- 1,000 మిథేన్ ప్లాంట్లతో భారత్, జపాన్ సంచలన వ్యూహం
- సీఎన్‌జీ వాహనాలకు బయోగాస్ బూస్ట్
- సుజుకి భాగస్వామ్యంతో సరికొత్త విప్లవం
- మోదీ-తకైచి భాగస్వామ్య భేటీ
- కాలుష్యానికి చెక్ పెట్టేందుకు ఇరు దేశాల భారీ డీల్
న్యూఢిల్లీ: క్లీన్ మొబిలిటీ (స్వచ్ఛమైన రవాణా) రంగంలో భారత్, జపాన్ దేశాలు ఒక భారీ విప్లవానికి తెరలేపాయి. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూనే, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా సుమారు 1,000 మిథేన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇరు దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
1,000 మిథేన్ ప్లాంట్లు – సరికొత్త రవాణా విప్లవం
ఈ ప్రతిపాదిత భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మిథేన్ ఉత్పత్తి కేంద్రాలను భారీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్యను దాదాపు 1,000కి పెంచనున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే బయోగాస్‌ను (మిథేన్) సీఎన్‌జీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది దేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.
రంగంలోకి సుజుకి – గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్
భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటార్’ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. జపాన్ ప్రభుత్వానికి చెందిన ‘గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ మద్దతుతో సుజుకి ఇప్పటికే భారత్‌లో బయోగాస్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో సీఎన్‌జీ వాహనాల వాటా 20 శాతానికి పైగా ఉండటంతో, ఈ కొత్త ఇంధన లభ్యత సీఎన్‌జీ వాహనాల వినియోగాన్ని మరింత పెంచనుంది.
మోదీ-తకైచి సదస్సు – వ్యూహాత్మక బంధం
గత ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టిన తర్వాత జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంప్రదాయ దౌత్య సంబంధాలలో భాగంగా జరగనున్న ఈ భేటీలో ఆర్థిక భద్రత, స్వచ్ఛమైన ఇంధనం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్‌తో సంబంధాలు తమకు ఎంతో కీలకమని జపాన్ భావిస్తోంది.
ఇది కూడా చదవండి: చేతిరాత బాగోలేదని నవ్వితే.. పప్పులో కాలేసినట్లే!


