
దక్షిణ కరోలినా: దక్షిణ కరోలినాలో గుజరాతీ మహిళ హత్య కేసులో ఒక అనుమానితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. సెప్టెంబర్ 16న గుజరాతీ మహిళ కిరణ్ పటేల్ మరణానికి దారితీసిన కాల్పుల సంఘటనతో సహా రెండు కాల్పుల సంఘటనలలో ప్రమేయం ఉన్న జైడాన్ మాక్ హిల్ (21)ను పోలీసులు అరెస్టు చేశారు.
సెప్టెంబర్ 16న దక్షిణ కరోలినాలోని యూనియన్ కౌంటీలోని సౌత్ మౌంటైన్ స్ట్రీట్‌లోని ఒక యార్డ్‌లో చార్లెస్ నాథన్ క్రాస్బీ(67) అనే వృద్దుడిని మృతిచెందిన స్థితిలో పోలీసులు గుర్తించారు. ఫాక్స్ న్యూస్ నివేదిక ప్రకారం అదే రోజు సాయంత్రం, కిరణ్ పటేల్ (49) పై డీడీస్ ఫుడ్ మార్ట్ పార్కింగ్ స్థలంలో కాల్పులు జరిగాయి. ఆమె తీవ్రంగా గాయపడి మృతిచెందింది. గో ఫండ్‌మీ పేజీలోని వివరాల ప్రకారం ఈ ఘటన సెప్టెంబర్ 16న రాత్రి 10:30 గంటలకు జరిగింది. ఆ సమయంలో కిరణ్ పటేల్ యూనియన్ కౌంటీలో గ్యాస్ స్టేషన్-కమ్-కన్వీనియన్స్ స్టోర్ రిజిస్టర్ వద్ద నగదు లెక్కిస్తున్నారు. హిల్ ఆమె వద్దకు వచ్చి, క్యాష్ రిజిస్టర్ లాక్కున్నాడు. ఆమె అతనికి నగదు ఇచ్చేలోపుగానే అతను కిరణ్ పటేల్‌పై కాల్పులు జరిపాడు.
అతనిని అడ్డుకునేందుకు కిరణ్ పటేల్ అతనిపైకి ప్లాస్టిక్ బాటిల్ విసిరి పరిగెత్తింది. హిల్ కూడా ఆమె వెంట పరిగెత్తాడు. ప్రాణాలను కాపాడుకునేందుకు పార్కింగ్ స్థలం వైపు పరిగెత్తిన కిరణ్ పటేల్ పై హిల్ కాల్పులు కొనసాగించాడు. ఆమెకు బుల్లెట్ తగిలి, తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయింది. తరువాత అతను ఆమె దగ్గరకు వచ్చి మరోమారు కాల్పులు జరిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన సౌత్ కరోలినా లా ఎన్‌ఫోర్స్‌మెంట్ డివిజన్ అధికారులు అరెస్ట్ వారెంట్‌తో సౌత్ చర్చి స్ట్రీట్‌లోని హిల్ ఇంటికి చేరుకున్నారు. అయితే హిల్ వారిని ప్రతిఘటించాడు. ఎట్టకేలకు పోలీసులు హిల్‌ను అరెస్ట్ చేసి, హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.