వద్దు బాబోయ్‌ ఈ ఆడంబరాలు.. | Spending Rs 30 Lakhs on Marriage Biggest Mistake Why Indian Woman Viral Post | Sakshi
Sakshi News home page

వద్దు బాబోయ్‌ ఈ ఆడంబరాలు..

Jul 30 2026 9:06 AM | Updated on Jul 30 2026 9:28 AM

Spending Rs 30 Lakhs on Marriage Biggest Mistake Why Indian Woman Viral Post

భారతీయ వివాహాలు అనగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది ఆడంబరం, వైభవం, భారీ ఖర్చులు. మరీ ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో ‘బిగ్ ఫ్యాట్ వెడ్డింగ్స్’ సంస్కృతి మరింత శృతిమించింది. కొద్ది గంటలు లేదా కొన్ని రోజుల పాటు జరిగే వేడుకల కోసం రూ.లక్షలు ఖర్చు చేయడం పరిపాటైపోయింది. అయితే, ఈ ఆడంబరాల సంస్కృతిపై ఒక యువతి అభిప్రాయాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చర్చనీయాంశంగా మారాయి.

జీవితంలో ఘోరమైన తప్పు ఇదే!

ఇన్‌స్టాగ్రామ్ యూజర్ ప్రణతి తన రాబోయే వివాహం కోసం రూ.30 లక్షలు ఖర్చు చేయాల్సి రావడంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తన జీవితంలో ఇది అత్యంత ఘోరమైన తప్పిదం అన్నారు. సామాజిక నిబంధనలు, సమాజం విధించిన ఆచారాల కోసమే తాను ఈ ఖర్చు భరించాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె పలు వ్యాఖ్యలు చేశారు.

‘20 ఏళ్ల వయసున్నవారు తమ కష్టార్జితంలో లేదా సంపదలో మెజారిటీ భాగాన్ని కేవలం ఒక్క రోజు వేడుక కోసం ఎందుకు ఖర్చు చేస్తారో నాకు ఇప్పటికీ అర్థం కావడం లేదు. రూ.30 లక్షలు అనేది కేవలం పెళ్లి బడ్జెట్ మాత్రమే కాదు.. అది ఒక సొంతింటి డౌన్ పేమెంట్! ఒక కొత్త వ్యాపారానికి మొదటి పెట్టుబడి. మహిళల కోణంలో ఆలోచిస్తే ఏళ్ల తరబడి చేసే ఎస్‌ఐపీల మొత్తం. కానీ, సమాజం కోసం మనం దీన్ని వృథాగా ఖర్చు చేస్తున్నాం’ అన్నారు.

ఆర్థిక స్వేచ్ఛను దెబ్బతీస్తున్న ఆడంబరాలు

ఈ మొత్తాన్ని ఆదా చేసుకుంటే ఒక వ్యక్తి జీవిత గమనమే మారిపోతుందని ప్రణతి అన్నారు. ఆ నిధి ఇచ్చే ఆర్థిక వెసులుబాటుతో..

  • నచ్చని ఉద్యోగాన్ని నిర్దాక్ష్యణ్యంగా వీడవచ్చు.

  • మానసిక ప్రశాంతత లేని చెడు బంధాల నుంచి విముక్తి పొందవచ్చు.

  • కెరీర్‌లో అవసరమైనప్పుడు విరామం తీసుకునే స్వేచ్ఛ లభిస్తుంది.

‘మనం పుట్టినప్పుడే తల్లిదండ్రులు ఈ మొత్తాన్ని మన పేరిట పెట్టుబడి పెట్టడం ప్రారంభిస్తే.. మనకు 25 ఏళ్లు వచ్చేసరికి వారు కేవలం పెళ్లి మాత్రమే కాదు, ఆర్థిక స్వేచ్ఛను బహుమతిగా ఇచ్చినవారవుతారు. వివాహాలు జ్ఞాపకాలను మాత్రమే ఇస్తాయి. కానీ సంపద ఎన్నో సౌకర్యాలను ఇస్తుంది. అందుకే ఆడంబరమైన పెళ్లిళ్లకు నేను స్వస్తి పలుకుతున్నాను’ అని ఆమె స్పష్టం చేశారు.

భారతదేశంలో వివాహం అనేది కేవలం ఇద్దరి కలయిక మాత్రమే కాదు, అదొక సామాజిక హోదాగా మారింది. అయితే, సమాజం చూపించే ఆడంబరాల ఉచ్చులో పడి యువత తమ భవిష్యత్తు ఆర్థిక భద్రతను, ప్యాషన్లను బలిపెడుతోందనడానికి ప్రణతి లేవనెత్తిన పాయింట్లు నిదర్శనం. వివాహ వేడుకల ఆడంబరం కంటే ఆ తర్వాత ప్రారంభమయ్యే జీవితానికి అవసరమయ్యే ఆర్థిక స్థిరత్వానికే నేటి యువత ప్రాధాన్యమివ్వాలని నిపుణులు చెబుతున్నారు.

ఇదీ చదవండి: రైల్వే తత్కాల్ బుకింగ్‌లో మార్పులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement