ఢిల్లీ: ఫరీదాబాద్ పేలుడు పదార్థాల అక్రమ రవాణ కేసులో అరెస్టయిన డాక్టర్ షహీన్ సయీద్ విషయంలో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తనకు మతపిచ్చి లేదని, మతపరమైన కట్టుబాట్లు లేకుండా స్వేచ్ఛగా జీవించాలని ఉండేదని సయీద్ మాజీ భర్త డాక్టర్ హయత్ జాఫర్ తెలిపారు. అంతే కాకుండా 2012లో తమ పిల్లలతో కలిసి యూరప్ లేదా ఆస్ట్రేలియాలలో సెటిల్ అవుదామని షహీన్ సయీద్ భావించినట్లు పేర్కొన్నారు.
డాక్టర్ షహీన్ సయీద్ ఫరీదాబాద్ పేలుడు పదార్థాల కేసులో అరెస్టయిన ఈ ఉగ్రవాది గురించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ నడుస్తోంది. భారత్‌లో నిషేదిత ఉగ్రవాద సంస్థ జైషే మెుహమ్మద్ మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడానికి షహీన్ సయీద్ ప్రయత్నించింది. ఎర్రకోట పేలుళ్ల తర్వాత ఢిల్లీ పోలీసుల విచారణ తేలింది. షహీన్ వ్యవహారమై జాతియమీడియా ప్రతినిధులు ఆమె మాజీ భర్త హయాత్‌ను సంప్రదించారు.
షహీన్ 2006లో పల్మనాలజీ పూర్తి చేసిందని వారిద్దరిది పెద్దలు కుదిర్చిన వివాహమని హయత్ తెలిపారు. తనతో ఉన్న సమయంలో మతం విషయంలో కట్టుబాట్లు లేకుండా స్వేచ్చగా ఉండేదన్నారు. వారిద్దరు యూరప్, ఆస్ట్రేలియాలో సెటిల్ అవ్వాలని భావించినట్లు పేర్కొన్నారు. అంతేకాకుండా ఆస్ట్రేలియాలో సెటిల్ అయ్యే విషయంలో వారిద్దరి మధ్య విభేదాలు వచ్చినట్లు చెప్పారు. ఆ తర్వాత 2012లో విడాకులు తీసుకున్నామని, నాటి నుంచి తనకు షహీస్‌కు మధ్య మాటల్లేవని తెలిపారు.
షహీన్ ఉగ్రవాద కార్యక్రమాల్లో భాగం పంచుకోవడాన్ని తాను నమ్మలేకపోతున్నామని ఆమె తండ్రి అహ్మద్ అన్సారి అన్నారు. ‘నాకు ముగ్గురు పిల్లలు. నా రెండో సంతానమే షహీన్. వైద్యవిద్యను అభ్యసించింది. అలాంటి హషీన్ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాల్గొంటుందని నమ్మలేకపోతున్నా. తనని కలిసి ఏడాది కాలమైంది. చివరి సారిగా గతనెలలో మాట్లాడాను’అని చెప్పుకొచ్చారు.
షహీన్ సయీద్ అరెస్టయిన మరుసటి రోజే ఢిల్లీ ఎర్రకోట వద్ద కారు బాంబు పేలింది. ఈ ఘటనలో 12 మంది మృతిచెందగా పలువురు గాయపడ్డారు. ఈనేపథ్యంలో ఎన్ఐఏ దర్యాప్తు వేగవంతం చేసింది.


