెరికా తన లక్ష్యాలను సాధించలేకపోయిందని విశ్లేషకులు పేర్కొన్నారు.

చర్చల్లో కొంత పురోగతి ఉన్నప్పటికీ, చివరికి అమెరికా-ఇరాన్‌ సంఘర్షణకు ముగింపు రావాలంటే విదేశీ బ్యాంకుల్లో నిలిచిపోయిన నిధులను తిరిగి ఇరాన్‌ పొందడమే మార్గమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement