
న్యూఢిల్లీ: పాకిస్తాన్ మరోమారు తన వక్రబుద్ధిని చాటుకుంది. 2025 మే నెలలో భారత్–పాక్ మధ్య చోటుచేసుకున్న నాలుగు రోజుల సైనిక ఘర్షణల దరిమిలా పాకిస్తాన్ తీవ్రంగా నష్టపోయినట్లు పలు నివేదికలు వెల్లడించాయి. అయితే పాక్ ప్రభుత్వం దీనికి భిన్నంగా, తమ దేశ పాఠశాల పాఠ్యపుస్తకాలలో ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఘనవిజయం సాధించిందని చెబుతూ, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేసింది.
పాకిస్తాన్ కొత్తగా రూపొందించిన పాఠ్యపుస్తకాల్లో ‘భారత్ 2025 మే 6న పాకిస్తాన్‌పై అనూహ్యంగా యుద్ధం ప్రారంభించింది. అయితే పాకిస్తాన్ సైన్యం తెలివిగా స్పందించి, భారత వైమానిక స్థావరాలను ధ్వంసం చేసింది. ఆపై భారత్ శాంతికి మొగ్గుచూపుతూ యుద్ధాన్ని ఆపేలా చేసుకుంది” అని పేర్కొంది. పాఠ్యపుస్తకాల్లో ‘ఆపరేషన్ బునియాన్ ఉల్ మర్సూస్’ అనే పేరుతో, పాకిస్తాన్ 26 భారత ఎయిర్ బేస్‌లను ధ్వంసం చేసినట్లు పేర్కొంది. అంతేకాకుండా, పాకిస్తాన్ సైన్యం నేతృత్వం వహించిన ఆపరేషన్ విజయం సాధించడంతో, ఆర్మీ చీఫ్‌కు ఫీల్డ్ మార్షల్ బిరుదు అందించినట్లు కూడా దానిలో రాశారు.

కాగా పాక్ విషప్రచారంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. స్వతంత్ర మీడియా, విశ్లేషకులు, భారత ప్రభుత్వ వర్గాలు దీనిని చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా తప్పుబడుతున్నాయి. ‘వాస్తవాలను వక్రీకరిస్తూ, జాతీయ గౌరవం పేరుతో పిల్లలకు తప్పుడు చరిత్రను నేర్పడం ప్రమాదకరం’ అని పలువురు విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. భారత ప్రభుత్వం, భద్రతా సంస్థలు ఈ యుద్ధంలో పాక్ సైనిక స్థావరాలపై విస్తృతమైన దాడులు చేపట్టినట్లు ప్రకటించాయి. ఉపగ్రహ చిత్రాలు, స్వతంత్ర మీడియా రిపోర్టుల ప్రకారం పాకిస్తాన్ వైమానిక స్థావరాలు, రాడార్ కేంద్రాలు తీవ్రంగా నష్టపోయినట్లు స్పష్టమయ్యింది. పాకిస్తాన్ విద్యా వ్యవస్థలో ఈ విధంగా వక్రీకరించిన చరిత్ర.. విద్యార్థుల మనోభావాలపై దీర్ఘకాలిక ప్రభావం చూపుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.