మాకు అడ్డొస్తే ఇంతే..! | Special Story Over America Interventions From Guatemala To Venezuela, Read Story Inside | Sakshi
Sakshi News home page

మాకు అడ్డొస్తే ఇంతే..!

Jan 6 2026 10:06 AM | Updated on Jan 6 2026 10:50 AM

Special Story Over America Strikes Guatemala To Venezuela

అమెరికా అంటే చాలా దేశాలకు తెలియని వణుకు. అటు ఆర్థికపరంగా, ఇటు సైనిక పరంగా కూడా ఆ దేశం బలమైన దేశం. అందుకే అమెరికాతో కాస్త జాగ్రత్తగా ఉండాలని ఇతర దేశాలు కోరుకోవడం  తప్పులేదు.అనవసరంగా వారితో తలనొప్పి తెచ్చుకోవడం ఎందుకనే బావన మిగతా పెద్ద దేశాల్లో కూడా కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అమెరికాను చాలెంజ్‌ చేసినా అవి మాటల వరకే ఉంటాయి. 

ఏవో కొన్నిదేశాలు తప్పితే అమెరికా వ్యవహారంలో ఎవరూ పెద్దగా జోక్యం చేసుకోరు. ఏదైనా దేశం అమెరికాను ఎదిరించే మాట్లాడితే వారు నియంత పోకడలకు పోతున్నారనే అపవాదు వేస్తుంది అగ్రరాజ్యం. ఇలా అమెరికా ఆగ్రహానికి తాజాగా గురైన దేశం వెనెజువెలా.  ఆ దేశంపై దాడి చేసి అధ్యక్షుడు మదురోను నిర్బంధించడమే ఇందుక ఉదాహరణ. 

మరి అమెరికా ఇప్పుడే ఇలా చేసిందా అంటే కాదనే చెప్పాలి. గతంలో చాలా సందర్భాల్లో వేరే దేశాలను తమ మాట వినేలా చేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ‘మొండోడికి నిండా కూడు’ అన్న సామెత అమెరికా అచ్చంగా సరిపోతుందంటే అతిశయోక్తి కాదేమో.

అమెరికా గతంలో అనేక విదేశీ నాయకులను నియంతలగా ముద్ర వేసి  సైనిక చర్యలు  లేదా రహస్య ఆపరేషన్ల ద్వారా పదవి నుంచి తొలగించింది. ముఖ్యంగా లాటిన్ అమెరికా, మధ్యప్రాచ్యం, ఆసియా ప్రాంతాల్లో అమెరికా  జోక్యాలు ఎక్కువగా చోటుచేసుకున్నాయి.

మొహమ్మద్ మోసాదేఘ్ (ఇరాన్, 1953)
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన ప్రధాని.
అమెరికాకు వ్యతిరేకంగా గళం విప్పిన ప్రధాని
అమెరికా, బ్రిటన్ మద్దతుతో జరిగిన కూప్ ద్వారా తొలగించారు.
ఇరాన్ చమురు పరిశ్రమను జాతీయీకరించడమే ఇందుకు కారణం

జాకోబో ఆర్బెన్స్ (గ్వాటెమాలా, 1954)
ప్రజాస్వామ్యంగా ఎన్నికైన అధ్యక్షుడు.
అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌  ఏజెన్సీ (Central Intelligence Agency)) మద్దతుతో జరిగిన కూప్ ద్వారా పదవి నుంచి తొలగించారు.
అతని భూసంస్కరణలు అమెరికా యునైటెడ్ ఫ్రూట్ కంపెనీకి నష్టం కలిగించాయి. అందుచేత అమెరికా అతన్ని ప్రత్యేక ఆపరేషన్‌ ద్వారా పదవీ వీచ్యుతుడిని చేసింది.

 

న్గో డిన్ డియెమ్ (వియత్నాం, 1963)
దక్షిణ వియత్నాం అధ్యక్షుడు.
అమెరికా మద్దతుతో జరిగిన సైనిక తిరుగుబాటులో హత్య చేయబడ్డాడు.
అతని నియంతృత్వ పాలన, బౌద్ధులపై దమనకాండే ఇందుకు కారణం

సాల్వడోర్ అల్లెండే (చిలీ, 1973)
సోషలిస్టు అధ్యక్షుడు.
అమెరికా సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌  ఏజెన్సీ మద్దతుతో సైనిక కూప్ జరిగింది.
అతని సోషలిస్టు విధానాలు, చమురు, రాగి పరిశ్రమల జాతీయీకరణ, భూసంస్కరణలు అమెరికాతో పాటు స్థానిక ఎలైట్ వర్గాలకు ముప్పుగా భావించబడ్డాయి.

