
భారత్ సుంకాలతో దాడి చేసిన అమెరికా.. భారత్‌కు మరో హెచ్చరిక జారీ చేసింది. భారత్‌పై మరిన్ని సుంకాలు లేదంటే ఆంక్షలు తప్పవని అంటోంది. ఉక్రెయిన్ శాంతి చర్చల్లో భాగంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అలస్కాలో భేటీ కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. చర్చల ఫలితాలను బట్టి ట్రంప్ నిర్ణయం ఉంటుందని స్పష్టం చేసింది.
రష్యాతో చమురు కొనుగోళ్ల విషయంలో భారత్‌పై ఇప్పటికే సుంకాలు విధించాం. ఒకవేళ.. ట్రంప్-పుతిన్ మధ్య చర్చలు గనుక విఫలమైతే భారత్‌పై మరిన్ని సుంకాలు, ఆంక్షలు తప్పవు. తుది నిర్ణయం చర్చల ఫలితాలను బట్టే ఉంటుంది అని ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ బుధవారం బ్లూమరాంగ్‌టీవీ ఇంటర్వ్యూలో వెల్లడించారు. భారత్‌పై సెకండరీ టారిఫ్‌లు, లేదంటే పరోక్ష ఆంక్షలు విధించే అవకాశం ఉంది అని స్కాట్ స్పష్టం చేశారు.
భారత్ తమ మిత్రదేశమంటూనే దిగుమతులపై 25 శాతం సుంకాలు విధించింది అమెరికా. అంతేకాదు.. ఉక్రెయిన్‌తో యుద్ధం చేస్తున్న రష్యాకు తమ వాణిజ్యం ద్వారా భారత్ పరోక్షంగా ఆర్థిక సాయం అందిస్తోందంటూ ట్రంప్ ఆ టైంలో ఆరోపించారు. ఈ తరుణంలో.. రష్యాతో చమురు, ఆయుధాల కొనుగోళ్లు ఆపకపోవడంతో పెనాల్టీ కింద మరో 25 శాతం మోపారు. దీంతో భారత్‌పై అగ్రరాజ్యం టారిఫ్‌లు 50 శాతానికి చేరింది.
ఈ నిర్ణయాన్ని భారత్ తీవ్రంగా వ్యతిరేకించింది. భారమని తెలిసినా.. జాతీయ ప్రయోజనాల విషయంలో రాజీ పడేది లేదని ప్రధాని మోదీ స్పష్టం చేశారు కూడా. ట్రంప్ విధించిన దటి దఫా సుంకాలు ఇప్పటికే అమలు అవుతుండగా.. ఈ నెల 27 నుంచి రెండో దఫా ప్రకటించిన సుంకాలు అమల్లోకి రానున్నాయి.
ఇదిలా ఉంటే.. ఈ వ్యవహారంలో అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాలపై వాషింగ్టన్‌లో వరుస చర్చలు జరిగాయి. అయితే ఆ చర్చలు ఓ కొలిక్కి రాలేదు. ఈలోపు ట్రంప్ భారత్‌పై 50 శాతం సుంకాలు విధించారు. అదే సమయంలో.. భారత్‌తో వాణిజ్య చర్చలు ఉండబోవని ప్రకటించారాయన. అయితే ఫాక్స్‌న్యూస్‌తో ఈ అంశంపై ఆర్థిక కార్యదర్శి స్కాట్ బెస్సెంట్ మాట్లాడారు. ఇరు దేశాల చర్చలు కొనసాగే అవకాశమూ ఉందని వ్యాఖ్యానించారు. ఈ నెల 25న అమెరికా నుంచి ప్రతినిధులు భారత్‌కు చేరుకుంటారని తెలిపారు. అయితే.. వ్యవసాయ, డెయిరీ మార్కెట్‌ను కాపాడుకునే ఉద్దేశంలో భారత్ ఉందని, ఇది చర్చలకు విఘాతంగా మారే అవకాశం లేకపోలేదని నిపుణులు అంచనా వేస్తున్నారు.
మూడున్నరేళ్ల యుద్ధానికి ముగింపు పలికే ఉద్దేశంతో శాంతి చర్చలు ఉండబోతున్నాయని ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. రష్యా అధినేత కాల్పుల విరమణకు సిద్ధంగా ఉన్నారా? లేదా? అన్నది అలస్కా వేదికగా శుక్రవారం జరగబోయే చర్చలతోనే తేలిపోతుందని చెబుతున్నారాయన. అదే సమయంలో భూభాగాల మార్పిడితోనే శాంతి ఒప్పందం సాధ్యమవుతుందని ఇరు దేశాలకు మరోసారి సూచించారు కూడా. అయితే ఈ ఆలోచనను ఉక్రెయిన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తోంది. భూభాగాల విషయంలో రాజీ పడటం తమ రాజ్యాంగానికి విరుద్ధమని అంటోంది. మరోవైపు ఆ దేశ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి యూరప్ దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఉక్రెయిన్ లేకుండా జరిగే చర్చలకు అర్థం ఉండదని, పుతిన్‌తో జరగబోయే ఒకే ఒక్క భేటీ రష్యా లక్ష్యాలకు అనుకూలంగా ఫలితాలు ఇవ్వవచ్చని యూరప్ దేశాలు భావిస్తున్నాయి.