వైట్‌హౌస్‌లో అమెరికా అధ్యక్షుడితో పాక్ ప్రధాని, ఆర్మీ చీఫ్ భేటీ
ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో సహకారంపై చర్చ
పాకిస్తాన్‌లో పర్యటించాలంటూ ట్రంప్‌కు ఆహ్వానం
న్యూయార్క్/ఇస్లామాబాద్: అమెరికా–పాకిస్తాన్‌ల మధ్య బంధం నానాటికీ బలపడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒకవైపు భారత్‌పై కన్నెర్ర చేస్తూ, మరోవైపు పాక్ పాలకులకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. పాక్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ తాజాగా వైట్‌హౌస్‌లో ట్రంప్‌తో సమావేశమయ్యారు. ప్రాంతీయ భద్రత, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లలో పరస్పరం సహకారంతోపాటు పలు కీలక అంశాలపై వారు చర్చించారు.
గత ఆరేళ్లలో వైట్‌హౌస్‌లో అడుగుపెట్టిన మొట్టమొదటి పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కావడం గమనార్హం. ట్రంప్‌ను శాంతిదూతగా షరీఫ్ అభివరి్ణంచారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు, ఘర్షణలు నిలిపివేయడానికి ట్రంప్ నిజాయితీగా కృషి చేస్తున్నారని కొనియాడారు. భారత్, పాకిస్తాన్‌ల మధ్య కాల్పుల విరమణ అమల్లోకి రావడానికి ట్రంప్ సాహసోపేత, నిర్ణయాత్మక నాయకత్వమే కారణమని ఉద్ఘాటించారు.
దక్షిణాసియాలో అతిపెద్ద యుద్ధం జరగకుండా ట్రంప్ నివారించారని పేర్కొన్నారు. ట్రంప్ నాయకత్వంలో అమెరికా–పాక్ సంబంధాలు రానున్న రోజుల్లో మరింత బలపడతాయని ఆశాభావం షెహబాజ్ షరీఫ్ వ్యక్తంచేశారు. వీలును బట్టి పాకిస్తాన్‌లో పర్యటించాలంటూ ట్రంప్‌ను సాదరంగా ఆహ్వానించారు. ఈ మేరకు పాక్ ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ భేటీ కంటే ముందు ట్రంప్ మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప నాయకుడు వైట్‌హౌస్‌కు రాబోతున్నారని చెప్పారు.
ఇది కూడా చదవండి: ‘ఎవరు బతకాలో ఆయుధాలే నిర్ణయిస్తున్నాయి..’
మారిన ట్రంప్ వైఖరి
2019 జూలైలో అప్పటి పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ అమెరికాలో పర్యటించారు. వైట్‌హౌస్‌లో అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను కలిశారు. ఇమ్రాన్ ఖాన్‌కు అతికష్టంమీద ట్రంప్ అపాయింట్‌మెంట్ దొరికింది. పాకిస్తాన్ అబద్ధాలు చెబుతోందని, అమెరికాకు దగా చేస్తూ సహాయం రూపంలో బిలియన్ల డాలర్ల నిధులు పొందుతోందని ట్రంప్ ఆ సమయంలో ఆరోపించారు. పాక్ భూభాగం ఉగ్రవాదులకు అడ్డాగా మారిపోయిందని మండిపడ్డారు.
ట్రంప్ తర్వాత అమెరికా అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన జో బైడెన్ కూడా పాకిస్తాన్ పట్ల వ్యతిరేకంగానే వ్యవహరించారు. పాక్ ప్రధానమంత్రులతో కనీసం ఫోన్‌లో కూడా మాట్లాడేందుకు బైడెన్ ఇష్టపడలేదు. వారిని ఏనాడూ వైట్‌హౌస్‌కు ఆహ్వానించలేదు. ఇదిలా ఉంటే, ఈ ఏడాది జనవరిలో రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ వైఖరి మారిపోయింది. పాక్ పట్ల పూర్తి సానుకూలంగా వ్యవహరిస్తున్నారు. పాక్ ఆర్మీ చీఫ్ అసిమ్ మునీర్ పట్ల ట్రంప్ అంతులేని అనురాగం ప్రదర్శిస్తుండడం చర్చనీయాంశంగా మారింది.
Just Now 🇵🇰🇺🇸🚨
Pakistan PM Shahbaz Sharif, Field Marshal Asif Munir with US President Donald Trump, and Secretary of State Marco Rubio at The White House.
Photos 📷#America #MAGA #Pak #USA pic.twitter.com/VKOXTecLpx— Mayank (@mayankcdp) September 26, 2025


