ఇరాన్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు అమెరికా రాజకీయాల్లో తీవ్ర గందరగోళానికి దారి తీసింది. ఒకవైపు ఇరాన్ ఆర్థిక వ్యవస్థను క్రమంగా ఉక్కిరిబిక్కిరి చేసేలా కఠిన ఆంక్షలు విధిస్తామని హెచ్చరిస్తున్న ట్రంప్.. మరోవైపు అవసరమైతే ఇరాన్‌పై భారీ సైనిక దాడులు తప్పవంటూ బెదిరిస్తున్నారు. ఆ వెంటనే అదో చిన్న యుద్ధమంటూ వ్యాఖ్యానించారు. అయితే ఈ విషయంలో పెద్దన్న వైఖరిలో స్పష్టత కనిపించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఈ ఏడాది ఫిబ్రవరి 28వ తేదీన ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ బలగాల సంయుక్త దాడితో పశ్చిమాసియా యుద్ధం మొదలైంది. అంటే ఆర్నెలు పూర్తయ్యిందన్నమాట. అయితే ఇరాన్‌పై అమెరికా తాజాగా మరోసారి సైనిక చర్యకు దిగింది. దాదాపు నెల రోజుల తర్వాత జరిగిన దాడి ఇది. హర్ముజ్ జలసంధిలో సముద్ర గనులను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నాయని పేర్కొంటూ అమెరికా సైన్యం.. ఇరాన్ రాకెట్ లాంచర్లను లక్ష్యంగా చేసుకుని ఈ దాడి జరిపింది. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ట్రంప్ మరో అడుగు ముందుకేశారు. ఇరాన్ కీలక ఇంధన కేంద్రంగా ఉన్న ఖర్గ్ ద్వీపాన్ని ‘తునాతునకలు చేస్తాం’ అంటూ సోషల్ మీడియా వేదికగా ఓ ఏఐ వీడియోతో హెచ్చరించారు.
అయితే దీనికి కొద్ది రోజుల ముందే అమెరికా ట్రెజరీ కార్యదర్శి స్కాట్ బెసెంట్ మరో వ్యూహాన్ని ప్రకటించారు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసేలా కొత్త ఆంక్షలను అమలు చేయనున్నామని.. దీనిని ఆయన ‘ఆర్థిక డీ-డే’గా అభివర్ణించారు. ఈ ఆర్థిక ఒత్తిడి ద్వారా ఇరాన్‌ను చర్చల బాట పట్టించవచ్చని.. తద్వారా మరోసారి సైనిక ఉద్రిక్తతకు వెళ్లాల్సిన అవసరం ఉండదని ఆయన సంకేతాలిచ్చారు.
ఇరాన్ యుద్ధం విషయంలో ట్రంప్ పట్ల ప్రజాదరణ క్రమంగా తగ్గిపోతున్నట్లు పలు సర్వేలు చెబుతున్నాయి. ఈ అటు ప్రత్యర్థి డెమోక్రట్లే కాదు.. ఇటు సొంత పార్టీ రిపబ్లికన్‌లోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది.
‘ఏ వ్యూహమో ఏమో.. ఏమీ అర్థం కావడం లేదు’
ఆరు వారాల్లో ముగుస్తుందని ట్రంప్ గతంలో చెప్పిన యుద్ధం.. ఆరు నెలలు దాటినా కొనసాగుతుండటం కూడా ప్రశ్నలకు తావిస్తోంది. ట్రంప్, ఆయన కేబినెట్ సభ్యులు పలుమార్లు ఈ యుద్ధం ముగిసిందని, అమెరికా విజయం సాధించిందని ప్రకటించినప్పటికీ.. ఇరాన్‌తో ఉద్రిక్తతలు మాత్రం పూర్తిగా చల్లారలేదు. ట్రంప్ వైఖరిలో తరచూ కనిపిస్తున్న ఈ మార్పులపై అమెరికా రాజకీయ వర్గాల్లో అసంతృప్తి పెరుగుతోంది. ట్రంప్ పాలనలోని విధానాలపై అవగాహన ఉన్న మాజీ భద్రతా అధికారి ఒకరు.. ఇరాన్‌పై యుద్ధం స్పష్టమైన ప్రణాళిక లేకుండానే ప్రారంభమైందని, ఇప్పటికీ పరిస్థితులకు అనుగుణంగానే నిర్ణయాలు మారుతున్నాయని వ్యాఖ్యానించారు.
