అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వలస విధానాలపై మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అభివృద్ధి చెందుతున్న లేదా మూడో ప్రపంచ దేశాలుగా పిలిచే దేశాల నుంచి భారీ స్థాయిలో వలసదారులను అనుమతిస్తే, అమెరికా భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం పడుతుందని అభిప్రాయపడ్డారు.
తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో స్పందిస్తూ.. మూడో ప్రపంచ దేశాల నుంచి ప్రజలను పెద్ద ఎత్తున దిగుమతి చేసుకుంటే, చాలా త్వరగా మన దేశం కూడా మూడో ప్రపంచ దేశంలా మారిపోతుంది. దాన్ని ఆపడానికి మనమేమీ చేయలేమని పేర్కొన్నారు. అలాగే తన రాజకీయ నినాదమైన మేక్ అమెరికా గ్రేట్ అగైన్ (MAGA)ను ప్రస్తావించారు.
కాగా, ట్రంప్ రాజకీయ ప్రయాణంలో వలసల నియంత్రణ, జాతీయ గుర్తింపు, సరిహద్దు భద్రత వంటి అంశాలు కీలక అజెండాలుగా కొనసాగుతున్నాయి. తాజా వ్యాఖ్యలు కూడా అదే దృక్పథాన్ని ప్రతిబింబిస్తున్నాయి.
ఇటీవల హెచ్-1బీ వీసాలకు లక్ష డాలర్ల ఫీజు విధించే తన ప్రభుత్వ నిర్ణయాన్ని కోర్టు రద్దు చేయడంపై ట్రంప్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. అమెరికా కాంగ్రెస్ అనుమతి లేకుండా ఆ ఫీజు విధించడం చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది.
దీనిపై స్పందించిన ట్రంప్, ఫెడరల్ న్యాయమూర్తులు మా ప్రభుత్వానికి తీవ్ర ఇబ్బందులు కలిగిస్తున్నారు. న్యాయవ్యవస్థలో జరుగుతున్నది ఆశ్చర్యకరం. ఇది దేశానికి నష్టం చేస్తోందని విమర్శించారు.
మరోవైపు, జన్మహక్కు పౌరసత్వం (Birthright Citizenship) అంశంపై కూడా ట్రంప్ గతంలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి. అమెరికాలో ప్రసవం ద్వారా పిల్లలకు పౌరసత్వం లభించే విధానాన్ని కొందరు వలసదారులు దుర్వినియోగం చేస్తున్నారనే వాదనలకు ఆయన మద్దతు పలికారు.
ట్రంప్ తాజా వ్యాఖ్యలు అమెరికాలో వలస విధానాలపై మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. ట్రంప్‌మద్దతుదారులు దేశ భద్రత, జాతీయ ప్రయోజనాల కోసమే ఆయన మాట్లాడుతున్నారని చెబుతుండగా, విమర్శకులు మాత్రం ఈ వ్యాఖ్యలను వలసదారులపై ప్రతికూల అభిప్రాయాలను ప్రోత్సహించేవిగా అభివర్ణిస్తున్నారు.


