ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్‌ అవాల్సిందే! | Humanoid Robot Seen Begging For Money In China | Sakshi
Sakshi News home page

ఈ రోబో ఏం చేస్తుందో తెలిస్తే.. షాక్‌ అవాల్సిందే!

Jun 14 2026 5:08 PM | Updated on Jun 14 2026 5:27 PM

Humanoid Robot Seen Begging For Money In China

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే.. మనుషుల ఉద్యోగాలను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) లాగేసుకుంటుందనే భయాందోళనలు ఒకవైపు ఉంటే.. ఇప్పుడు రోబోలు ఏకంగా రోడ్లపైకి వచ్చి భిక్షాటన చేయడం మొదలుపెట్టాయి. ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఇటీవల చైనాకు సంబంధించిన ఓ హ్యూమనాయిడ్ రోబో రోడ్డు పక్కన మోకాళ్లపై కూర్చుని.. అటుగా వెళ్తున్న  బాటసారులను  డబ్బులు కోసం యాచన చేస్తూ.. కనిపిస్తోంది.

ఈ రోబోకు ప్రత్యేకమైన ప్రోగ్రామింగ్ చేశారు. దారినపోయే నేరుగా నగదు ఇవ్వక్కర్లేదు.. రోబో ముందు క్యూఆర్‌ కోడ్ స్కాన్ చేసి డిజిటల్ రూపంలో నగదు పంపేలా డిజైన్ చేశారు. ఈ ఘటనపై ప్రపంచవ్యాప్తంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు సరదాగా తీసుకుంటే.. మరికొందరు మాత్రం భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతున్నారు. ఇక ఏ ఉద్యోగమూ సేఫ్ కాదు బాబోయ్.. హ్యూమనాయిడ్ రోబోలు అప్పుడే రోడ్లెక్కి మరీ అడుక్కోవడం మొదలుపెట్టేశాయి అంటూ ఒక నెటిజన్ పెట్టిన కామెంట్ ఇప్పుడు విపరీతంగా షేర్ అవుతోంది.

ఈ రోబో ప్రవర్తన సాధారణంగా పరిశ్రమలు, సేవారంగం, గృహ సహాయకులుగా కనిపించే హ్యూమనాయిడ్ రోబోట్ల పాత్రలకు భిన్నంగా ఉంది. ఇప్పుడు రోబోలు కూడా అడుక్కుంటున్నాయా? ఇలాంటి పనులు యంత్రాలు అనుకరించే దిశగా సాంకేతికత అభివృద్ధి చెందుతోందా? అనే చర్చ జరుగుతోంది. ఇటీవల చెన్నైలో ఓ గృహిణి ఇంటి పనులను వీడియోల రూపంలో చిత్రీకరించి.. రోబోల శిక్షణకు సహకరించడం కూడా ఇదే తరహా చర్చకు దారితీసింది.

సాంకేతికత సాయంతో మనుషుల శ్రమను తగ్గించాల్సింది పోయి.. ఇలాంటి పనులకు కూడా రోబోలను వాడుతుండటం ఐటీ రంగంతో పాటు సాధారణ పౌరులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. అయితే, ఈ ప్రోగ్రామ్ చేసిన వ్యక్తి ఎవరు? ఈ ప్రదర్శన వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఉత్పాదకత, లాజిస్టిక్స్, రీటైల్, ప్రజా సేవల కోసం తక్కువ ఖర్చుతో కూడిన యంత్రాలను తయారు చేయడంతో.. హ్యూమనాయిడ్ రోబోల అభివృద్ధిలో చైనా ప్రపంచంలోనే అతిపెద్ద దేశాలలో ఒకటిగా ఎదిగింది.

తయారీ, లాజిస్టిక్స్, రిటైల్, ప్రజా సేవలు వంటి రంగాల్లో రోబోట్ల వినియోగం విస్తరిస్తోంది. కొన్ని సందర్భాల్లో రోబోట్లు యుద్ధకళలు ప్రదర్శించడం, కస్టమర్ సేవలు అందించడం వంటి పనులు కూడా చేస్తున్నాయి. అయితే, బహిరంగ ప్రదేశాల్లో హ్యూమనాయిడ్ రోబోట్ల వినియోగం పెరిగితే భద్రత, నైతికత, సామాజిక ప్రభావాలపై కొత్త నియమావళి అవసరమవుతుందని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement