
ఒట్టావా: కెనడాలోని ఖలిస్థానీ ఉగ్రవాదులు మరోసారి రెచ్చిపోయి అనుచిత వ్యాఖ్యలు చేశారు. భారత్‌ను టార్గెట్ చేసి వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను సీజ్ చేస్తామని తాజాగా బెదిరింపులకు దిగారు. ఈ మేరకు ఖలిస్థానీ సిక్స్ ఫర్ జస్టిస్ (SFJ) సంస్థ హెచ్చరించింది. దీంతో, ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది.
వివరాల ప్రకారం.. భారత్, కెనడా మధ్య మళ్లీ దౌత్య సంబంధాలు తిరిగి ప్రారంభమవుతున్న వేళ కెనడాలోని ఖలిస్థానీలు రెచ్చిపోయారు. అమెరికాకు చెందిన ఖలిస్థానీ సంస్థ సిక్స్ ఫర్ జస్టిస్.. వాంకోవర్‌లోని భారత కాన్సులేట్‌ను ముట్టడిస్తామని పేర్కొంది. ఈనెల 18న (గురువారం) దీన్ని స్వాధీనం చేసుకుంటామని, ఆ సమయంలో ఇక్కడికి ఎవరూ రావొద్దంటూ హెచ్చరికలు చేసింది. ఇదే సమయంలో కాన్సులేట్‌కు వచ్చే వారు తన సందర్శనను వాయిదా వేసుకోవాలని సూచించింది.
ఈ సందర్భంగా భారత హైకమిషనర్ దినేశ్ కె.పట్నాయక్‌ను లక్ష్యంగా చేసుకుని ఉన్న పోస్టర్లను కూడా విడుదల చేసింది. అంతటితో ఆగకుండా.. భారత కాన్సులేట్‌లు గూఢచారి నెట్‌వర్క్‌ను నడుపుతున్నాయని, ఖలిస్థానీలను లక్ష్యంగా చేసుకుని నిఘా పెట్టాయని ఆ బృందం ఆరోపించింది. దీంతో ఇది కాస్తా తీవ్ర కలకలం రేపింది. ఇదిలా ఉండగా.. రెండు సంవత్సరాల క్రితం 18 సెప్టెంబర్ 2023న హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ఏజెంట్ల పాత్ర దర్యాప్తులో ఉందని అప్పటి ప్రధాన మంత్రి జస్టిన్ ట్రూడో సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో, నాటి నుంచి భారత్, కెనడా మధ్య దౌత్యపరంగా విభేదాలు వచ్చాయి.