breaking news
Radioactivity
-
దాడులు... ప్రతిదాడులు
టెహ్రాన్/జెరూసలేం/దుబాయి/వాషింగ్టన్: తొలిదెబ్బతోనే పలువురు ఇరాన్ సైనిక సారథులు, అణు స్థావరాలు, సైనిక స్థావరాలు, అణు శాస్త్రవేత్తలు, సైనిక ముఖ్యలను సమాధిచేసిన ఇజ్రాయెల్ శనివారం మరోసారి ప్రళయ భీకరంగా విరుచుకుపడింది. శనివారంనాటి దాడిలో మరో ఇద్దరు ఇరాన్ కీలక అధికారులు ప్రాణాలుకోల్పోయారు. సైనిక జనరల్ స్టాఫ్‌లో డెప్యూటీ ఇంటెలిజెన్స్ అధికారి అయిన జనరల్ గోలామ్‌రెజా మెహ్రీబీ, ఆపరేషన్స్ విభాగ డెప్యూటీ జనరల్ మెహదీ రబ్బానీలు మరణించిన విషయాన్ని ఇరాన్ సైతం ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ నుంచి దూసుకొచ్చిన క్షిపణులు ఇరాన్‌లోని పలు జనావాసాలపై పడ్డాయి. అయితే ఎంతమంది చనిపోయారనే వివరాలు తెలియరాలేదు. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ అంతర్జాతీయ ఎయిర్‌పోర్ట్‌పైనా క్షిపణులు పడ్డాయి. ఆగ్నేయ ఇరాన్ ‘ఖుజెస్తాన్’ప్రావిన్సులోని అబదాన్ నగరంపై, మిలటరీ స్థావరం సమీపంలోని కెర్మాన్షా ప్రాంతంలోనూ ఇజ్రాయెల్ దాడులుచేసింది. ఇరాన్ గగనతల రక్షణవ్యవస్థలు ధ్వంసంకావడంతో ఇప్పుడు ఆ దేశ గగనతలం గాల్లో దీపంగా తయారైందని, ఇష్టమొచ్చినట్లు మేం దాడిచేయగలమని ఇజ్రాయెల్ రక్షణశా ఖ అధికార ప్రతినిధి బ్రిగేడియర్ జనరల్ ఎఫీడెఫ్రిన్ ప్రకటించారు. 70 ఫైటర్జెట్లతో శత్రు గగనతల రక్ష ణ వ్యవస్థను భస్మీపటలం చేశామని పేర్కొన్నారు. రేడియో ధార్మికత సాధారణమే సైన్యాధికారులను కోల్పోయి సైనికంగా, స్థావరాలను కోల్పోయి ఆయుధపరంగా, శాస్త్రవేత్తలను కోల్పోయి విజ్ఞానపరంగా ఎంతో నష్టాన్ని చవిచూసిన ఇరాన్ వెంటనే ప్రతికార దాడులకు దిగింది. శనివారం ఉదయం సైతం మరోసారి వందల కోద్దీ డ్రోన్లు, బాలిస్టిక్ క్షిపణులను ఇజ్రాయెల్‌రాజధాని టెల్ అవీవ్ సిటీమీదకు ఎక్కుపెట్టింది. ఇజ్రాయెల్ ఐరన్‌డోమ్ క్షిపణ విధ్వంసక వ్యవస్థ సమర్థవంతంగా వాటిని గాల్లోనే పేల్చేసింది. దీంతో ఆకాశంలో భారీ విస్ఫోటనాలు, మెరుపులు చూసి, భారీ శబ్దాలు విని ఇజ్రాయెల్‌వాసులు భయకంపితులయ్యారు. అయితే భారీఎత్తున ఒకేసారి క్షిపణులు దూసుకురావడంతో కొన్ని ఐరన్‌డోమ్ వ్యవస్థను దాటుకొని మరీ లక్ష్యాలను ఢీకొట్టాయి. దీంతో రిషాన్ లీజియన్ నగరంలో ఇద్దరు, టెల్‌అవీవ్‌లోని రమాత్ గాన్ ప్రాంతంలో ఒక మహిళ చనిపోయారు. డజన్ల మంది గాయపడ్డారు. సంబంధిత వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. దాడులనేపథ్యంలో టెల్ అవీవ్ సమీప బెన్ గురియణ్ అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఇజ్రాయెల్ మూసేసింది. మృతసముద్రతీర ప్రాంతంలో చాలా డ్రోన్లను కూల్చేశామని ఇజ్రాయెల్ తెలిపింది. ఇరాన్‌లోని ఇస్ఫహాన్ అణుకేంద్రంపై శుక్రవారం పలుమార్లు దాడులుజరిగాయని, రేడియోధార్మికత స్థాయిలు సాధారణ స్థాయిలోనే ఉన్నాయని అంతర్జాతీయ అణుఇంధన ఏజెన్సీ శనివారం ‘ఎక్స్’లో ఒక పోస్ట్చేసింది. ఇరాన్ ఆర్మీ చీఫ్‌గా అమీర్ హతామి ఇరాన్ నూతన ఆర్మీ చీఫ్‌గా అమీర్ హతామి నియమితులయ్యారు. ఇరాన్ సుప్రీం కమాండర్ అయతొల్లా అలీ ఖమేనీ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇకపై హతామి ఇరాన్ సైన్యానికి చీఫ్ కమాండర్‌గా వ్యవహరిస్తారు. హతామి 2013 నుంచి 2021 వరకు ఇరాన్ రక్షణ మంత్రిగా పనిచేశారు. ఇరాన్ సైనిక వ్యవస్థతో బలమైన సంబంధాలున్న హతామికి మూడు దశాబ్దాలకు పైగా వ్యూహాత్మక, కార్యాచరణ అనుభవం ఉంది. మరోవైపు బాలిస్టిక్ మిసైల్ ప్రోగ్రాం నూతన చీఫ్‌గా జనరల్ మజీద్ మౌసావితో ఖమేనీ శనివారం భర్తీచేశారు. ప్రస్తుత చీఫ్ అమీర్ అలీ హజిజాదే శుక్రవారంనాటి దాడుల్లో చనిపోవడం తెల్సిందే. యుద్ధాన్ని ఆపాలన్న ప్రపంచదేశాలు ఇప్పటికే హమాస్, ఇజ్రాయెల్ యుద్ధంతో పశ్చిమాసియాలో అస్థిరత రాజ్యమేలుతుండగా కొత్తగా ఇరాన్‌తోనూ ఇజ్రాయెల్ సమరానికి సై అనడాన్ని ప్రపంచదేశాలు తప్పుబట్టాయి. ఉద్రిక్త పరిస్థితులను తగ్గించుకోవాలని కోరాయి. శాంతిస్థాపన దిశగా చర్చలు జరపాలని శనివారం వాటికన్ సిటీలో సెయింట్ పీటర్స్ బాసిలికాలో నూతన పోప్ లియో–14 సందేశం ఇచ్చారు. ఇతర ఉనికి మరొకరు ప్రశ్నించకూడదని, బెదిరించకూడదని అన్నారు. ‘‘ఇరాన్ అణుకేంద్రంపై ఇజ్రాయెల్ బాంబులేస్తే, టెల్‌అవీవ్‌పై ఇరాన్ క్షిపణులను పడేసింది. పెరిగిన ఉద్రిక్తతలను చాలించండి. ఫుల్స్టాప్ పెట్టాల్సిన సమయమిది. శాంతి, దౌత్యమార్గాల్లో నడవండి’’అని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ శనివారం పిలుపునిచ్చారు. రహస్యంగా డ్రోన్లు తరలించి.. రష్యాలోకి ఉక్రెయిన్ రహస్యంగా డ్రోన్లను తరలించినట్లే ఇజ్రాయెల్ సైతం ఇరాన్‌లోకి రహస్యంగా డ్రోన్లను తరలించి గగనతల రక్షణవ్యవస్థల వద్దకు చేర్చింది. అదనుచూసి ఎస్–300 యాంటీ ఎయిర్‌క్రాఫ్ట్ లాంఛర్లను, రాడార్ వ్యవస్థలను డ్రోన్లతో పేల్చేసింది. రాడార్లులేకపోవడంతో సులభంగా ఇజ్రాయెల్ ఫైటర్జెట్లు ఇరాన్ ప్రధానభూభాగందాకా వచ్చి భీకరస్థాయిలో బాంబులు జారవిడిచి వినాశనం సృష్టించాయి. అర్ధరాత్రి దాడి తాలూకు వీడియో ఫుటేజీని ఇజ్రాయెల్‌నిఘా విభాగం మొస్సాద్ శనివారం విడుదలచేసింది. ఇలాంటి వీడియోలను మొస్సాద్ విడుదలచేయడం