ప్రపంచవ్యాప్తంగా వెనెజువెలాకు అందాల భామల దేశంగా పేరుంది. ఇందుకు కారణం. ఆ దేశం ఇప్పటివరకూ 7 మిస్ యూనివర్శ్ టైటిల్స్. 6 మిస్ వరల్డ్ టైటిల్స్ గెలుచుకుంది. ఇదే కాదు.. వెనెజువెలా ప్రకృతి సౌందర్యం కూడా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం, లాస్ రోక్యూస్ దీవులు, ఒరినుకో డెల్టి వంటి సహజ అద్భుతాలు ఈ దేశాన్ని మరింత ప్రత్యేకంగా నిలుపుతాయి.
ఇకపై వెనెజువెలాను మేమే పాలిస్తాం
వెనెజువెలాలో పాలకుల నియంతృత్వం పోకడలు ఒకటైతే, ఆ దేశాన్ని ఇకపై తామే పాలిస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించడం ఏంటి? ఒక దేశాధ్యక్షుడిని నిర్భందించి మరొక దేశంలో ఉంచొచ్చా? అనేది ప్రస్తుత ప్రశ్న. ఇది ట్రంప్ విపరీత ధోరణికి కూడా అద్దం పడుతోంది.
ఒక దేశ అధ్యక్షుడిని మరొక దేశం అరెస్ట్ చేయొచ్చా అంటే చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే ఐక్యరాజ్యసమిత భద్రతా మండలి అనుమతి కావాలి. అందుకు సహేతుకమైన కారణాలు ఉండాలి. అయితే ఐక్యరాజ్యసమితికి ట్రంప్ నుంచి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. ఆ దేశంపై యుద్ధం చేయడం, ఆ దేశాధ్యాక్షుడిని భార్య సమేతంగా అరెస్ట్ చేయడం జరిగిపోయింది. అమెరికా కాంగ్రెస్‌కు కూడా సమాచారం ఇవ్వలేదు ట్రంప్. అంటే ఇక్కడ నియంతృత్వ పోకడ తనలో కూడా ఉందని ట్రంప్ నిరూపించుకున్నట్లే అయ్యింది.
ఒక దేశాన్ని మరొక దేశం పాలించొచ్చా?
1945 అక్టోబర్‌లో ఐక్యరాజ్యసమితి రూపొందించిన అంతర్జాతీయ నియమావళిపై అమెరికానే తొలి సంతకం చేసింది. ఆ నియమావళిలో ముఖ్యంగా పేర్కొంది ఏమిటంటే.. ఒక దేశం మరొక దేశంపై సైనిక శక్తిని ఉపయోగించకూడదు. రెండోది ఆ దేశ సార్వభౌమత్వాన్ని గౌరవించాలి. మరి వీటిని ట్రంప్ తుంగలో తొక్కారు. ‘ఐక్యరాజ్యసమితి లేదు.. ఏమీ లేదు.. అంతా మేమే’ అనే అగ్రరాజ్య పోకడను ప్రదర్శించారు. ఒక దేశంపై మరొకదేశం బల ప్రయోగం చేయడం నేరం. సహేతుకమైన కారణాలు ఏవీ కూడా యూఎన్‌ఓకు సమర్పించకుండా ఇలా చేయడం ఇంకా పెద్ద నేరం.
పైనిక చర్యలకు ప్రత్యేక పరిస్థితి..
