
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చమురు కొనుగోళ్ల విషయంలో రష్యాకు భారత్ దూరమైందని ప్రకటించారు. అదే సమయంలో.. భవిష్యత్తులో భారత్‌పై అదనపు సుంకాలు విధించే ఆలోచన కూడా తనకేం పెద్దగా లేదని స్పష్టం చేశారు.
అలస్కాలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో ట్రంప్ ఉక్రెయిన్ శాంతి చర్చలపై భేటీ జరిపిన సంగతి తెలిసిందే. అయితే భేటీకి ముందు విమాన ప్రయాణంలో ది ఫాక్స్‌న్యూస్‌కు ట్రంప్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘అతను(రష్యా అధినేత పుతిన్‌ను ఉద్దేశించి) ఇప్పటికే ఓ క్లయింట్‌ను కోల్పోయారు. అది 40 శాతం కొనుగోళ్లు జరిపే భారత దేశం. చైనా గురించి కూడా తెలిసిందే. ఆ దేశం కూడా రష్యాతో బాగానే వాణిజ్యం జరుపుతోంది. ఒకవేళ.. పరోక్ష ఆంక్షలు, అదనపు సుంకాలు గనుక విధించాల్సి వస్తే.. అది ఆ దేశాల దృష్టిలో చాలా విధ్వంసకరంగా ఉంటుంది. అందుకే అవసరం అయితే చేస్తాను. అవసరం లేకపోతే ఉండదు’’ అని అన్నారాయన.
Trump says he may not impose 25% tariffs on India (to kick in from 27 August) for buying Russian oil..
Trump: "They lost oil client India which was doing about 40% of the oil & China's doing a lot, if I did a secondary tariff it would be devastating, if I have to I will, may be… pic.twitter.com/dhyC7RpHNh— Dhairya Maheshwari (@dhairyam14) August 16, 2025
అదే సమయంలో.. అలస్కా భేటీ తర్వాత కూడా ట్రంప్ ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. రష్యా చమురు కొంటున్న దేశాలపై సుంకాలు గురించి మళ్లీ ఆలోచిస్తానని, రెండు-మూడు వారాల్లో దీనిపై ఓ నిర్ణయం తీసుకుంటానని స్పష్టం చేశారు. ట్రంప్ తాజా ప్రకటనపై ఢిల్లీ వర్గాలు స్పందించాల్సి ఉంది.
ఇదిలా ఉంటే.. రష్యాతో చమురు కొనుగోళ్ల నేపథ్యంతో భారత్‌పై ట్రంప్ జులై 30వ తేదీన 25 శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించారు. భారత్ మిత్రదేశమైనప్పటికీ అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు సజావుగా లేవని.. పైగా ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా చమురు, ఆయుధాల కొనుగోళ్ల ద్వారా పరోక్ష ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆరోపణలు గుప్పించారు. ఈ క్రమంలో..
ఆగస్టు 1వ తేదీ నుంచి ఆ 25 శాతం సుంకం అమల్లోకి వచ్చింది. అయితే తాను చెప్పినా కూడా భారత్ రష్యా ఆయిల్ కొనుగోళ్లు ఆపలేదంటూ ఆగస్టు 6వ తేదీన మరో 25 శాతం పెనాల్టీ సుంకం విధించారు. దీంతో భారత్‌పై అమెరికా సుంకాలు 50 శాతానికి చేరింది. పెరిగిన ఈ 25 శాతం ఆగస్టు 27వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. ట్రంప్ 50 శాతం సుంకాలను భారత్ అన్యాయమని పేర్కొంది. సుంకాలను తాము పట్టించుకోబోమని, జాతీయ ప్రయోజనాల దృష్ట్యా.. ఎనర్జీ భద్రత, ధరల లాభం ఆధారంగా నిర్ణయాలు తీసుకుంటున్నామని భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. అయితే..
రష్యాతో చమురు వాణిజ్యం విషయంలో భారత ప్రభుత్వం ఇప్పటిదాకా వెనక్కి తగ్గలేదు. ఆయిల్ కొనుగోళ్లు ఆపేసినట్లు భారత ప్రభుత్వం అధికారికంగా ఏం ప్రకటించలేదు. అమెరికా టారిఫ్‌లతో బెదిరిస్తున్నప్పటికీ రష్యా నుంచి ముడిచమురు కొనుగోళ్లను భారత్ నిలిపివేయలేదని ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చైర్మన్ ఏఎస్ సాహ్ని తెలిపారు. ‘‘‘మాకు రష్యా నుంచి చమురు కొనమని కానీ కొనొద్దనీ కానీ ప్రభుత్వం ఎలాంటి సూచనలు ఇవ్వలేదు. అలాగే రష్యా చమురు దిగుమతులను పెంచుకునేందుకు లేదా తగ్గించుకునేందుకు మేం ప్రయత్నాలు కూడా చేయడం లేదు’’ అని అన్నారాయన.
రష్యా చమురు కొనుగోళ్లను భారత రిఫైనరీలు యథాతథంగానే కొనసాగిస్తున్నాయని, జులైలో ఇది రోజుకు 1.6 మిలియన్ బ్యారెళ్లుగా ఉంటే.. ఆగస్టులో రోజుకు 2 మిలియన్ బ్యారెళ్లకు పెరిగిందని ఓ నివేదిక వెలువడింది. కానీ.. క్షేత్రస్థాయిలో పరిస్థితి మరోలా కనిపిస్తోంది. ట్రంప్ 50 శాతం టారిఫ్‌ల ప్రభావంతో తాత్కాలికంగా కొంత తగ్గినట్లు పలు జాతీయ మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. ఇండియన్ ఆయిల్, భారత్ పెట్రోలియం, హిందూస్తాన్ పెట్రోలియం.. తదితర సంస్థలు రష్యన్ ఆయిల్‌ను స్పాట్ మార్కెట్ నుంచి కొనడం ఆపేశాయని, రిలయన్స్, నారాయణ ఎనర్జీ లాంటి కొన్ని ప్రైవేట్ సంస్థలు మాత్రం దీర్ఘకాలిక ఒప్పందాలకు అనుగుణంగా కొనుగోళ్లను యధాతథంగా జరుపుతున్నాయన్నది ఆ కథనాల సారాంశం.