అత్యంత అరుదు. విమానాలను కూల్చేసే లాంఛర్లపై ఇజ్రాయెల్ ఆత్మాహుతి డ్రోన్లు ల్యాండ్ అయి పేలిపోవడం ఆ దృశ్యాల్లో కనిపించింది. ‘‘మావైపుగా క్షిపణులు ప్రయోగించడం మానకుంటే టెహ్రాన్‌ను అగ్నికి ఆహుతిచేస్తాం. మరుభూమిగా మార్చేస్తాం. మా పౌరులకు హాని తలపెడితే మిమ్మల్ని మసిచేస్తాం. టెహ్రాన్‌పై మరోదఫా దాడులకు మా యుద్దవిమానాలు సదా సిద్ధంగా ఉన్నాయి’’అని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి ‘ఇజ్రాయెల్ కట్జ్’అన్నారు. ఈయన పేరులో దేశంపేరూ ఉండటం విశేషం. ‘‘ముప్పును సమూలంగా తొలగించేదాకా దాడులు ఆపబోం. దాడులు రోజులతరబడి కొనసాగొచ్చు’’అని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ అన్నారు.ఇరాన్ ‘అణు’కల చెదిరింది యురేనియంను అత్యంత శుద్ధిచేసి అణుబాంబును తయారుచేయాలన్న ఇరాన్ కల చెదిరిపోయిందని ఇజ్రాయెల్ ప్రకటించింది. అణుకేంద్రం ధ్వంసంకావడం, అందులో కీలక వ్యవస్థలు కూలిపోవడంతోపాటు అత్యంత కీలకమైన 9 మంది అణుశాస్త్రవేత్తలు చనిపోయిన నేపథ్యంలో ఇరాన్ ఇప్పట్లో అణుబాంబును తయారుచేయడం అసాధ్యమని విశ్లేషణలు వెలువడుతున్నాయి. అణువిద్యుత్ కేంద్రానికి సరిపడా యురేనియంను శుద్ధిచేసేందుకు ఇరాన్‌కు అనుమతి ఉండగా అదనపు యురేనియంను శుద్ధిచేస్తోందని చాన్నాళ్ల నుంచి ఆరోపణలురావడం తెల్సిందే. శుక్రవారంనాటి దాడుల్లో అణువిద్యుత్కేంద్రం బ్యాకప్ ఇంధన శక్తివ్యవస్థను ఇజ్రాయెల్ నాశనంచేసింది. దీంతో కరెంట్ కష్టాలు సైతం పెరగనున్నట్లు తెలుస్తోంది.అణు చర్చలు అర్థ్ధరహితంఅమెరికా ఓవైపు మాపై యుద్ధానికి ఇజ్రాయెల్‌ను ఎగదోస్తూ మరోవైపు చర్చలకు సిద్ధపడటం అర్థ్ధరహితమని అగ్రరాజ్యంపై ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. అణుచర్చల కోసం ఇప్పటికే ఇరుదేశాల మధ్య ఐదుసార్లు చర్చలు జరగ్గా ఆరోసారి ఆదివారం ఒమన్‌లో జరగనున్నాయి. ఇజ్రాయెల్‌ను మాతో యుద్దానికి దించి అమెరికా మరోదఫా చర్చలకు అర్థంలేకుండాచేసిందని ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఇస్మాయిల్ బఘేయిల్ వ్యాఖ్యానించారు. ఇజ్రాయెల్‌కు మద్దతిస్తే పశ్చిమాసియాలోని మీ స్థావరాలపై దాడులుచేస్తామని అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్‌లను ఇరాన్ హెచ్చరించింది. దీంతో ఆదివారం జరగబోయే చర్చలపై సందిగ్ధత నెలకొంది. మరోవైపు, ఇజ్రాయెల్ వైపుగా వెళ్తున్న కొన్ని ఇరాన్ క్షిపణులను తాము ఎయిర్‌డిఫెన్స్ వ్యవస్థలతో కూల్చేశామని అమెరికా అధికారి ఒకరు వెల్లడించడం గమనార్హం. కశ్మీర్ ‘పోస్ట్’పై ఇజ్రాయెల్ క్షమాపణలుటెహ్రాన్పై వైమానిక దాడులు చేశామంటూ ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) శుక్రవారం తమ ‘ఎక్స్’ఖాతాలో పెట్టిన ఒక పోస్ట్ భారత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. ‘‘ఇరాన్ అనేది ప్రపంచం మొత్తానికి పెనుముప్పుగా మారింది. ఇది ఇజ్రాయెల్‌ను మాత్రమే లక్ష్యంగా చేసుకోలేదు. త్వరలో అన్ని దేశాలతోనూ ఇది ఇలాగే వ్యవహరిస్తుంది. అందుకే దాడులు చేయడం మినహా మాకు మరోదారి కనిపించలేదు’’అని ఐడీఎఫ్ శుక్రవారం ఒక మ్యాప్‌ను పోస్ట్పెట్టింది. అయితే ఈ మ్యాప్‌లో జమ్మూకశీ్మర్‌ను పాకిస్తాన్లో భాగంగా చూపించింది. దీంతో నెటిజన్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. వెంటనే తప్పు తెల్సుకున్న ఇజ్రాయెల్ శనివారం క్షమాపణలు చెప్పింది. ‘‘ఈ ప్రాంత భూభాగాన్ని చూపుతూ ఊహాత్మకంగా గీసిన మ్యాప్ అది. సరిహద్దులను కచ్చితంగా సూచించడంలో ఈ మ్యాప్ విఫలమైంది. మ్యాప్ కారణంగా మేం ఏదైనా నేరానికి పాల్పడినట్లు భారత్ భావిస్తే సారీ’అని ఐడీఎఫ్ శనివారం ఒ పోస్ట్ పెట్టింది. -
ప్రొటీన్‌లో మార్పుతో రేడియో ధార్మికత నుంచి రక్షణ!
కేన్సర్‌కు అందుబాటులో ఉన్న చికిత్సల్లో రేడియో ధార్మికత ఒకటి. ఈ పద్ధతితో వ్యాధి నుంచి ఉపశమనం కలుగుతుందన్న మాట నిజమైనప్పటికీ సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ. కేన్సర్ కణాలతోపాటు ఆరోగ్యకరమైన కణాలు కూడా రేడియో ధార్మికత కారణంగా నాశనం కావడం దీనికి కారణం. ఈ సమస్యను అధిగమించేందుకు స్పెయిన్‌కు చెందిన సీఎన్ఐఓ శాస్త్రవేత్తలు చేసిన పరిశోధనలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. మన పేగుల్లోని ఒక ప్రొటీన్ ఉత్పత్తిని పెంచడం ద్వారా రేడియోధార్మికత దుష్ప్రభావాల నుంచి రక్షణ పొందవచ్చునని వీరు అంటున్నారు. ఎలుకలపై తాము జరిపిన పరిశోధనలు దీనికి రుజువని చెబుతున్నారు. ఈ పద్ధతి కేన్సర్ రోగులకు మాత్రమే కాకుండా అణు ప్రమాదాల బాధితులు, భవిష్యత్తులో సుదూర గ్రహాలకు వెళ్లే వ్యోమగాములకూ ఉపయోగపడుతుందని ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త ఆల్ముడెనా ఛావెజ్ ప్రెజ్ తెలిపారు. రేడియోధార్మికత కారణంగా నాశనమైన పేవు కణాలతోపాటు యుఆర్ఐ ప్రొటీన్ ఎక్కువగా కనిపించిన నేపథ్యంలో తాము దానిపై పరిశోధనలు చేపట్టామని ఆయన తెలిపారు. ఈ ప్రొటీన్ ఉత్పత్తిని నియంత్రించిన ఎలుకలను, సాధారణమైన వాటిని తీసుకుని రెండింటినీ రేడియోధార్మికతకు గురిచేసినప్పుడు మొదటి రకం ఎలుకలు 70 శాతం మరణించాయని, ఎక్కువ ప్రొటీన్‌ను ఉత్పత్తి