మాన్యువెల్ నోరియేగా (పనామా, 1989)
పనామా అధ్యక్షుడు మరియు సైనిక నియంత.
అమెరికా "ఆపరేషన్ జస్ట్ కాజ్" ద్వారా అతన్ని పట్టుకుని అమెరికాకు తీసుకెళ్లింది.
తరువాత మాదకద్రవ్యాల అక్రమ రవాణా కేసుల్లో శిక్ష పడింది.

సద్దాం హుస్సేన్ (ఇరాక్, 2003)
ఇరాక్ యుద్ధంలో అతని ప్రభుత్వాన్ని అమెరికా కూల్చింది.
తరువాత పట్టుకుని విచారణ జరిపి మరణశిక్ష అమలు చేశారు.

నికోలాస్ మడురో (వెనిజులా, 2026)
అమెరికా ప్రత్యేక దళాలు అతన్ని కారాకస్‌లో పట్టుకుని అమెరికాకు తరలించాయి.
అతనిపై నార్కో-టెర్రరిజం కేసులు నమోదు చేశారు.

అమెరికా జోక్యాలు ఎక్కువగా కమ్యూనిజం వ్యాప్తిని అడ్డుకోవడం, చమురు తరహా ఆర్థిక ప్రయోజనాలు కాపాడుకోవడం, లేదా మాదకద్రవ్యాల నియంత్రణ అనే కారణాలతో జరిగాయి. ఈ చర్యలు సంబంధిత దేశాల్లో అస్థిరత, పౌర యుద్ధాలు, దీర్ఘకాలిక రాజకీయ సంక్షోభాలుకి దారితీశాయి.

గడాఫీ పతనంలో అమెరికా పరోక్ష పాత్ర
2011లో లిబియాలో గడాఫీ పతనంలో అమెరికా నేరుగా చేసిన రెజీమ్ చేంజ్ ఆపరేషన్ కాదు. అమెరికా సైన్యం లిబియాపై దాడి చేసింది, కానీ అది ఐక్యరాజ్యసమితి మద్దతుతో నాటో కూటమి చర్యలో భాగం.  గడాఫీని చివరికి పట్టుకుని హత్య చేసినది లిబియన్ తిరుగుబాటు దళాలు, 

అమెరికా వైమానిక దళం.. లిబియాలో గడాఫీ సైనిక స్థావరాలపై బాంబులు వేసింది.- గడాఫీ సైనిక శక్తిని బలహీనపరిచి, తిరుగుబాటు దళాలకు మద్దతుఉ ఇచ్చింది. నాటో కూటమిలో భాగంగా నావికా దళాలు, వైమానిక దళాలు ఉపయోగించారు. 2011లో గడాఫీ తన స్వస్థలమైన సిర్తేలో తిరుగుబాటు దళాల చేత పట్టుబడ్డాడు. అతన్ని తిరుగుబాటు దళాలు హత్య చేశారు. గడాఫీ మరణం తర్వాత లిబియాలో కేంద్ర ప్రభుత్వం కూలిపోయింది.
దేశం అస్థిరత, సాయుధ గుంపుల మధ్య పోరాటం, ISIS వంటి ఉగ్రవాద గ్రూపుల ఆవిర్భించడానికి నాంది పలికింది గడాఫీ పతనం.

స్వప్రయోజనలే ప్రధాన కారణమా?
అమెరికా జోక్యం ఎప్పుడూ మానవ హక్కుల కోసం మాత్రమే కాదు; చాలా సందర్భాల్లో స్వప్రయోజనాలు ప్రధాన కారణం. ఈ జోక్యాలు సంబంధిత దేశాల్లో అస్థిరత, అంతర్గత యుద్ధాలు, దీర్ఘకాలిక రాజకీయ సంక్షోభాలుకి దారితీసాయి. ఇరాక్‌లో సద్దాం హుస్సేన్ పతనం తర్వాత ISIS ఉద్భవం, లిబియాలో గడాఫీ మరణం తర్వాత అస్థిరత చోటు చేసుకుంది.

కొసమెరుపు..
ఏది ఏమైనా తమకు అడ్డొస్తే ఇలానే ఉంటుందనే సంకేతాలను అమెరికా ఇలా పంపుతూనే ఉంది. అమెరికా ఇలా వ్యహరించిన ప్రతీసారి కొన్ని దేశాలు మాత్రం  వారి వైఖరిని ఖండిస్తాయి. కానీ చివరకు అమెరికాతో మనకెందుకులే అని ఊరుకుంటాయి.

ఇది చదవండి:
‘ అందాల’ దేశం.. ఏమిటో ఈ పరిస్థితి..!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement