ట్రంప్‌ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు | Donald Trump imposes 10percent basic tariff on nearly all countries | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ సుంకాల జోరు.. దేశాలన్నీ బేజారు

Apr 4 2025 4:37 AM | Updated on Apr 4 2025 4:37 AM

Donald Trump imposes 10percent basic tariff on nearly all countries

భారత్‌పై 26 కాదు, 27 శాతం 

మొత్తం 60 దేశాలపై వడ్డన 

ఆచితూచి స్పందించిన కేంద్రం 

మోదీ ప్రభుత్వ వైఫల్యం: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ: అమెరికాకు ‘విముక్తి దినం’గా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చెబుతూ వచ్చిన ఏప్రిల్‌ 2 మిగతా ప్రపంచం పాలిట దుర్దినంగా మిగిలిపోయింది. భారత్‌తో పాటు ఏకంగా 60 పై చిలుకు దేశాలపై ఆయన వాణిజ్య కొరడా ఝళిపించడంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పెను కుదుపుకు లోనైంది. వాళ్లూ, వీళ్లూ అని తేడా చూపకుండా అన్ని దేశాల మీదా 10 నుంచి 50 శాతం దాకా సుంకాలు బాదడం ద్వారా ప్రపంచ వాణిజ్య యుద్ధానికి ట్రంప్‌ తెర తీశారు. 

ఈ మేరకు ఎగ్జిక్యూటివ్‌ ఆర్డర్‌పై బుధవారం సంతకం చేశారు. భారత్‌ను తప్పుడు వాణిజ్య విధానాలు అనుసరిస్తున్న ‘దారుణ దేశం’గా ఈ సందర్భంగా అభివర్ణించారు! అన్నిరకాల భారత ఉత్పత్తుల మీదా 26 శాతం ప్రతీకార సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించగా, అనంతరం దాన్ని 27 శాతంగా సవరించారు. అమెరికాకు అత్యవసరమైన ఫార్మాస్యూటికల్స్, సెమీ కండక్టర్లు, పలు ఖనిజాలు తదితరాలను మాత్రం సుంకాల బాదుడు నుంచి మినహాయించారు. 

అమెరికాలోకి ప్రవేశించే అన్ని వస్తూత్పత్తుల మీదా 10 శాతం బేసిక్‌ టారిఫ్‌ విధించారు. ఇది ఏప్రిల్‌ 5 నుంచి అమల్లోకి వస్తుంది. అమెరికా ఉత్పత్తులపై అధిక సుంకాలు వసూలు చేస్తున్న భారత్‌ తదితర దేశాలను వాణిజ్యపరంగా ‘ధూర్త దేశాలు’గా ట్రంప్‌ ఆక్షేపిస్తుండటం తెలిసిందే. వాటిపై అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ప్రకటించారు. అవి ఏప్రిల్‌ 9 నుంచి అమల్లోకి రానున్నాయి. 

ఆ లెక్కన భారత ఉత్పత్తులపై 10 శాతం బేస్‌లైన్‌ టారిఫ్‌ ఏప్రిల్‌ 5 నుంచి, 27 శాతం అదనపు సుంకాల వసూలు ఏప్రిల్‌ 9 నుంచి మొదలవుతాయి. చైనాపై ఇటీవలే 20 శాతం సుంకాలు విధించగా మరో 34 శాతం అదనపు సుంకాలు విధిస్తున్నట్టు ట్రంప్‌ తాజాగా ప్రకటించారు! ట్రంప్‌ నిర్ణయంతో అమెరికా వార్షిక పన్ను వసూళ్లు ఏటా 60 వేల కోట్ల డాలర్ల మేరకు పెరుగుతాయని వైట్‌హౌస్‌ వాణిజ్య సలహాదారు పీటర్‌ నవారో అంచనా వేశారు. 

ట్రంప్‌ ప్రకటనను దేశాలన్నీ దుయ్యబట్టాయి. అమెరికాపై ప్రతీకార సుంకాలు తప్పవని యూరోపియన్‌ యూనియన్, చైనా హెచ్చరించాయి. ట్రంప్‌ పునరాలోచించాలని పలు దేశాలు విజ్ఞప్తి చేశాయి. దీనిపై భారత్‌ ఆచితూచి స్పందించింది. పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్‌ చౌదరి తెలిపారు. ‘‘ట్రంప్‌కు అమెరికా ఫస్ట్‌ అయితే మోదీకి భారతే ఫస్ట్‌. దీనిపై ఎలా ముందుకెళ్లాలో ఆలోచిస్తాం’’ అన్నారు. 

ట్రంప్‌ వలలో మోదీ: కాంగ్రెస్‌ 
భారత్‌పై అమెరికా తాజా సుంకాల మోతను మోదీ ప్రభుత్వ వైఫల్యంగా కాంగ్రెస్‌ అభివర్ణించింది. ‘‘మోదీ తన మిత్రుడంటూ ట్రంప్‌ ఆప్యాయత కనబరుస్తారు. బహిరంగంగా కౌగిలించుకున్నారు. కానీ తాను పక్కా వ్యాపారినని నిరూపించుకుంటూ మోదీపై చాకచక్యంగా వల విసిరారు. మనవాడు అందులో ఇరుక్కుపోయాడు’’ అని కాంగ్రెస్‌ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే దుయ్యబట్టారు. తాజా సుంకా లు భారత ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తా యని లోక్‌సభలో వి పక్ష నేత రాహుల్‌గాంధీ ఆందోళన వెలిబుచ్చా రు. వీటిని ఎలా ఎదుర్కోనున్నదీ కేంద్రం తక్షణం వివరించాలని డిమాండ్‌ చేశారు.

మెరుగ్గా, బలంగా, దృఢంగా: ట్రంప్‌
ప్రపంచ దేశాలపై తాను విధించిన తాజా సుంకాల మీద ట్రంప్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఆపరేషన్‌ ముగిసింది. రోగి బతికాడు. భేషుగ్గా ఉన్నాడు. చక్కగా కోలుకుంటున్నాడు. మునపటి కంటే పెద్దగా, మెరుగ్గా, బలంగా, ఎన్నడూ లేనంత దృఢంగా తయారవుతాడని తేలింది’’ అని  ట్రూత్‌సోషల్‌లో కామెంట్‌ చేశారు.

ఇండియాపై ఇరవై ఆరా, ఇరవై ఏడా? 
ట్రంప్‌ ప్రకటన నేపథ్యంలో భారత్‌తో పాటు పలు దేశాలపై అమెరికా విధించనున్న తాజా టారిఫ్‌లు ఎంతన్న దానిపై సందిగ్ధత నెలకొంది. భారత్‌తో పాటు 14 దేశాలపై ట్రంప్‌ ప్రకటించిన సుంకాలకు, అనంతరం వైట్‌హౌస్‌ విడుదల చేసిన వివరాలకు మధ్య తేడా ఉండటమే ఇందుకు కారణం. ట్రంప్‌ ప్రకటన అనంతరం ఆయా దేశాలపై టారిఫ్‌లను అమెరికా సవరించడమే ఇందుకు కారణమని బ్లూంబర్గ్‌ వివరించింది. ఆ మేరకు భారత్‌పైనా సుంకం ఒక శాతం పెరిగింది. 

దాన్ని 26 శాతంగా ట్రంప్‌ పేర్కొనగా తర్వాత దాన్ని 27 శాతంగా సవరించారు. గురువారం అనుబంధ ప్రకటనలో వైట్‌హౌస్‌ ఈ మేరకు పేర్కొంది. భారత్‌తో పాటు దక్షిణకొరియ సహా మొత్తం 14 దేశాలపై సుంకాలను సవరించారు.  కెనడా ప్రతీకార సుంకాలు అమెరికా చర్యలకు ప్రతీకారం తప్పదని ఇప్పటికే ప్రకటించిన కెనడా అన్నంత పనీ చేసింది. అమెరికాకు చెందిన ఆటో ఉత్పత్తులపై 25 శాతం సుంకాలు విధిస్తున్నట్టు గురువారం ప్రకటించింది. దీని ప్రభా వం అమె రికా ఆటో రంగంపై తీవ్రంగానే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

కెనడా, మెక్సికోలకు మినహాయింపు
ఐఈఈపీఏ స్టాండింగ్‌ ఆర్డరే కారణం
ఆ దేశాలపై ఇప్పటికే 25 శాతం బాదుడు

డొనాల్డ్‌ ట్రంప్‌ వడ్డించిన తాజా సుంకాల నుంచి కెనడా, మెక్సికోలకు మినహాయింపు లభించింది. కైనడా, మెక్సికోలపై భారీ సుంకాలు తప్పవని పదేపదే చెబుతూ వచ్చినా తాజా టారిఫ్‌ల జాబితాలో వాటిని చేర్చలేదు. ఫెంటానిల్, వలసలకు సంబంధించిన ఇంటర్నేషనల్‌ ఎమర్జెన్సీ ఎకనామిక్‌ పవర్స్‌ యాక్ట్‌ (ఐఈఈపీఏ) కింద స్టాండింగ్‌ ఆర్డర్ల కారణంగా కెనడా, మెక్సికోలకు కొత్త టారిఫ్‌లు వర్తించవని వైట్‌హౌస్‌    స్పష్టం చేసింది. అమెరికా–మెక్సికో–కెనడా ఒప్పందం (యూఎస్‌ఎంసీఏ) కింద అమెరికాలోకి ప్రవేశించే వస్తువులకు కూడా కొత్త సుంకాల నుంచి మినహాయింపు ఉంటుంది. అయితే చైనాతో పాటుగా కెనడా, మెక్సికోలపై ట్రంప్‌ ఇటీవలే 25 శాతం సుంకాలు విధించడం తెలిసిందే. కనుక తాజా మినహాయింపు వాటికి పెద్దగా ఉపశమనం కలిగించబోదు. 

Advertisement
 
Advertisement
Advertisement