చేసిన ఎలుకలన్నీ చికిత్సను తట్టుకోగలిగాయని వివరించారు. పేగు మూలల్లో ఉన్న మూలకణాలను ప్రేరేపించడం ద్వారా ఈ ప్రొటీన్ కణాలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిసిందని చెప్పారు. కేన్సర్‌కు కొత్త, నిరపాయకరమైన చికిత్సలు అందించేందుకు తమ పరిశోధన ఉపకరిస్తుందని.. వివరాలు సైన్స్ తాజా సంచికలో ప్రచురితమయ్యాయని ప్రెజ్ తెలిపారు. -
పిచ్చుక మచ్చుకైనా లేదే..!
నేడు ప్రపంచ పిచ్చుకల దినోత్సవం ఎండు పుల్లల పిచ్చుక గూళ్లు చూడటం ఎంత ముచ్చటగా ఉంటుందో, అవి పెట్టిన గుడ్లను లెక్క పెట్టడం ఎంత సంతోషాన్నిస్తుం దో..! పిచ్చుకల గురించి ఈ తరానికి కథలాగ చెప్పడం తప్ప వాటితో మనకున్న అనుబంధం, ఆ అనుభూతిని వర్ణించలేము. కాంక్రీట్ జంగిల్‌గా మారిన నగరంలో పిచ్చుకలు అంతరించిపోతున్నాయనే ఆవేదన పక్షి ప్రేమికులను ఆవేదనకు గురి చేస్తోంది. - బంజారాహిల్స్/సిటీ బ్యూరో కనుమరుగవుతున్న ఖాళీ స్థలాలు...పెరుగుతున్న ఆకాశ హర్మ్యాలు...గొడ్డలి వేటుకు నేలకొరుగుతున్న చెట్లు...సెల్పోన్ల నుండి వెలువడుతున్న రేడియోధార్మికత ఇవన్నీ కలిసి ఒకప్పుడు కిలకిలా రావాలతో కళకళలాడిన ఊరపిచ్చుకలు అంతర్ధానమయ్యాయి. మెల్లమెల్లగా ఊరపిచ్చుక అరుదైన పక్షి జాబితాలోకి చేరిపోయింది. దశాబ్దం క్రితం వరకూ నగర వ్యాప్తంగా బర్డ్ వాచర్స్ లెక్కల ప్రకారం 10 వేలకుపైగా ఊరపిచ్చుకలు కిచకిచమంటూ నగరవాసికి సరికొత్త అనుభూతిని కలిగించేవి. అయితే ఇప్పుడా జాతి దాదాపుగా అంతిమ దశకు చేరుకోవడం పట్ల పక్షి ప్రియులు, పర్యావరణ ప్రియులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడున్న లెక్కల ప్రకారం నగర వ్యాప్తంగా పచ్చదనం, బాగా చెట్లు ఉన్నచోట మాత్రమే 500 వరకూ పిచ్చుకలు ఉన్న ట్లు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అంతరించిపోతున్న పిచ్చుకలను కాపాడుకొనేందుకు వాటి మనుగడ కొనసాగి భావితరాలకు వాటి ప్రాముఖ్యతను తెలిపేందుకు వీటిపై అవగాహన కలిగించేందుకు, చైతన్యం తీసుకురావడానికి ప్రతియేటా మార్చి 20వతేదీన ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని జరుపుతున్నారు.ఇందులో భాగంగానే పర్యావరణ నిపుణులు, పక్షి ప్రియులు ఈ రోజున పిచ్చుకల అవగాహన కార్యక్రమాన్ని చేపడుతూ వీటిని రక్షించుకొనే తరుణోపాయాలు చర్చిస్తున్నారు. ముఖ్యంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చే కార్యక్రమాలు చేపడుతున్నారు. 90 శాతం కనుమరుగు... జంట నగరాల్లో 90 శాతం పిచ్చుకలు కనుమరుగయ్యాయని ప్రముఖ పర్యావరణ శాస్త్రవేత్త ప్రసన్న కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. తలుపులు, కిటికీలు మూసి ఉంచడం, పక్షి నిలబడే చోటు లేకపోవడం ఇందుకు కారణమని తెలిపారు. జీవవైవిద్యానికి పిచ్చుక మచ్చుతునక అని ఈ రోజు దాని ఆనవాళ్ళు కోల్పోతున్నామని పేర్కొన్నారు. ప్రస్తుతం నగరంలో శాంతినగర్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డ్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, బేగంపేట ఎయిర్పోర్ట్, నాగోల్, వివేకానందనగర్, కేబీఆర్పార్క్ ప్రాంతాల్లో మాత్రమే పిచ్చుకలు కనబడుతున్నాయని వెల్లడించారు. అంతరించిపోతున్న పిచ్చుక జాతిని రక్షించడం, వాటి ఆవాసాలను గుర్తించి సదుపాయాలను ఏర్పాటుచేయడం లక్ష్యంగా సిటిజన్స్ యాక్షన్ ఫర్ లోకల్ బయోడైవర్టీస్ అండ్ కన్జర్వేషన్ (కాల్‌బ్యాక్) అనే సంస్థను పర్యావరణ నిపుణురాలు రజినీ వక్కలంక ఏర్పాటుచేశారు. అత్తాపూర్‌లోని తాను నివసిస్తున్న ఆంబియన్స్ ఫోర్ట్ కాలనీలో పిచ్చుకల కోసం గూళ్ళు ఏర్పాటు చేశారు. కాలనీ బయట ఉన్న పార్క్‌ను పూర్తిగా పిచ్చుకల రక్షిత ప్రాంతంగా జీహెచ్ఎంసీతో కలిసి తీర్చిదిద్దారు. ఎవరైనా పిచ్చుకల గూళ్ళు కావాలంటే చెక్క ముక్కలతో తయారు చేయించి ఉచితంగా సరఫరా చేస్తున్నారు. ఇప్పటి వరకూ వేయి మందికి ఇలా పిచ్చుక గూళ్ళు పంపిణీ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులకు వీటి ప్రాముఖ్యతపై అవగాహన కలిగిస్తున్నారు. అంతేకాకుండా ఎన్విరాన్మెంట్, ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్ అండ్ ప్రాక్టీసెస్ ఇన్ స్కూల్స్ అనే అంశంపై ఉస్మానియాలో పీహెచ్డీ కూడా చేశారు. తన స్నేహితురాలు రంజని, సుజాతతో కలిసి పిచ్చుకల రక్షణకు నడుం బిగించారు. అవగాహన కల్పిస్తూ ముందుకు.. పిచ్చుకలను రక్షించుకోవడానికి కొన్ని ఫౌండేషన్లు సిటీలోని స్కూళ్లు, మాల్స్, రద్దీ ప్రదేశాల్లో వర్క్‌షాప్‌లు నిర్వహిస్తున్నాయి. పిచ్చుకల విలువ తెలుపుతూ, వాటిని దూరం చేసుకోవడం ద్వారా మనం ఏం కోల్పోతున్నామో వివరిస్తున్నాయి. మనకు హానికరమైన కొన్ని రకాల సూక్ష్మజీవులను, పురుగులను అవి భక్షిస్తాయని తెలుపుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటే.. ఏఆర్‌పీఎఫ్ సంస్థ. వన్యప్రాణి ప్రేమికులైన కాలేజీ విద్యార్థులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, గృహిణులు వలంటీర్లుగా నిలిచి నేడు ‘ప్రపంచ పిచ్చుకల దినోత్సవం’ సందర్భంగా శనివారం సైక్లోథాన్, బైకథాన్, వాకథాన్ సైతం నిర్వహించారు. రక్షించుకోవాల్సిన పక్షి ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని