శనివారం పోప్‌ అంత్యక్రియలు | Pope Francis body to lie on Saturday April 26 | Sakshi
Sakshi News home page

శనివారం పోప్‌ అంత్యక్రియలు

Apr 23 2025 2:49 AM | Updated on Apr 23 2025 2:49 AM

Pope Francis body to lie on Saturday April 26

పార్థివదేహాన్ని దర్శించుకునేందుకు బుధవారం నుంచి అనుమతి

పోప్‌ కోరిక మేరకు నిరాడంబరంగా సాగనున్న అంత్యక్రియలు

వాటికన్‌ సిటీ: వాటికన్‌ సిటీలోని సెయింట్‌ పీటర్స్‌ బాసిలికా చర్చిలో మూడు రోజులపాటు ప్రజల సందర్శనలు, నివాళుల తర్వాత శనివారం పోప్‌ ఫ్రాన్సిస్‌ అంత్యక్రియలను నిర్వహించనున్నారు. కోట్లాది మంది క్యాథలిక్‌ల అత్యున్నత మతాధికారి అయినప్పటికీ అత్యంత సాధారణ వ్యక్తిలా ఖనన క్రతువును పూర్తిచేయాలని పోప్‌ కోరుకున్నారని, అదేరీతిలో అంత్యక్రియలను పూర్తిచేస్తామని వాటికన్‌ వర్గాలు ప్రకటించాయి.

పోప్‌ మరణంతో ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్న వేళ పోప్‌ అంత్యక్రియల షెడ్యూల్‌ వివరాలను వాటికన్‌ అధికార వర్గాలు మంగళవారం వెల్లడించాయి. సెయింట్‌ పీటర్స్‌ స్క్వేర్‌ వద్ద శనివారం ఉదయం 10 గంటలకు అంత్యక్రియల కార్యక్రమాన్ని మొదల పెట్టనున్నారు. కార్డినళ్ల కాలేజీ డీన్‌ అయిన 91 ఏళ్ల కార్డినల్‌ జియోవన్నీ బటిస్టా రే నేతృత్వంలో ఈ కార్య క్రమాన్ని నిర్వహించను న్నా రు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ దంపతులు, అర్జెంటీనా అధ్యక్షుడు జేవి యర్‌ మిలేయీ తదిత రులు ఈ కార్యక్రమానికి హాజరు కానున్నారు. 88 ఏళ్ల పోప్‌ ఫ్రాన్సిస్‌ సోమవారం బ్రెయిన్‌ స్ట్రోక్‌ కారణంగా కోమాలోకి వెళ్లి, తర్వాత గుండె వైఫల్యం కారణంగా కన్ను మూసిన విషయం విదితమే.

తొలిసారిగా పార్థివదేహం ఫొటో విడుదల
అధికారిక నివాసంలోకాకుండా పోప్‌ పార్థివదేహాన్ని పోప్‌గా బాధ్యతలు చేపట్టిననాటి నుంచి ఆయన నివసిస్తున్న డోమస్‌ శాంటా మార్టా గెస్ట్‌హౌస్‌ హోటల్‌ చాపెల్‌లోనే ఉంచారు. వాటికన్‌ విదేశాంగ మంత్రి కార్డినల్‌ పెట్రో పరోలిన్‌ పోప్‌కు నివాళులర్పిస్తున్న ఫొటోలను అధికారికంగా మంగళవారం విడుదలచేశారు. ఎర్రని వస్త్రంతో కప్పిన కలపతో చేసిన శవపేటికలో పోప్‌ పార్థివదేహాన్ని ఉంచారు. పోప్‌ నచ్చిన శ్వేత వర్ణ ‘మిటర్‌’ టోపీని ఆయనకు పెట్టారు. 

సెయింట్‌ మేరీ మేజర్‌ బాసిలికాలో ఖననం
ఆయన ఎక్కువగా సందర్శించి, ప్రార్థించే సెయింట్‌ మేరీ మేజర్‌ బాసిలికా చర్చి ప్రాంగణంలోనే పోప్‌ను ఖననం చేయనున్నారు. అక్కడే తనను ఖననం చేయాలని పోప్‌ గతంలోనే సూచించారు. ఆ మేరకే ఖనన క్రతువును పూర్తిచేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement