దాడులు... ప్రతిదాడులు | Iran and Israel are trading missiles and air strikes as the conflict in West Asia | Sakshi
Sakshi News home page

దాడులు... ప్రతిదాడులు

Jun 15 2025 1:45 AM | Updated on Jun 15 2025 1:45 AM

 Iran and Israel are trading missiles and air strikes as the conflict in West Asia

మరో ఇద్దరు ఇరాన్‌ కీలక అధికారులు మృతి 

ఇరాన్‌ మిలటరీ కొత్త చీఫ్‌గా అమీర్‌ నియామకం  

బాలిస్టిక్‌ మిసైల్‌ ప్రోగ్రాం కొత్త చీఫ్‌గా మౌసావి 

మళ్లీ దాడిచేస్తే టెహ్రాన్‌ను అగ్నికి ఆహుతిచేస్తాం: ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి హెచ్చరిక

టెహ్రాన్‌/జెరూసలేం/దుబాయి/వాషింగ్టన్‌: తొలిదెబ్బతోనే పలువురు ఇరాన్‌ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధిచేసిన ఇజ్రాయెల్‌ శనివారం మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. శనివారంనాటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్‌ కీలక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. సైనిక జనరల్‌ స్టాఫ్‌లో డెప్యూటీ ఇంటెలిజెన్స్‌ అధికారి అయిన జనరల్‌ గోలామ్‌రెజా మెహ్రీబీ, ఆపరేషన్స్‌ విభాగ డెప్యూటీ జనరల్‌ మెహదీ రబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్‌ సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్‌ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్‌లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. 

టెహ్రాన్‌లోని మెహ్రాబాద్‌ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పైనా క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్‌ ‘ఖుజెస్తాన్‌’ప్రావిన్సులోని అబదాన్‌ నగరంపై, మిలటరీ స్థావరం సమీపంలోని కెర్మాన్‌షా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్‌ దాడులుచేసింది. ఇరాన్‌ గగనతల రక్షణవ్యవస్థలు ధ్వంసంకావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టమొచ్చినట్లు మేం దాడిచేయగలమని ఇజ్రాయెల్‌ రక్షణశా ఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ ఎఫీడెఫ్రిన్‌ ప్రకటించారు. 70 ఫైటర్‌జెట్లతో శత్రు గగనతల రక్ష ణ వ్యవస్థను భస్మీపటలం చేశామని పేర్కొన్నారు. 

రేడియో ధార్మికత సాధారణమే 
సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా, స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్‌ వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఉదయం సైతం మరోసారి వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్‌ క్షిపణులను ఇజ్రాయెల్‌రాజధాని టెల్‌ అవీవ్‌ సిటీమీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ క్షిపణ విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి, భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్‌వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్‌డోమ్‌ వ్యవస్థను దాటుకొని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి.

 దీంతో రిషాన్‌ లీజియన్‌ నగరంలో ఇద్దరు, టెల్‌అవీవ్‌లోని రమాత్‌ గాన్‌ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడులనేపథ్యంలో టెల్‌ అవీవ్‌ సమీప బెన్‌ గురియణ్‌ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్‌ మూసేసింది. మృతసముద్రతీర ప్రాంతంలో చాలా డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్‌ తెలిపింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్‌ అణుకేంద్రంపై శుక్రవారం పలుమార్లు దాడులుజరిగాయని, రేడియోధార్మికత స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ శనివారం ‘ఎక్స్‌’లో ఒక పోస్ట్‌చేసింది. 