ఒక దేశం.. మరొక దేశంపై సైనిక చర్యగా దిగాలంటే.. అది వారిని వారు కాపాడుకునే క్రమంలోనే చేయాలి. అంటే ఒక దేశం నుంచి ముప్పు ఏర్పడిన సమయంలో ఆత్మరక్షణ కోసం యుద్ధం చేయవచ్చు. ఇక్కడ అదే రూల్‌ను ట్రంప్ అప్లై చేసినట్లు కనబడుతోంది. వెనెజువెలాను నార్కో-టెర్రరిస్టుగా అభివర్ణిస్తున్న ట్రంప్.. ఇప్పుడు ఆ బూచిని వారిపైకి తోసి అందుకే యుద్ధం చేశామని తన వైఖరిని ఐక్యరాజ్యసమితి ముందు సమర్ధించుకోవచ్చు. అయితే ఈ విషయం కూడా యూఎన్‌ఓకు ముందుగానే చెప్పాలి. మరి ఇలా చేయలేదు కాబట్టి.. అమెరికాపై యూఎన్‌ఓ ఆంక్షలు విధించే అవకాశాలు కూడా ఉన్నాయి.
వేరే దేశాలు చేస్తే.. శాంతి మంత్రం
వేరే దేశాలు ఏమైనా వారి వారి అంతర్గత సమస్యలతో యుద్ధం వరకూ వెళ్తే అక్కడ ట్రంప్ ఎంటర్ అయ్యిపోతారు. ఇప్పటివరకూ అదే జరుగుతూ వస్తుంది. భారత్-పాక్ యుద్ధం, ఉక్రెయిన్-రష్యా యుద్ధం, ఇరాన్- ఇజ్రాయిల్ యుద్ధం ఇలా ఏమి జరిగినా తాను ఉన్నానంటూ ఒక శాంతి కటింగ్ ఇస్తారు ట్రంప్. మరి ఇప్పుడు ఆ శాంతి మంత్రం పక్కకు వెళ్లిపోయిందా.. అనేది మరొక ప్రశ్న.
అమెరికాకు అనుకూలంగా ఉన్నవారికే..
ఇప్పుడు తమ అనుకూలరితో వెనెజువెలాలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలని చూస్తున్న ట్రంప్. అందుకు మచాడోను ఎన్నుకోవచ్చు. ఎప్పట్నుంచో ట్రంప్‌కు మచాడో అనుకూలంగా మాట్లాడటం, నోబెల్ పురస్కారం గెలుచుకున్న సమయంలో కూడా ట్రంప్‌కు ఆ బహుమతిని ఇస్తానని ఆమె ప్రకటించడం వంటి వ్యాఖ్యలు అమెరికాపై భక్తిని చాటుకున్నాయి. ముందుగా అక్కడ తమకు అనుకూలంగా ఉన్న వారితో ఏర్పాటు చేసి తాము చెప్పినట్లు ఉండేలా చేయడమే ట్రంప్ లక్ష్యంగా కనబడుతోంది.
ట్రంప్ చేతిలో మరింత నలిగిపోయే ప్రమాదం..!
మరి ఇప్పుడు ఆ దేశం పరిస్థితి అధ్వానంగా మారింది. పాలకుల కారణంగా గత కొన్నేళ్లుగా వెనెజువెలా పయనం తిరోగమనంలోనే ఉంది. ఆ దేశ అధ్యక్షుడు మధురోను అమెరికా న్యూయార్క్ జైల్లో పెట్టినా అతనికి మద్దతు రాకపోగా, అక్కడ శాంతి వచ్చిందంటూ ఆ దేశానికే చెందని నోబెల్ శాంతి పురస్కార గ్రహీత మచాడో వ్యాఖ్యానించడం ఆ దేశ పాలకుల చర్యలకు అద్దం పడుతోంది.
ఇప్పుడు ట్రంప్ మద్దతుతోనే అక్కడ ప్రభుత్వం ఏర్పడితే వెనెజువెలా శాంతి వస్తుందా?, శాంతి బహుమతి గెలిచిన మచాడో దేశాధ్యక్షురాలిగా ఎన్నికతై గాడిలో పెట్టగలరా?, ఆ దేశ చమురు నిల్వలను వెనెజువెలాకే పరిమితమవుతాయా? లేక అమెరికా చేతుల్లోకి వెళ్లిపోతాయా? అన్నది కాలమే చెబుతుంది.


