ఉగ్రవాద సంబంధింత కార్యకలాపాల్లో సంబంధముందని తీర్మానిస్తూ 8 మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవితఖైదు పడిన ఘటన పాకిస్తాన్‌లో చోటు చేసుకుంది. ప్రస్తుతం జైల్లో ఉన్న పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌కు అనుకూలంగా వీరు యూట్యూబ్‌లో పోస్టులు పెడుతూ ఉండటాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తూ ఆక్కడి కోర్టు జీవితఖైదు విధిస్తూ తీర్చునిచ్చింది.
ఈ కేసులన్నీ కూడా 2023 మే 9వ తేదీన ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్టు చేసిన తర్వాత ఆయన మద్దతుదారులు సైనిక స్థావరాలపై దాడి చేసిన హింసాత్మక నిరసనల తర్వాత దాఖలైన కేసులకు సంబంధించినవి. అప్పటి నుండి, ప్రభుత్వం, సైన్యం.. ఇమ్రాన్‌ఖాన్ మద్దతుదారులను అణచివేసేందుకు తీవ్రంగా యత్నిస్తోంది. దీనిలో భాగంగా ఉగ్రవాద వ్యతిరేక చట్టాలు, సైనిక కోర్టులను ఉపయోగించి వందలాది మందిపై విచారణ జరిపాయి. ఈ క్రమంలోనే ఎనిమిది మంది జర్నలిస్టులు, యూట్యూబర్లకు జీవిత ఖైదు పడింది.
కోర్టు ఏం చెప్పింది?
కోర్టు తన తీర్పులో, నిందితుల చర్యలు పాకిస్తాన్ చట్టం ప్రకారం ఉగ్రవాదంగా పరిగణించబడుతున్నాయని, వారి ఆన్‌లైన్ కంటెంట్ సమాజంలో భయాన్ని, అశాంతిని వ్యాపింపజేస్తుందని పేర్కొంది. దోషులుగా తేలిన వారిలో ఎక్కువ మంది పాకిస్తాన్ వెలుపల ఉన్నారని , విచారణ సమయంలో హాజరు కాలేదని ధృవీకరించిన కోర్టు.. వారికి జీవితఖైదు విధించింది.
దోషులుగా నిర్ధారించబడిన వారు ఎవరు?
కోర్టు తీర్పు ప్రకారం, దోషులుగా తేలిన వారిలో మాజీ సైనిక అధికారులు నుండి యూట్యూబర్లు అయిన ఆదిల్ రాజా, సయ్యద్ అక్బర్ హుస్సేన్, జర్నలిస్టులు వజాహత్ సయీద్ ఖాన్, సబీర్ షకీర్ మరియు షాహీన్ సెహబాయి, వ్యాఖ్యాత హైదర్ రజా మెహదీ, విశ్లేషకుడు మోయిద్ పిర్జాదా ఉన్నారు.


