నవంబర్ 13, 2026.. ఈ తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. కారణం.. ఆ రోజే ప్రపంచం అంతం కానుందంటూ వైరల్ అవుతున్న ప్రచారం. ఏకంగా 66 ఏళ్ల క్రితమే శాస్త్రవేత్తలు ఈ తేదీని ‘డూమ్స్‌డే’గా పేర్కొన్నారని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుంది? నిజంగానే నవంబర్ 13న ప్రపంచం అంతం కాబోతోందా?.. కంగారుపడాల్సిన అవసరమే లేదు! అసలు విషయం ఏంటో చర్చిద్దాం.
ఈ ప్రచారానికి కారణం 1960లో ప్రముఖ శాస్త్రీయ జర్నల్ ‘సైన్స్’లో ప్రచురితమైన పరిశోధనా పత్రం. ఆస్ట్రియాలో జన్మించిన భౌతిక శాస్త్రవేత్త హెయింజ్ వాన్ ఫోయర్‌స్టర్, అతని సహచరులు ప్యాట్రిసియా ఎం. మోరా, లారెన్స్ డబ్ల్యూ. అమొరే ఈ అధ్యయనాన్ని రూపొందించారు. దీనికి డూమ్స్ డే: ఫ్రైడే నవంబర్ 13 ఏడీ 20206 (Doomsday: Friday, 13 November, A.D. 2026) అనే పేరు పెట్టారు.
క్రీస్తు శకం ప్రారంభం నుంచి 1958 వరకు ప్రపంచ జనాభా పెరుగుదలకు సంబంధించిన సమాచారాన్ని సేకరించి.. దాన్ని గణిత నమూనాలో విశ్లేషించారు. జనాభా పెరుగుదల సాధారణ వేగంతో కాకుండా.. కాలం గడిచేకొద్దీ మరింత వేగంగా పెరుగుతోందని వారు గుర్తించారు.
లెక్కలు అనంతానికి వెళ్తే..
అప్పటి జనాభా పెరుగుదల రేటు ఎలాంటి మార్పూ లేకుండా ఇలాగే కొనసాగుతుందని ఊహించి తమ గణిత సూత్రాన్ని భవిష్యత్తులోకి పొడిగించారు. అలా లెక్కలు వేస్తే ఒక దశలో జనాభా సంఖ్య ‘అనంతం’ (infinity) వైపు వెళ్తుందని తేలింది. ఆ గణిత నమూనాలో ఈ ‘సింగ్యులారిటీ’కి చేరుకునే తేదీ నవంబర్ 13, 2026గా వచ్చింది. అందుకే పరిశోధకులు ఆ తేదీకి ‘డూమ్స్‌డే’ అనే పేరు పెట్టారు. అంతేగానీ ఇది ప్రపంచం పేలిపోతుందని, భూమి నాశనమవుతుందని చేసిన జోస్యం కాదు. జనాభా పెరుగుదలను ఒకే గణిత సూత్రంతో నిరవధికంగా కొనసాగిస్తే వచ్చే అసాధ్యమైన ఫలితాన్ని చూపించడానికి పెట్టిన పేరు.
శాస్త్రవేత్తలు ఏం చెప్పాలనుకున్నారు?
ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా జనాభా వేగంగా పెరుగుతోంది. కుటుంబాల్లో ఎక్కువ మంది పిల్లలు ఉండటం, తదుపరి తరాల్లోనూ అదే ధోరణి కొనసాగడం వంటి పరిస్థితులు జనాభా విస్ఫోటంపై ఆందోళనలకు దారితీశాయి. “మన మునిమనుమలు ఆకలితో చనిపోరు.. జనాభా ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరి అవుతారు” అనే భావనను పరిశోధకులు అప్పట్లో వ్యక్తం చేశారు. అంటే వారి ప్రధాన ఉద్దేశం మానవాళిని భయపెట్టడం కాదు.. జనాభా పెరుగుదల, ఆహారం, వనరులు, పర్యావరణం వంటి అంశాలపై ముందుగానే ఆలోచించాల్సిన అవసరాన్ని చెప్పడం.

మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి?
1960లో వేసిన లెక్కలు యథాతథంగా కొనసాగలేదు. ప్రపంచవ్యాప్తంగా సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారాయి. పట్టణీకరణ పెరగడం, మహిళల విద్య, కుటుంబ నియంత్రణ, వివాహాల వయసులో మార్పులు, జీవనశైలిలో మార్పులు వంటి అనేక కారణాలతో చాలా దేశాల్లో జననాల రేటు గణనీయంగా పడిపోయింది. ఒకప్పుడు జనాభా వేగంగా పెరుగుతున్న దేశాల్లోనూ ఇప్పుడు జననాల రేటు తగ్గుతోంది. కొన్ని దేశాల్లో జనాభా ఇప్పటికే తగ్గడం మొదలైంది.
ఐక్యరాజ్యసమితి అంచనాల ప్రకారం ప్రస్తుతం ప్రపంచ జనాభా 8.2 బిలియన్లకు పైగా ఉంది. ప్రస్తుత ధోరణుల ప్రకారం ప్రపంచ జనాభా ఈ శతాబ్దం మధ్య తర్వాత గరిష్ఠ స్థాయికి చేరుకుని.. ఆ తర్వాత స్థిరపడటం లేదంటే క్రమంగా తగ్గే అవకాశం ఉంది.
నవంబర్ 13న ఏం జరగబోతోంది?
అందుకే 1960 పరిశోధన పత్రంలోని తేదీని చూసి భయపడాల్సిన అవసరం లేదు. నవంబర్ 13, 2026న ప్రపంచం అంతం అవుతుందని ఆ పేపర్ చెప్పలేదు. అలా ఏదైనా ప్రచారం కనిపిస్తే.. పట్టించుకోకండి. ఎవరైనా ప్రపంచ అంతానికి సంబంధించిన శాస్త్రీయ అంచనాగా చెబితే అది తప్పుదోవ పట్టించడమే.
మొత్తానికి.. 1960లో చేసిన ఓ గణిత లెక్కకు వచ్చిన తేదీ ఇప్పుడు సోషల్ మీడియాలో ‘ప్రపంచ అంతం’గా వైరల్ అవుతోంది. కానీ నవంబర్ 13, 2026ను డూమ్స్‌డేగా భావించాల్సిన అవసరం లేదు. కానీ, ఆ పరిశోధన చెప్పిన సందేశం మాత్రం ఇప్పటికీ కీలకమే!. భూమిపై ఉన్న వనరులకు అనుగుణంగా మానవ జనాభా, వినియోగాన్ని నిర్వహించుకోవాల్సిన అవసరం.
ఇదీ చదవండి: ప్రవక్తపై హిందూ యువకుడి పోస్ట్.. మరణశిక్షతో కలకలం