ఇరాన్‌ ఆర్మీ చీఫ్‌గా అమీర్‌ హతామి 
ఇరాన్‌ నూతన ఆర్మీ చీఫ్‌గా అమీర్‌ హతామి నియమితులయ్యారు. ఇరాన్‌ సుప్రీం కమాండర్‌ అయతొల్లా అలీ ఖమేనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హతామి ఇరాన్‌ సైన్యానికి చీఫ్‌ కమాండర్‌గా వ్యవహరిస్తారు. హతామి 2013 నుంచి 2021 వరకు ఇరాన్‌ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇరాన్‌ సైనిక వ్యవస్థతో బలమైన సంబంధాలున్న హతామికి మూడు దశాబ్దాలకు పైగా వ్యూహాత్మక, కార్యాచరణ అనుభవం ఉంది. మరోవైపు బాలిస్టిక్‌ మిసైల్‌ ప్రోగ్రాం నూతన చీఫ్‌గా జనరల్‌ మజీద్‌ మౌసావితో ఖమేనీ శనివారం భర్తీచేశారు. ప్రస్తుత చీఫ్‌ అమీర్‌ అలీ హజిజాదే శుక్రవారంనాటి దాడుల్లో చనిపోవడం తెల్సిందే.  

యుద్ధాన్ని ఆపాలన్న ప్రపంచదేశాలు 
ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్‌ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్‌తోనూ ఇజ్రాయెల్‌ సమరానికి సై అనడాన్ని ప్రపంచదేశాలు తప్పుబట్టాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని కోరాయి. శాంతిస్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్‌ సిటీలో సెయింట్‌ పీటర్స్‌ బాసిలికాలో నూతన పోప్‌ లియో–14 సందేశం ఇచ్చారు. ఇతర ఉనికి మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ‘‘ఇరాన్‌ అణుకేంద్రంపై ఇజ్రాయెల్‌ బాంబులేస్తే, టెల్‌అవీవ్‌పై ఇరాన్‌ క్షిపణులను పడేసింది. పెరిగిన ఉద్రిక్తతలను చాలించండి. ఫుల్‌స్టాప్‌ పెట్టాల్సిన సమయమిది. శాంతి, దౌత్యమార్గాల్లో నడవండి’’అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్‌ శనివారం పిలుపునిచ్చారు.  

రహస్యంగా డ్రోన్లు తరలించి.. 
రష్యాలోకి ఉక్రెయిన్‌ రహస్యంగా డ్రోన్లను తరలించినట్లే ఇజ్రాయెల్‌ సైతం ఇరాన్‌లోకి రహస్యంగా డ్రోన్లను తరలించి గగనతల రక్షణవ్యవస్థల వద్దకు చేర్చింది. అదనుచూసి ఎస్‌–300 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్‌ లాంఛర్లను, రాడార్‌ వ్యవస్థలను డ్రోన్లతో పేల్చేసింది. రాడార్లులేకపోవడంతో సులభంగా ఇజ్రాయెల్‌ ఫైటర్‌జెట్లు ఇరాన్‌ ప్రధానభూభాగందాకా వచ్చి భీకరస్థాయిలో బాంబులు జారవిడిచి వినాశనం సృష్టించాయి. అర్ధరాత్రి దాడి తాలూకు వీడియో ఫుటేజీని ఇజ్రాయెల్‌నిఘా విభాగం మొస్సాద్‌ శనివారం విడుదలచేసింది. ఇలాంటి వీడియోలను మొస్సాద్‌ విడుదలచేయడం అత్యంత అరుదు. 

విమానాలను కూల్చేసే లాంఛర్లపై ఇజ్రాయెల్‌ ఆత్మాహుతి డ్రోన్లు ల్యాండ్‌ అయి పేలిపోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘‘మావైపుగా క్షిపణులు ప్రయోగించడం మానకుంటే టెహ్రాన్‌ను అగ్నికి ఆహుతిచేస్తాం. మరుభూమిగా మార్చేస్తాం. మా పౌరులకు హాని తలపెడితే మిమ్మల్ని మసిచేస్తాం. టెహ్రాన్‌పై మరోదఫా దాడులకు మా యుద్దవిమానాలు సదా సిద్ధంగా ఉన్నాయి’’అని ఇజ్రాయెల్‌ రక్షణ మంత్రి ‘ఇజ్రాయెల్‌ కట్జ్‌’అన్నారు. ఈయన పేరులో దేశంపేరూ ఉండటం విశేషం. ‘‘ముప్పును సమూలంగా తొలగించేదాకా దాడులు ఆపబోం. దాడులు రోజులతరబడి కొనసాగొచ్చు’’అని ఇజ్రాయెల్‌ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ అన్నారు.

