హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ | PM Narendra Modi expresses grief over tragic crash of Air India Flight crash | Sakshi
Sakshi News home page

హృదయం ముక్కలైంది: ప్రధాని మోదీ

Jun 13 2025 5:13 AM | Updated on Jun 13 2025 5:20 AM

PM Narendra Modi expresses grief over tragic crash of Air India Flight crash

ప్రమాదఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

మాస్కో/లండన్‌/వాషింగ్టన్‌/పారిస్‌/బ్రస్సెల్స్‌:  మాన ప్రమాద వార్త తెలియగానే తన హృదయం ముక్కలైందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. సామాజిక మాధ్యమం ‘ఎక్స్‌’ ఖాతాలో ఒక సంతాప పోస్ట్‌ పెట్టారు. ‘‘ అహ్మదాబాద్‌లో పెను విషాదం నన్ను ఎంతగానో కలచివేసింది. మాటలు రావడం లేదు. మాటలకందని మహా విషాదమిది. నా హృదయం ముక్కలైంది. ఈ విషాద సమయంలో నా ఆలోచనలన్నీ మృతుల కుటుంబాల గురించే. 

సహాయక చర్యల్లో నిగమ్నమైన కేంద్ర, రాష్ట్ర మంత్రులు, అధికారులతో నిరంతరం మాట్లాడుతున్నా’’ అని మోదీ అన్నారు. ‘‘ హృదయ విదారక దుర్ఘటన ఇది. ఇంతటి విషాద సమయంలో బాధిత కుటుంబాలకు యావత్‌భారతావని అండగా నిలుస్తోంది’’ అని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆవేదన వ్యక్తంచేశారు. ఉపరాష్ట్రపతి ధన్‌ఖడ్, కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు, పలు పార్టీల అధినేతలు, అగ్రనేతలు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌ తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు వెలువర్చారు.

ప్రగాఢ సానుభూతి వ్యక్తంచేసిన ప్రపంచాధినేతలు
అంతులేని విషాదాన్ని మిగిల్చిన గుజరాత్‌ విమాన ప్రమాద ఘటనపై ప్రపంచదేశాలు నిర్వరపోయాయి. మృతుల కుటుంబాలకు సానుభూతి వ్యక్తంచేస్తూ ప్రపంచవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ మొదలు మలేసియా ప్రధాని అన్వర్‌ఇబ్రహీం దాకా పలువురు ప్రపంచ దేశాల అధినేతలు, పాలకులు తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తంచేస్తూ సంతాప సందేశాలు పంపించారు. 

‘‘ ఎంతో మంది బ్రిటిష్‌ జాతీయులతో లండన్‌కు బయల్దేరిన విమానం కూలిన దుర్ఘటన దృశ్యాలు అత్యంత హృదయ విదారకంగా ఉన్నాయి. ఈ ఘటన వివరాలను ఎప్పటికప్పుడు తెల్సుకుంటున్నా. తాజా పరిస్థితిపై ఆరాతీస్తున్నా. భాదితుల కుటుంబాలకు నా ప్రగాడ సానుభూతి తెలియజేస్తున్నా’’ అని బ్రిటన్‌ ప్రధాన మంత్రి కెయిర్‌ స్మార్మర్‌ వ్యాఖ్యానించారు. బ్రిటన్‌ రాజు ఛార్లెస్, ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, యురోపియన్‌ కమిషన్‌ అధ్యక్షురాలు ఉర్సులా వాన్‌ డీర్‌ లెయిన్‌ తదితరులు తమ సంతాపాన్ని ప్రకటించారు.

 

Advertisement
 
Advertisement
Advertisement