పశ్చిమాసియా సంక్షోభం తీవ్ర ఉద్రిక్తతల వైపు అడుగులేస్తోంది. హర్ముజ్ జలసంధి సమీపంలో అమెరికాకు చెందిన అత్యాధునిక ఆర్మీ హెలికాప్టర్ ‘అపాచీ’ కూలిపోవడం.. దానిని ఇరాన్ కూల్చివేసిందంటూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన ఆరోపణలతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటన జరిగిన కొద్ది గంటల్లోనే ఇరాన్‌పై అమెరికా సైన్యం వైమానిక దాడులు ప్రారంభించింది.
హర్ముజ్ జలసంధిలోని ఖేష్మ్ ద్వీపంలో, అలాగే బందర్ అబ్బాస్, సిరిక్‌తో పాటు దక్షిణ ఇరాన్ ప్రాంతాల్లో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించినట్లు సమాచారం. ఇరాన్ గనుక మళ్లీ దాడులకు దిగితే.. ఈసారి గట్టిగా స్పందిస్తామని అమెరికా హెచ్చరించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఇది ఆత్మరక్షణ కోసమేనని అంటోంది. ఇక ఈ దాడులకు ఇరాన్ కూడా స్పందించింది. తమ భూభాగానికి సమీపంలో ఉన్న విదేశీ సైనిక బలగాలే ప్రమాదంలో ఉన్నాయంటూ ఓ ప్రకటన వెలువరించింది.
ఒమన్ తీరంలో అమెరికా ఆర్మీకి చెందిన AH-64 అపాచీ హెలికాప్టర్ సాధారణ గస్తీ నిర్వహిస్తున్న సమయంలో కూలిపోయింది. హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు పైలట్లు సురక్షితంగా బయటపడ్డారు. అమెరికా సెంట్రల్ కమాండ్ సమాచారం ప్రకారం.. తొలిసారిగా సముద్రంలో డ్రోన్ బోట్ సహాయంతో వారిని రక్షించారు. ‘కోర్సెయిర్’ పేరుతో పనిచేసే ఈ డ్రోన్ నౌక ఇద్దరు సైనికులను సురక్షిత ప్రాంతానికి తరలించగా, అక్కడి నుంచి మరో హెలికాప్టర్ వారిని తీసుకెళ్లింది.
ఈ ఘటనపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఇరాన్ మా అత్యాధునిక అపాచీ హెలికాప్టర్‌ను కూల్చివేసింది. మా సిబ్బంది క్షేమంగానే ఉన్నప్పటికీ, ఈ దాడికి అమెరికా తప్పనిసరిగా స్పందించాల్సిందే’ అని సోషల్ మీడియాలో పేర్కొన్నారు.
ట్రంప్ వ్యాఖ్యల అనంతరం అమెరికా సెంట్రల్ కమాండ్ ఇరాన్‌పై దాడులు ప్రారంభించినట్లు ప్రకటించింది. ‘ఇరాన్ అన్యాయమైన దాడికి ఇది ప్రతిస్పందన. అమెరికా సైనికుల రక్షణ, ప్రాంతీయ భద్రత కోసం చర్యలు చేపట్టాం’ అని పేర్కొంది. ఇదే సమయంలో హర్మజ్ జలసంధిలోని ఇరాన్ ఖేష్మ్ ద్వీపంలో భారీ పేలుళ్లు వినిపించినట్లు ఇరానియన్ ప్రభుత్వ మీడియా వెల్లడించింది. అయితే నష్టంపై అధికారిక వివరాలు వెలువడలేదు.
అమెరికా ఆరోపణలను ఇరాన్ ఖండించింది. విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చీ స్పందిస్తూ, ‘హర్ముజ్ జలసంధి అమెరికా తీరాలకు వేల కిలోమీటర్ల దూరంలో ఉంది. మా భూభాగానికి సమీపంలో మోహరించిన విదేశీ బలగాలు తమ తప్పిదాలు, ప్రమాదాలు లేదంటే కాల్పుల మధ్య చిక్కుకోవడం వల్లే ప్రమాదాలకు గురవుతాయి. ప్రమాదాలను తగ్గించుకోవాలంటే వారు ఈ ప్రాంతం విడిచిపోవడం ఉత్తమ మార్గం’ అని వ్యాఖ్యానించారు.
ఈ పరిణామాలు ఇప్పటికే ఉద్రిక్తంగా ఉన్న పశ్చిమాసియా పరిస్థితులను మరింత సంక్లిష్టం చేస్తున్నాయి. రెండు నెలల క్రితం అమెరికా-ఇరాన్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం ఇంకా పూర్తిస్థాయి శాంతి ఒప్పందంగా మారలేదు. ఇదే సమయంలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మళ్లీ కాల్పులు చోటుచేసుకోవడం, లెబనాన్‌లో హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతుండడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది.
ఇదిలా ఉండగా, ఇరాన్‌తో చర్చలపై ట్రంప్ ఇటీవలే ఆశాభావం వ్యక్తం చేశారు. ‘రెండు లేదా మూడు రోజుల్లో మంచి ఒప్పందం కుదిరే అవకాశం ఉంది’ అని వ్యాఖ్యానించిన ఆయన.. హెలికాప్టర్ ఘటన తర్వాత మాత్రం కఠిన వైఖరి అవలంబించారు. ఇరాన్ శుద్ధి చేసిన యురేనియం నిల్వలను వదులుకోవాలని అమెరికా కోరుతుండగా.. ఆంక్షల ఎత్తివేత, స్తంభింపజేసిన ఆస్తుల విడుదలపై ఇరాన్ పట్టుబడుతోంది. దీంతో చర్చలు ఇంకా ప్రతిష్టంభనలోనే ఉన్నాయి.
హర్ముజ్ జలసంధి ప్రపంచ ఇంధన సరఫరాలకు కీలక మార్గం కావడంతో తాజా పరిణామాలు అంతర్జాతీయ మార్కెట్లను కూడా ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇప్పటికే కొనసాగుతున్న యుద్ధం కారణంగా ఇంధన ధరలు, నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిన నేపథ్యంలో తాజా ఘర్షణలు మరింత ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి.


