ఇస్లామాబాద్ కోర్టు బయట ఆత్మాహుతి దాడి
12 మంది మృతి.. 36 మందికి గాయాలు
ఇస్లామాబాద్: పాకిస్తాన్ మరోసారి రక్తమోడింది. రాజధాని ఇస్లామాబాద్‌లో మంగళవారం మధ్యాహ్నం జరిగిన ఆత్మాహుతి దాడిలో 12 మంది బలయ్యారు. మరో 36 మంది క్షతగాత్రులుగా మారారు. ఇస్లామాబాద్ జిల్లా జ్యుడీషియల్ కోర్టు కాంప్లెక్స్ బయటే ఈ దాడి జరగడం గమనార్హం. దుస్తుల లోపల పేలుడు పదార్థాలు ధరించి వచి్చన దుండగుడు తొలుత కోర్టు ప్రాంగణంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించాడని, అది సాధ్యం కాకపోవడంతో గేటు వద్ద పోలీసు వాహనం పక్కన నిల్చొని తనను తాను పేల్చేసుకున్నాడని పాక్ అంతర్గత వ్యవహారాల మంత్రి మొహిసిన్ నఖ్వీ వెల్లడించారు.
ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భద్రతా సిబ్బంది, ఒక లాయర్ సహా 12 మంది మృతి చెందినట్లు తెలిపారు. పేలుడు శబ్దం ఆరు కిలోమీటర్ల దాకా వినిపించడం గమనార్హం. ఘటనా స్థలంలో భయానక దృశ్యాలు కనిపించాయి. పేలుడు ధాటికి పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. ఆ ప్రదేశమంతా రక్తసిక్తంగా మారింది. జనం భయంతో పరుగులు తీశారు. ఈ దాడికి కారకులు ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఏ ఉగ్రవాద సంస్థ కూడా ప్రకటన చేయలేదు. సాధారణంగా ఇలాంటి ఆత్మాహుతి దాడులు చేయడంలో తెహ్రీక్–ఇ–తాలిబన్ పాకిస్తాన్(టీటీపీ) ఆరితేరిందని పాక్ అధికారులు చెప్పారు.
తాలిబన్లు మతిలేని యుద్ధం ఆపాలి: ఖవాజా అసిఫ్
ఇస్లామాబాద్‌లో ఆత్మాహుతి దాడి జరిగినట్లు పాకిస్తాన్ అధ్యక్షుడు అసిఫ్ అలీ జర్దారీ, రక్షణ శాఖ మంత్రి ఖవాజా అసిఫ్ ధ్రువీకరించారు. దాడిని తీవ్రంగా ఖండించారు. బాధిత కుటుంబాలకు సంతాపం ప్రకటించారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. గాయపడిన వారిలో ఎక్కువ మంది న్యాయవాదులు, కోర్టు సిబ్బందే ఉన్నారు. పేలుడు తీవ్రతకు సూసైడ్ బాంబర్ తల తెగి దూరంగా పడిపోయింది.
ఆత్మాహుతి దాడికి అఫ్గాన్‌లోని తాలిబన్ పాలకులు కారణం కావొచ్చని ఖవాజా అసిఫ్ అనుమానం వ్యక్తంచేశారు. తమపై ఈ మతిలేని యుద్ధం ఆపాలని, లేకపోతే భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుందని తాలిబన్లను హెచ్చరించారు. ఉగ్రవాదాన్ని అరికట్టడంపై పాక్ ప్రభుత్వం, తాలిబన్ల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలోనే రాజధానిలో దాడి జరగడం కలకలం సృష్టించింది.


