
అమెరికాను కుదిపేసిన సెక్స్ కుంభకోణం ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో డొనాల్డ్ ట్రంప్‌ను కొంతకాలం ఎలాన్ మస్క్(Elon Musk) ఇరుకునపెట్టడం తెలిసిందే. అయితే అమెరికా అధ్యక్షుడిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన మస్క్.. ఒక్కసారిగా చల్లబడ్డారు. ఈ తరుణంలో మస్క్ పేరే ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో కనిపించడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో ట్రంప్ పేరు ఉందని, అందుకే ఆ ఫైల్స్‌ను బయటపెట్టడం లేదంటూ ఈ ఏడాది జూన్‌లో మస్క్ సంచలన ఆరోపణలకు దిగారు. అయితే ఆ తర్వాత ఏమైందో తెలియదుగానీ.. వరుసబెట్టి చేసిన ట్వీట్లన్నింటినీ డిలీట్ చేసుకుంటూ వచ్చారాయన. ఈ తరుణంలో.. అమెరికా హౌజ్ ఓవర్‌సైట్ కమిటీ విడుదల చేసిన జెఫ్రీ ఎప్‌స్టీన్ ఎస్టేట్ తాలుకా డాక్యుమెంట్లలో మస్క్ పేరు కనిపించింది.
అందులో.. ఒక దగ్గర ఎలాన్ మస్క్ డిసెంబర్ 6న ఐల్యాండ్‌కు రావాలి అని ఉంది. దీంతో ఎప్‌స్టీన్‌కు చెందిన ప్రైవేట్ ద్వీపానికి మస్క్ వెళ్లారా? అనే ప్రశ్న మొదలైంది. అయితే.. ఎలాన్ మస్క్ ఈ ఆరోపణను ఖండించారు. అందులో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టత ఇచ్చారు. అయితే.. మస్క్ ఎప్‌స్టీన్ ఫైల్స్‌పై ఇలా స్పందించడం ఇదేం తొలిసారి కాదు. ఇంతకు ముందు కూడా ఆయనకు, ఎప్‌స్టీన్‌కు మధ్య సంబంధాల గురించి రకరకాల ఊహాగానాలు వినిపించాయి. అయితే.. తానెప్పుడు ఎప్‌స్టీన్ ఐల్యాండ్‌కు వెళ్లలేదని మస్క్ చెబుతూ వస్తున్నారు.
మరోవైపు.. 8,544 పేజీల డాక్యుమెంట్లలో విమాన ప్రయాణాల వివరాలు, క్యాలెండర్లు, ఎప్‌స్టీన్‌కు సంబంధించిన ఆర్థిక లావాదేవీల వివరాలు ఉన్నాయి. కేవలం మస్క్ పేరు మాత్రమే కాదు.. అందులో ట్రంప్ సహా బిల్‌గేట్స్, ప్రిన్స్ ఆండ్రూ వంటి వారి పేర్లు కూడా ఉన్నాయి. అయితే పేర్లు ఉన్నంత మాత్రానా వాళ్లు ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల వ్యవహారంలో భాగస్వాములు అయి ఉంటారనే నిర్ధారణ లేదని దర్యాప్తు సంస్థలు మొదటి నుంచి చెబుతూ వస్తుండడం గమనార్హం.
ఎవరీ ఎప్‌స్టీన్..
అమెరికాలో సంచలనం సృష్టించింది జెఫ్రీ ఎప్‌స్టీన్(Jeffrey Epstein)హైప్రొఫైల్ సెక్స్ కుంభకోణం. అమెరికన్ ఫైనాన్షియర్, ప్రముఖ ఇన్వెస్టర్ అయిన జెఫ్రీ ఎప్‌స్టీన్ లైంగిక వేధింపుల ఆరోపణలతో మీటూ ఉద్యమ సమయంలో అరెస్ట్ అయ్యాడు. ఆపై 2019లో జైల్లో అనుమానాస్పద స్థితిలో మరణించగా.. ఆత్మహత్య చేసుకున్నాడని అధికారులు ప్రకటించారు. ఇదే కేసులో అరెస్టైన ఎప్‌స్టీన్ సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్.. ప్రస్తుతం జైల్లో శిక్ష అనుభవిస్తున్నారు.
