సోషల్ మీడియాలో ఏదైనా పోస్ట్ చేసే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. ముఖ్యంగా సున్నితమైన అంశాలపై చేసే వ్యాఖ్యలు తీవ్ర పరిణామాలకు దారితీసే అవకాశం ఉంది. క్షణికావేశంలోనో.. అత్యుత్సాహంతోనో పెట్టిన ఓ కామెంట్ తర్వాత తొలగించినా.. దాని ప్రభావం మాత్రం వెంటాడొచ్చు. ఫేస్‌బుక్‌లో పెట్టిన ఓ కామెంట్ చివరకు మరణశిక్షకు దారితీసిన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
జూన్ చివర్లో శ్రీలంకలో ఓ ముస్లిం యువకుడు హిందూ యాత్రికులపై దాడి చేసినట్లు ఉన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిపై ఫేస్‌బుక్‌లో మతపరమైన వాదనలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఓ వ్యక్తి హిందూ దేవుళ్లపై అభ్యంతరకర వ్యాఖ్య చేశాడు. దానికి.. సౌదీ అరేబియాలో పని చేస్తున్న 24 ఏళ్ల శ్రీలంక వలస కార్మికుడు అనోజన్ శివరాసా స్పందించాడు.
సదరు కామెంట్‌కు స్పందిస్తూ.. అనోజన్ తమిళంలో ఇస్లాం ప్రవక్త మహమ్మద్‌పై వ్యాఖ్య చేశాడు. అయితే అది ప్రవక్తను అవమానించేలా ఉందంటూ కొందరు అతన్ని తిట్టిపోశారు. పరిస్థితి చేజారిపోతుందని గమనించిన శివరాసా.. వెంటనే ఆ కామెంట్‌ను తొలగించి, ఆపై వీడియో ద్వారా క్షమాపణ కూడా చెప్పాడు. అప్పటికే ఆ వ్యాఖ్యకు సంబంధించిన స్క్రీన్‌షాట్లు సౌదీ అధికారులకు చేరాయి. అనోజన్ పనిచేస్తున్న సంస్థకు కూడా ఈ విషయం తెలియడంతో.. జూలైలో అతన్ని అరెస్టు చేశారు. అనంతరం ఆయన ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు కుటుంబం తెలిపింది.
జైలు శిక్ష కాస్త మరణశిక్షగా..
ఈ కేసులో అల్-అహ్సా క్రిమినల్ కోర్టు తొలుత అనోజన్‌కు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 30 లక్షల సౌదీ రియాల్స్ జరిమానా విధించింది. శిక్షను తగ్గించాలని ఆయన తరఫు న్యాయవాదులు అప్పీల్ చేశారు. అయితే ఆ అప్పీల్‌తో కేసు మరింత తీవ్ర మలుపు తిరిగింది. సెప్టెంబర్ 17న సౌదీ ప్రాసిక్యూషన్ ఈ కేసును సైబర్ నేరాల చట్టం కింద కాకుండా షరియా చట్టం కింద విచారించాలని అప్పీల్ చేసింది. అప్పీల్ కోర్టు ఆ అభ్యర్థనను అంగీకరించి.. అనోజన్‌కు మరణశిక్ష విధించింది.
మరణశిక్ష పడిందా? అంతే!
సెప్టెంబర్ 28 తర్వాత అనోజన్ కుటుంబ సభ్యులతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. సాధారణంగా అక్కడి మరణశిక్ష ఖైదీలకు వ్యక్తిగత మొబైల్ ఫోన్ల వినియోగం ఉండదని, ఫోన్ కాల్స్ జైలు అధికారుల పర్యవేక్షణలోనే ఉంటాయి. దీంతో ఆయన కుటుంబం తీవ్ర ఆందోళనకు గురవుతోంది. తమ బిడ్డను ఎలా రక్షించుకోవాలనుకుని ప్రయత్నాలు మొదలుపెట్టింది. అయితే ఇప్పటివరకు మరణశిక్ష అమలుకు సౌదీ అధికారులు ఎలాంటి తేదీని ప్రకటించలేదు. క్షమాభిక్ష కోసం శ్రీలంక ప్రభుత్వం దౌత్య మార్గాల్లో ప్రయత్నాలు కొనసాగిస్తోంది.
అధ్యక్షుడికి వేడుకోలు
అనోజన్ కుటుంబ సభ్యులు సెప్టెంబర్ 21న శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసానాయకను కలిసి తమ కుమారుడిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు. క్షమాభిక్ష కోసం అన్ని ప్రయత్నాలు చేస్తామని అధ్యక్షుడు హామీ ఇచ్చినట్లు సమాచారం. సౌదీ అధికారులతో దౌత్య మార్గాల్లో సంప్రదింపులు జరపాలని అధికారులను ఆదేశించారు. మరోవైపు బౌద్ధ, హిందూ మత పెద్దలు కూడా అనోజన్‌కు క్షమాభిక్ష కల్పించాలని కోరారు. కేసులో తదుపరి న్యాయపరమైన అవకాశాలను పరిశీలించేందుకు నలుగురు సభ్యులతో కూడిన శ్రీలంక న్యాయ బృందం సౌదీ అరేబియాకు వెళ్లనుంది.
సోషల్ మీడియా పోస్టులపై కఠిన చర్యలు
సౌదీ అరేబియాలో సోషల్ మీడియా వ్యాఖ్యలకు కఠిన శిక్షలు విధించిన సందర్భాలు గతంలోనూ ఉన్నాయి. 2023లో సౌదీకి చెందిన మాజీ ఉపాధ్యాయుడు మహమ్మద్ అల్-ఘమ్దీకి సోషల్ మీడియా పోస్టుల కేసులో తొలుత మరణశిక్ష విధించారు. అనంతరం ఆ తీర్పు 30 ఏళ్ల జైలు శిక్షగా మారింది. అనోజన్ కేసులోనూ ప్రస్తుతం మరణశిక్ష అమలుకు తేదీ ఖరారు కాలేదు. శ్రీలంక ప్రభుత్వం క్షమాభిక్ష కోసం దౌత్యపరమైన ప్రయత్నాలు కొనసాగిస్తోంది. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో చేసే వ్యాఖ్యలు ఎంతటి పరిణామాలకు దారితీయగలవో ఈ ఘటన మరోసారి చర్చకు తెచ్చింది.
ఇదీ చదవండి: ఐస్ మాములు సాయం చేయలేదుగా!


