జపాన్‌లో ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. 1993లో 15 రోజుల వీసాతో జపాన్‌లో అడుగుపెట్టిన దక్షిణ కొరియా వ్యక్తిని 33 ఏళ్ల తర్వాత అరెస్ట్ చేశారు. షిజుఒకా ప్రిఫెక్చర్‌లోని యైజు నగరంలో 'మున్ జోంగ్-గి'గా గుర్తించబడిన ఈ వ్యక్తిని జపాన్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 1993లో తన తమ్ముడి పాస్‌పోర్ట్‌ను ఉపయోగించి జపాన్ చేరుకున్న మున్.. వీసా గడువు ముగిసిన తర్వాత కూడా దక్షిణ కొరియాకు తిరిగి వెళ్లలేదని పోలీసులు తెలిపారు.
జపాన్‌లో ఆ వ్యక్తి.. దశాబ్దాల తరబడి దినసరి కూలీగా, ఇతర చిన్నచిన్న పనులు చేస్తూ జీవనం సాగించినట్లు తెలుస్తోంది. జపాన్‌లో ఓ వ్యక్తి అక్రమంగా నివసిస్తున్నాడని సమాచారం అందడంతో విచారణ చేపట్టిన పోలీసులు.. చివరికి మున్‌ను కనుగొన్నారు. పోలీసు విచారణలో ఆయన తనపై ఉన్న ఆరోపణలను అంగీకరించారు. అయితే, ఎటువంటి చట్టపరమైన నివాస అనుమతులు లేకుండా ఇన్ని సంవత్సరాల పాటు ఆయన జపాన్‌లో ఎలా ఉండగలిగారనే విషయంపై పోలీసులు ఇంకా విచారణ జరుపుతున్నారు.
మున్.. జపాన్‌కు వెళ్లిన 1993 సమయంలో అక్కడ వీసా గడువు ముగిసినా అక్రమంగా ఉంటున్న వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉండేది. న్యాయ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం 1993లో జపాన్‌లో సుమారు 2,98,646 మంది ఉన్నారు. మున్‌కు ఇచ్చిన అనుమతి వ్యవధి కేవలం 15 రోజులు మాత్రమే. ఆ గడువు ముగిసిన తర్వాత కూడా ఆయన జపాన్‌లోనే ఉండిపోయారు. అక్కడ ఉన్న సమయంలో సాధారణ పనులు చేస్తూ తన జీవనాన్ని సాగించారు. ఆయన ఇన్ని సంవత్సరాలు ఎక్కడ నివసించారు? ఎక్కడ పనిచేశారనే పూర్తి వివరాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
మున్.. దాదాపు 33 ఏళ్లు జపాన్‌లో ఉన్నప్పటికీ, పోలీసులు క్రిమినల్ ఆరోపణల కింద సుమారు 26 ఏళ్ల అక్రమ నివాసాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఫిబ్రవరి 2000లో జపాన్ తమ ఇమ్మిగ్రేషన్ చట్టానికి సవరణలు చేసి.. అక్రమ నివాసానికి క్రిమినల్ శిక్షను అమలులోకి తెచ్చింది. దీంతో ఆయన అరెస్టుకు సంబంధించిన నేరం 1993 వీసా గడువు ముగిసినప్పటి నుండి కాకుండా 2000 సంవత్సరం నుంచి లెక్కిస్తారు.