ట్రంప్‌తో ఎవ్వరూ సంతృప్తిగా లేరా?
రిపబ్లికన్ పార్టీలో ఇరాన్ ఉద్రిక్తతలపై భిన్న అభిప్రాయాలు ఉన్నాయి. యుద్ధం మరింత పొడిగితే చమురు ధరలు పెరిగి.. అమెరికన్లపై భారం పడుతుందని, వచ్చే మధ్యంతర ఎన్నికలపై ప్రభావం చూపొచ్చని కొందరు ఆందోళన చెందుతున్నారు. ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ సహా యుద్ధంపై అప్రమత్తంగా ఉన్న వర్గాలు సైతం సంఘర్షణ త్వరగా ముగియాలని కోరుకుంటున్నాయి. మరోవైపు ఇరాన్‌పై మరింత కఠినంగా వ్యవహరించాలని కోరుకునే హార్డ్‌లైన్ వర్గం కూడా ట్రంప్ తీరుపై పూర్తిగా సంతృప్తిగా లేదు.
ట్రంప్ ప్రచార బృందంలో పని చేసిన ఓ మాజీ అధికారి మాట్లాడుతూ.. ఇరాన్‌ను అదుపులోకి తీసుకురావాలన్న ట్రంప్ లక్ష్యాన్ని సమర్థించే రిపబ్లికన్లు కూడా ప్రస్తుత పరిణామాలతో అసంతృప్తిగా ఉన్నారని తెలిపారు. మరో రిపబ్లికన్ వ్యూహకర్త ఈ పరిస్థితిని సరదాగా ‘ఫ్రెండ్లీ జోన్‌లో చిక్కుకున్నట్లుంది’ అంటూ అభివర్ణించారు. అంటే.. ట్రంప్ తీసుకుంటున్న ఏ నిర్ణయం కూడా పూర్తిగా ఏ వర్గాన్నీ సంతృప్తిపరచడం లేదన్నమాట.
మధ్యంతర ఎన్నికల వేళ పెరుగుతున్న ఒత్తిడి
అమెరికాలో మరో రెండు నెలల్లో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇరాన్ యుద్ధం ట్రంప్ ప్రభుత్వానికి రాజకీయంగా కూడా సవాలుగా మారుతోంది. ఇప్పటికే అధిక ధరలతో అమెరికన్లు ఇబ్బంది పడుతున్న సమయంలో.. హర్ముజ్ జలసంధిలో ఉద్రిక్తతలు చమురు సరఫరాపై ప్రభావం చూపితే పరిస్థితి మరింత కఠినంగా మారే అవకాశం ఉంది.
ప్రపంచ చమురు రవాణాలో కీలకమైన హర్ముజ్ జలసంధి గుండా గతంలో ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు ఐదో వంతు రవాణా జరిగేది. ఈ మార్గంలో అంతరాయం ఏర్పడితే అంతర్జాతీయ మార్కెట్లపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అమెరికాలో పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పటికే ఆందోళన కలిగిస్తున్నాయి.
‘ఇది వ్యూహంలో భాగమే’
అయితే ట్రంప్ ప్రభుత్వానికి సన్నిహితంగా ఉన్నవారు మాత్రం ఈ పరిణామాలను మరోలా చూస్తున్నారు. ఇరాన్‌పై సైనిక, ఆర్థిక ఒత్తిడిని ఒకేసారి కొనసాగించడం ఉద్దేశపూర్వక వ్యూహమేనని వారు చెబుతున్నారు. ఒకవైపు హర్ముజ్ జలసంధిలో వాణిజ్య నౌకల రాకపోకలు పూర్తిగా నిలిచిపోకుండా ఒత్తిడి కొనసాగిస్తూ.. మరోవైపు ఆంక్షల ప్రభావం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై పడే వరకు వేచి చూడాలన్నది ట్రంప్ వ్యూహంగా వారు పేర్కొంటున్నారు.
మాజీ అమెరికా రాయబారి జేమ్స్ జెఫ్రీ కూడా తాజా పరిణామాలను ఇరువైపులా జరుగుతున్న ప్రతిచర్యలుగానే అభివర్ణించారు. ఇరాన్, అమెరికా రెండూ పూర్తిస్థాయి దాడులకు తిరిగి వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నట్లు కనిపించడం లేదని పేర్కొన్నారు.
యుద్ధం త్వరగా ముగిస్తే మంచిది
ఇదిలా ఉండగా.. ట్రంప్ యంత్రాంగంలోనే యుద్ధాన్ని ముగించాలన్న అభిప్రాయం బలపడుతున్నట్లు చర్చ జరుగుతోంది. చమురు పరిశ్రమకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రకారం.. ఘర్షణలను ముగించాలన్న ఒత్తిడి భారీగా ఉంది. ఇరాన్ పూర్తిగా బలహీనపడే వరకు ఒత్తిడి కొనసాగించాలని భావించే అధికారులు కూడా ఉన్నారు. ఇరాన్‌ను తీవ్ర ఆర్థిక, సైనిక ఒత్తిడిలోకి నెట్టినప్పుడే అది అమెరికాతో తమకు అనుకూలమైన ఒప్పందానికి వస్తుందని వాళ్లు అభిప్రాయపడుతున్నారు.
ఇరాన్ మాత్రం వెనక్కి తగ్గడం లేదు
అమెరికా విధిస్తున్న ఆంక్షలు తమను చర్చల బాట పట్టిస్తాయన్న వాదనను ఇరాన్ తీవ్రంగా ఖండిస్తోంది. అమెరికా వాదనలు అబద్ధాలంటూ ఇరాన్ పార్లమెంట్ స్పీకర్ మహ్మద్ బాఘెర్ ఘలీబాఫ్ విమర్శించారు. అమెరికా ఆంక్షల ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు చైనా కూడా ఇరాన్‌కు మద్దతుగా నిలుస్తోంది. ఇరాన్ నుంచి పెద్ద మొత్తంలో చమురు కొనుగోలు చేసే చైనా.. అంతర్జాతీయ చట్టాలకు ఆధారం లేని ఏకపక్ష అమెరికా ఆంక్షలను వ్యతిరేకిస్తామని స్పష్టం చేసింది.
మొత్తంగా.. ఇరాన్‌పై ట్రంప్ ఒత్తిడి మాత్రం తగ్గడం లేదు. ఆర్థిక ఆంక్షలతో ఉక్కిరిబిక్కిరి చేయాలా? సైనిక దాడులతో లొంగదీసుకోవాలా? లేక ఒత్తిడితోనే చర్చల బాట పట్టించాలా? అన్నది మాత్రం స్పష్టంగా కనిపించడం లేదు. ఒకవైపు యుద్ధం ముగిసిందంటూనే.. మరోవైపు దాడుల హెచ్చరికలు చేయడం, ఆ తర్వాత మళ్లీ చర్చలకు సంకేతాలివ్వడం అమెరికా వ్యూహంపై సందేహాలకు తావిస్తోంది. ఇరాన్‌ను ఎలా ఎదుర్కోవాలన్న దానిపై ట్రంప్ నిర్ణయం ఏదైనా కావొచ్చు.. కానీ యుద్ధాన్ని ఎప్పుడు, ఎలా ముగించాలన్నదే ఇప్పుడు ఆయన ముందున్న అసలు సవాలు!.
ఇదీ చదవండి: ఈసారి కాస్త గట్టిగానే కొడతాం