ఎప్‌స్టీన్ ఫైల్స్(EPSTEIN FILES) అనేది ఈ కుంభకోణానికి సంబంధించిన కీలక పత్రాల వ్యవహారం. ఈ ఫైల్స్‌లో ఎప్‌స్టీన్ కాంటాక్ట్ లిస్ట్, ఫ్లైట్ లాగ్‌లు, అతనికి వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలు ఉన్నాయి. అయితే ఈ కేసులో ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలు ఉన్నారని ఆరోపణలూ ఉన్నాయి. చాలా ఏళ్లపాటు మైనర్ బాలికలపై ఎప్‌స్టీన్ లైంగిక దాడికి పాల్పడ్డాడన్నది ప్రధాన ఆరోపణ. అంతేకాదు.. 90వ దశకం నుంచి అమెరికాలో ప్రముఖ ప్రముఖ రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, సెలబ్రిటీలకు ఎప్‌స్టీన్ అమ్మాయిలను సప్లై చేశాడని, ఈ వ్యవహారంలో అతని సన్నిహితురాలు గిస్లేన్ మాక్స్‌వెల్ సహకరించారన్న అభియోగాలు ఉన్నాయి. అయితే ట్రంప్ అధికారంలోకి వచ్చాక ఆ ఫైల్స్ వివరాలు బహిర్గతం అవుతాయని అంతా భావించారు. అందుకు తగ్గట్లే..
ఎఫ్‌బీఐ, అమెరికా న్యాయవిభాగం ఆ బాధ్యతలు సంయుక్తంగా చేపట్టాయి. అయితే జులై మొదటి వారంలో యూఎస్ అటార్నీ జనరల్ పామ్ బాండీ అనూహ్యమైన ప్రకటన చేశారు. అందులో సంచలనాత్మక వివరాలేవీ లేవని అన్నారామె. ఎప్‌స్టీన్ వద్ద ‘క్లయింట్ లిస్ట్’ లేదు. ఆయన బ్లాక్‌మెయిల్ చేయలేదని, ప్రాముఖ్యమైన వ్యక్తులపై నేరపూరిత ఆధారాలు లేవని” పేర్కొన్నారు. అయితే..
ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న సన్నిహిత సంబంధాల కారణంగానే ఆ వివరాలను బయటపెట్టనివ్వడం లేదన్న విమర్శలు తీవ్రస్థాయిలో వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్లే ఇద్దరూ కలిసి ఉన్న ఫొటోలు(పాతవి) నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ట్రంప్ వివాహ వేడుకలోనూ ఎప్‌స్టీన్ కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుండడం గమనార్హం. ఈ క్రమంలో.. ఈ సెక్స్ స్కాండల్‌ను కదిలించిన అమెరికన్ విజువల్ ఆర్టిస్ట్ మరియా ఫార్మర్(ఎప్‌స్టీన్‌పై ఫిర్యాదు చేసిన తొలి వ్యక్తి.. ఈమె కేసులోనే ఎప్‌స్టీన్ అరెస్టయ్యాడు).. ట్రంప్‌ను కూడా ఎఫ్‌బీఐ సంస్థ విచారించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆ విగ్రహం తొలగింపు
ఎప్‌స్టీన్ ఫైల్స్‌తో ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టేందుకు ప్రత్యర్థులు రకరకాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాషింగ్టన్‌లోని నేషనల్ మాల్ దగ్గర ట్రంప్- ఎప్‌స్టీన్ చేతులు కలిపి సరదాగా ఉన్న ఓ విగ్రహాన్ని సెప్టెంబర్ 23వ తేదీన ఏర్పాటు చేశారు. Best Friends Forever అనే క్యాప్షన్ అక్కడ ఉంచారు. ఇది జనాలను విపరీతంగా ఆకర్షించింది. అయితే.. నిబంధనల ఉల్లంఘన పేరిట ఆ మరుసటిరోజే అధికారులు దానిని అక్కడి నుంచి తొలగించారు. సీక్రెట్ షేక్‌హ్యాండ్ అనే సంస్థ ఈ విగ్రహం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.