హేమలత ఊరపిచ్చుకలు ఆవాసం ఏర్పాటు చేసుకునే ప్రాంతాలను రక్షించుకోవాల్సిన అవసరం ఉన్నది. ముఖ్యంగా విద్యార్థులు వీటిని కాపాడాలి. తమ ఇళ్ల ముందు అట్టపెట్టెలతో చిన్న గూళ్లు ఏర్పాటు చేస్తే బాగుంటుంది. అంతేకాదు నీటి సదుపాయం కూడా ఏర్పాటు చేస్తే ఖచ్చితంగా పిచ్చుకలు వాలుతాయి. సెల్ఫోన్ల వాడకాన్ని తగ్గిస్తే ఈ పక్షి జాతి అంతరించిపోకుండా ఉంటుందని బోరబండ ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థిని హేమలత పేర్కొంది. కాపాడుకుందాం బంజారాహిల్స్: జూబ్లీహిల్స్‌లోని మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ 40వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం పలు కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా ప్రపంచ పిచ్చుకల దినోత్సవాన్ని నిర్వహించారు. బోరబండలోని ప్రభుత్వ గురుకుల పాఠశాల విద్యార్థినులకు పిచ్చుకలపై అవగాహన కలిగించారు. ఫిలింషో నిర్వహించి పిచ్చుకలు, వాటి ఆవాసాలు, అవి కనుమరుగవుతున్న తీరును ఎంసీఆర్హెచ్ఆర్డీ ప్రొఫెసర్ ప్రసన్నకుమార్ వివరించారు. పలు అంశాల్లో పోటీ నిర్వహించి విద్యార్థులకు బహుమతులు అందజేశారు. పిచ్చుక గూళ్లను అందంగా తయారు చేసిన విద్యార్థులకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఎంసీఆర్హెచ్ఆర్డీ డెరైక్టర్ జనరల్ వినోద్ కె. అగర్వాల్ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పిచ్చుకగూళ్ల తయారీ.. ఇంట్లో ఉండే స్క్రాప్ వేస్ట్, ఉడెన్ పీసెస్‌తో పిచ్చుకల గూళ్లు తయారు చేయొచ్చు. అలా తయారు చేసిన పిచ్చుక గూళ్లను స్నేహితులు, ఆత్మీయులకు గిప్ట్గా కూడా ఇవ్వొచ్చు. తద్వారా వారిలో పిచ్చుకలు అంతరించిపోతున్న విషయంపై ఆలోచన రేకెత్తించగలం. అంతేకాకుండా ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆర్నిటాలజీ విభాగం లాంటివి పిచ్చుక గూళ్లను ఉచితంగా పంపిణీ చేస్తున్నాయి. ప్రతి ఇంట్లో కిటికీకో, మూల చివర్లోనో, పైన వెంటిలేటర్ మీదో, చెట్టుకో ఇలా తయారు చేసిన గూళ్లను అమర్చితే.. ఒకటీ అరా ఏవైనా వస్తే అవి నివసించడానికి అవకాశం కల్పించిన వారమవుతాం. కేవలం గూళ్లను అమర్చుకోవడమే కాకుండా చిన్న చిప్పల వంటి వాటిలో మంచినీరు పోసి దాబాల పైన, వరండాలలో ఉంచడం, చిరుధాన్యాలు, జొన్నలు, నూకలను అక్కడక్కడ వెదజల్లుతుండడం చేస్తే వాటికి ఆహారం కల్పించిన వారమవుతాం. తద్వారా వాటి రాకను స్వాగతించొచ్చు. అలాగే మనకు వీలు కుదిరితే టై గార్డెన్స్ పెంచడం కూడా పిచ్చుకలను మన ఇంటివైపు ఆకర్షిస్తుంది.