ప్రపంచానికి ‘కిమ్’ సవాల్: అణ్వాయుధాలతో వీరంగం! | Kim Jong Un Announces Plan To Turn North Korea Navy Into Nuclear Armed Force, Check Out More Details Inside | Sakshi
Sakshi News home page

ప్రపంచానికి ‘కిమ్’ సవాల్: అణ్వాయుధాలతో వీరంగం!

Jun 24 2026 9:53 AM | Updated on Jun 24 2026 11:24 AM

Kim Jong Un Unveils Nuclear Arms Plan for North Korea Navy

ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ మరోసారి ప్రపంచ దేశాలకు సవాల్ విసిరారు. తమ దేశ నౌకాదళాన్ని (నేవీ) అణ్వాయుధాలు కలిగిన శక్తివంతమైన బలగంగా మార్చబోతున్నట్లు ప్రకటించారు. పశ్చిమ రేవు పట్టణమైన నాంపోలో జరిగిన ‘చోయ్ హ్యోన్’ డిస్ట్రాయర్ (యుద్ధనౌక) ప్రారంభోత్సవ వేడుకలో కిమ్ ఈ సంచలన ప్రణాళికను వెల్లడించారు. అమెరికా, దక్షిణ కొరియాల నుంచి వస్తున్న సైనిక ఒత్తిళ్లను తిప్పికొట్టేందుకు ఈ వ్యూహం అత్యంత కీలకమని ఆయన అన్నారు.

అణుశక్తిగా నౌకాదళం – కిమ్ జోంగ్ ఉన్ స్పష్టత
తమ నౌకాదళాన్ని అణ్వాయుధాలతో సన్నద్ధం చేసే కార్యక్రమం అనుకున్న సమయానికి, ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగుతోందని కిమ్ జోంగ్ ఉన్ ప్రకటించారు. తమ దేశ భద్రతను కాపాడుకునేందుకు, అణ్వాయుధాలను ఎల్లప్పుడూ బహుముఖంగా ఉపయోగించడానికి ఈ వ్యూహాత్మక నిర్ణయం చాలా అవసరమని కిమ్ సమర్థించుకున్నారు. ఇప్పటికే ఉత్తర కొరియా అణు కార్యక్రమాలపై అంతర్జాతీయంగా అనేక ఆంక్షలు ఉన్నప్పటికీ, తమ రక్షణ కోసం వీటిని వీడే ప్రసక్తే లేదని కిమ్ స్పష్టం చేయడం గమనార్హం.

రంగంలోకి ‘చోయ్ హ్యోన్’
ప్రస్తుతం నౌకాదళంలో చేరిన 5,000 టన్నుల ‘చోయ్ హ్యోన్’ డిస్ట్రాయర్ తమ దేశ చరిత్రలోనే అత్యంత శక్తివంతమైన ఆయుధాలు కలిగిన నౌకగా ఉత్తర కొరియా మీడియా అభివర్ణించింది. అయితే ఇది కేవలం ఆరంభం మాత్రమేనని కిమ్ పేర్కొన్నారు. త్వరలోనే ‘కాంగ్ కోన్’ అనే మరో డిస్ట్రాయర్‌ను కూడా రంగంలోకి దించుతామని, ఆ తర్వాత వరుసగా 10,000 టన్నుల భారీ వ్యూహాత్మక యుద్ధనౌకల నిర్మాణాన్ని ప్రారంభిస్తామని ఆయన వెల్లడించారు.

ఏటా రెండు మెగా నౌకలు 
కిమ్ జోంగ్ ఉన్ ఆదేశాల ప్రకారం.. రాబోయే రోజుల్లో ఉత్తర కొరియా ప్రతి ఏటా ‘చోయ్ హ్యోన్’ కంటే పెద్దవైన రెండు ఉపరితల యుద్ధనౌకలను (10,000 టన్నుల క్రూయిజర్‌తో కలిపి) నిర్మించనుంది. అమెరికా, దక్షిణ కొరియాలు సంయుక్తంగా జరుపుతున్న సైనిక విన్యాసాల వల్ల కొరియా ద్వీపకల్పం దాదాపు ‘అణు యుద్ధం అంచున’ నిలిచిందని కిమ్ హెచ్చరించారు. ఈ నేపథ్యంలోనే తమ భద్రతా పరమైన రక్షణ చర్యల కోసమే నౌకాదళాన్ని ఇంత భారీ స్థాయిలో ఆధునీకరిస్తున్నట్లు ఉత్తర కొరియా అధికారిక వార్తా సంస్థ వెల్లడించింది.

ఇది కూడా చదవండి: ‘ఎయిమ్స్’కి ఊహించని షాక్.. వైద్య సామ్రాజ్యం బీటలు!

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement