నేపాల్: దేశంలో ఇటీవల సంభవించిన భారీ వరదలు వేలాది కుటుంబాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. వరదల్లో కొట్టుకుపోయిన తమవారి మృతదేహాలు దొరకకపోవడంతో వారు బతికున్నారో, చనిపోయారో తెలియని పరిస్థితి నెలకొంది. ఖాట్మండులోని పశుపతినాథ్ ఆలయం వద్ద మృతుల కుటుంబాలు సంప్రదాయ పద్ధతుల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతదేహం లభించనప్పుడు ‘కుశ’ గడ్డితో ప్రతిరూపాన్ని తయారు చేసి దానినే మృతుడికి ప్రతీకగా భావించి అంత్యక్రియలు చేయడం అక్కడి హిందూ సంప్రదాయం.
బాగ్మతి నది పరివాహక ప్రాంతాన్ని ముంచెత్తిన ఈ వరదల్లో 5,000 మందికి పైగా గల్లంతయ్యారు. అధికారిక లెక్కల ప్రకారం 1,455 మంది మృతి చెందగా.. 5,285 మంది ఆచూకీ లేకుండా ఉన్నారు. దీంతో ప్రభుత్వం గాలింపు, సహాయక చర్యలను ముగించి పునరావాసంపై దృష్టి పెట్టింది. రసువా జిల్లాలోని బెట్రావతి గ్రామానికి చెందిన మదన్ లాల్ లావత్ కుటుంబంలోనే ఐదుగురు వరదల్లో కొట్టుకుపోయారు. వారిలో ఆయన సోదరుడు మంగళ్ కూడా ఉన్నారు.
అయితే గల్లంతైన వారి కుటుంబాలకు మరో పెద్ద సమస్య ఎదురవుతోంది. నేపాల్ చట్టం ప్రకారం సాధారణంగా 12 ఏళ్ల పాటు కనిపించని వ్యక్తిని చట్టపరంగా మృతుడిగా పరిగణించే అవకాశం ఉంది. దీంతో మృతదేహం లభించని కుటుంబాలకు మరణ ధ్రువీకరణ పత్రాలు రావడం కష్టమవుతోంది. ఫలితంగా ప్రభుత్వ పరిహారం, బీమా, ఆస్తుల బదలాయింపు, వారసత్వ హక్కులు వంటి అంశాలు కూడా నిలిచిపోతున్నాయి. మరోవైపు మృతదేహాలను గుర్తించేందుకు అధికారులు డీఎన్‌ఏ నమూనాలు సేకరిస్తున్నారు.
వరదల ధాటికి బెట్రావతి గ్రామం దాదాపు పూర్తిగా దెబ్బతింది. ఇళ్లు, దుకాణాలు, పాఠశాలలు, వాహనాలు కొట్టుకుపోగా.. రోడ్లు, వంతెనలు, విద్యుత్ ప్రాజెక్టులు సహా మౌలిక సదుపాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 2015 భూకంపంలో ఇల్లు కోల్పోయిన తిసుమ్ ఘలే.. ఇప్పుడు వరదల్లో 19 మంది బంధువులను కోల్పోయారు. ప్రస్తుతం సొంత ఇల్లు లేకపోవడంతో పాటు సోదరీమణుల పిల్లలు ఎనిమిది మందిని చూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశ పునర్నిర్మాణానికి దాదాపు 5 బిలియన్ డాలర్లు అవసరమవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు.
ఈ నేపథ్యంలో గల్లంతైన వారిని ప్రత్యేక నిబంధనల ద్వారా మృతులుగా గుర్తించి, వారి కుటుంబాలకు పరిహారం, బీమా, ఇతర ప్రయోజనాలు అందించాలని స్థానిక సంస్థలు కోరుతున్నాయి. దీంతో నేపాల్ ప్రభుత్వం కూడా చట్ట సవరణకు సిద్ధమైంది. గల్లంతైన వారి మరణ నమోదును సులభతరం చేసేందుకు నిబంధనలు తీసుకురావాలని నిర్ణయించింది. అలాగే, పార్లమెంట్ సమావేశాలు ముగిసిన క్రమంలో ఆర్డినెన్స్‌తో నిబంధనలు తీసుకురావడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
ఇదీ చదవండి: నోబెల్ తెచ్చిపెట్టిన మంచు ‘ఘనం’!


