రాష్ డ్రైవింగ్, దాడులు, దోపిడీలు చేసినవారే అధికం
8 వేల విద్యార్థుల వీసాలు రద్దుచేసినట్టు అధికారుల వెల్లడి
పాలస్తీనాకు మద్దతిస్తే వీసా రద్దు తప్పదని హెచ్చరిక
న్యూఢిల్లీ: రెండోసారి అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టినప్పటి నుంచి తన దేశంలోని విదేశీయులను తరిమేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు డొనాల్డ్ ట్రంప్. చిన్నచిన్న తప్పులకు కూడా వీసాలు రద్దుచేసి బలవంతంగా వారి స్వదేశాలకు పంపేస్తున్నారు. ఇలా ఈ ఏడాది జనవరి నుంచి 80 వేల వీసాలు రద్దుచేసినట్టు ట్రంప్ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఉటంకిస్తూ వాషింగ్టన్ ఎగ్జామినర్ సంస్థ పేర్కొంది. మద్యం సేవించి వాహనాలు నడపటం, ఇతరులను ఇబ్బంది పెట్టడం, దొంగతనాల వంటి నేరాలు చేసిన వారి వీసాలను రద్దుచేసి వారిని స్వదేశాలకు పంపినట్టు తెలిపింది. రద్దుచేసిన ఈ 80 వేల వీసాలు నాన్ ఇమిగ్రేషన్ విభాగానివేనని వెల్లడించింది. ఇందులో 8 వేల వరకు విద్యార్థి వీసాలున్నాయి. అమెరికా చట్టాలను ఏమాత్రం ఉల్లంఘించినా వీసా రద్దు తప్పదని అధికారులు హెచ్చరించినట్టు వాషింగ్టన్ ఎగ్జామినర్ పేర్కొంది. ‘అమెరికా చట్టాలను ఉల్లంఘించినా, మన దేశ భద్రతకు ముప్పు కలిగించే పనులు చేసినా.. వారి వీసాలు రద్దుచేసేందుకు ట్రంప్ ప్రభుత్వం ఏమాత్రం సంకోచించదు. మా సందేశం సుస్పష్టం. అమెరికాలోకి ప్రవేశించటం హక్కు కాదు. మేం ఎల్లప్పుడూ అమెరికా ప్రజల భద్రత, ప్రయోజనాలకే మొదటి ప్రాధాన్యం ఇస్తాం’అని ఇమిగ్రేషన్ విభాగం ప్రిన్సిపల్ డిప్యూటీ ప్రతినిధి టామీ పిగోట్ తేల్చి చెప్పారు.
వీసాల జారీ కఠినతరం
ఇప్పటికే జారీచేసిన వీసాలను వివిధ కారణాలు చూపి రద్దుచేయటంతోపాటు కొత్తగా వీసాల జారీలోనూ అమెరికా కఠిన విధానాలు అమలుచేస్తోందని రాయిటర్స్ పేర్కొంది. వీసా జారీ కోసం దరఖాస్తుదారుడి సోషల్‌మీడియా యాక్టివిటీని పూర్తిగా అధ్యయనం చేస్తున్నారని తెలిపింది. ఈ ఏడాది రద్దు చేసిన వీసాల్లో డ్రైవింగ్‌లో నిబంధనల ఉల్లంఘనకు సంబంధించినవి 16,000 ఉన్నాయి. దాడులకు పాల్పడినవారికి 12,000, దోపిడీలు చేసినవారికి 8,000 ఉన్నాయి. గడువు దాటిన తర్వాత కూడా దేశంలో ఉన్నవాళ్లు, చట్టాలను ఉల్లంఘించినవాళ్లతోపాటు ఉగ్రవాదానికి మద్దతిచ్చి దాదాపు 6,000 మంది విద్యార్థుల వీసాలు రద్దుచేసినట్టు గత ఆగస్టులు అమెరికా విదేశాంగశాఖ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. కరుడుగట్టిన అమెరికా జాతీయవాది, ట్రంప్ మద్దతుదారుడు చార్లీ కిర్క్ హత్యను సమరి్ధస్తూ సోషల్‌మీడియాలో పోస్టులు పెట్టిన ఆరుగురి వీసాలు గత నెలలో రద్దుచేసినట్టు ఓ అధికారి వెల్లడించారు. అమెరికా విదేశాంగ విధానాన్ని వ్యతిరేకించి వేలమంది వీసాలను రద్దుచేసినట్టు గత మేలో అమెరికా విదేశాంగమంత్రి మార్కో రుబియో స్వయంగా ప్రకటించారు.
ఇదీ చదవండి: 20 ఏళ్ల స్టార్‌డం వదిలేసి, 1200 కోట్ల వ్యాపార సామ్రాజ్యం
పాలస్తీనాకు మద్దతిస్తే అంతే సంగతులు..
గాజాపై ఇజ్రాయెల్ దాడిని నిరసిస్తూ కొన్నాళ్లుగా అమెరికాలోని చాలా ప్రాంతాల్లో ఆందోళన జరిగాయి. దీంతో ట్రంప్ యంత్రాంగం ఆ నిరసనల పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. పాలస్తీనాకు మద్దతుగా, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా పనిచేసినా, మాట్లాడినా వీసాలు రద్దుచేయాలని విదేశాంగ శాఖ నుంచి ఇమిగ్రేషన్ విభాగానికి ఆదేశాలు వెళ్లాయని రాయిటర్స్ పేర్కొంది. వీసా దరఖాస్తు దారుల్లో పాలస్తీనా మద్దతుదారులుంటే వారి దరఖాస్తులు తిరస్కరిస్తున్నారు.