ఇరాన్‌ ‘అణు’కల చెదిరింది 
యురేనియంను అత్యంత శుద్ధిచేసి అణుబాంబును తయారుచేయాలన్న ఇరాన్‌ కల చెదిరిపోయిందని ఇజ్రాయెల్‌ ప్రకటించింది. అణుకేంద్రం ధ్వంసంకావడం, అందులో కీలక వ్యవస్థలు కూలిపోవడంతోపాటు అత్యంత కీలకమైన 9 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన నేపథ్యంలో ఇరాన్‌ ఇప్పట్లో అణుబాంబును తయారుచేయడం అసాధ్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అణువిద్యుత్‌ కేంద్రానికి సరిపడా యురేనియంను శుద్ధిచేసేందుకు ఇరాన్‌కు అనుమతి ఉండగా అదనపు యురేనియంను శుద్ధిచేస్తోందని చాన్నాళ్ల నుంచి ఆరోపణలురావడం తెల్సిందే. శుక్రవారంనాటి దాడుల్లో అణువిద్యుత్‌కేంద్రం బ్యాకప్‌ ఇంధన శక్తివ్యవస్థను ఇజ్రాయెల్‌ నాశనంచేసింది. దీంతో కరెంట్‌ కష్టాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.

అణు చర్చలు  అర్థ్ధరహితం
అమెరికా ఓవైపు మాపై యుద్ధానికి ఇజ్రాయెల్‌ను ఎగదోస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడటం అర్థ్ధరహితమని అగ్రరాజ్యంపై ఇరాన్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అణుచర్చల కోసం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరగ్గా ఆరోసారి ఆదివారం ఒమన్‌లో జరగనున్నాయి. ఇజ్రాయెల్‌ను మాతో యుద్దానికి దించి అమెరికా మరోదఫా చర్చలకు అర్థంలేకుండాచేసిందని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్‌ బఘేయిల్‌ వ్యాఖ్యానించారు. 

ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పశ్చిమాసియాలోని మీ స్థావరాలపై దాడులుచేస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లను ఇరాన్‌ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగబోయే చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్‌ వైపుగా వెళ్తున్న కొన్ని ఇరాన్‌ క్షిపణులను తాము ఎయిర్‌డిఫెన్స్‌ వ్యవస్థలతో కూల్చేశామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం.  

కశ్మీర్‌ ‘పోస్ట్‌’పై ఇజ్రాయెల్‌ క్షమాపణలు
టెహ్రాన్‌పై వైమానిక దాడులు చేశామంటూ ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్స్‌(ఐడీఎఫ్‌) శుక్రవారం తమ ‘ఎక్స్‌’ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్‌ భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇరాన్‌ అనేది ప్రపంచం మొత్తానికి పెనుముప్పుగా మారింది. ఇది ఇజ్రాయెల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. త్వరలో అన్ని దేశాలతోనూ ఇది ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాడులు చేయడం మినహా మాకు మరోదారి కనిపించలేదు’’అని ఐడీఎఫ్‌ శుక్రవారం ఒక మ్యాప్‌ను పోస్ట్‌పెట్టింది. అయితే ఈ మ్యాప్‌లో జమ్మూకశీ్మర్‌ను పాకిస్తాన్‌లో భాగంగా చూపించింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే తప్పు తెల్సుకున్న ఇజ్రాయెల్‌ శనివారం క్షమాపణలు చెప్పింది. ‘‘ఈ ప్రాంత భూభాగాన్ని చూపుతూ ఊహాత్మకంగా గీసిన మ్యాప్‌ అది. సరిహద్దులను కచ్చితంగా సూచించడంలో ఈ మ్యాప్‌ విఫలమైంది. మ్యాప్‌ కారణంగా మేం ఏదైనా నేరానికి పాల్పడినట్లు భారత్‌ భావిస్తే సారీ’అని ఐడీఎఫ్‌ శనివారం ఒ పోస్ట్‌ పెట్టింది.   

Advertisement
 
Advertisement
Advertisement