కూటమి పెద్దలకు షాక్‌.. ప్రభుత్వ లాంఛనాల్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం | Mudragada Family Rejects State Honours for His Funeral | Sakshi
Sakshi News home page

కూటమి పెద్దలకు షాక్‌.. ప్రభుత్వ లాంఛనాల్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం

Jul 15 2026 11:16 AM | Updated on Jul 15 2026 11:21 AM

Mudragada Family Rejects State Honours for His Funeral

సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు.

కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్‌సీపీ నేత జక్కంపూడి రాజా.. ముద్రగడ పద్మనాభం ఏనాడూ అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. నివాస ఆవరణలోనే హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.

‘బతికున్నప్పుడు వేధించారు’
ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా అన్నారు. ఆయన కుటుంబ సమస్యల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. “ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదు. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు” అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.

ప్రభుత్వ నిర్ణయం.. కుటుంబం తిరస్కరణ
ముద్రగడ పద్మనాభం ఇటీవల కన్నుమూయడంతో.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్‌సభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌తో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేశారు.

కాపు ఉద్యమంలో కీలక పాత్ర
ముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయ జీవితంలో పలు కీలక పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement