పాక్‌ సైన్యాధ్యక్షుడి కోసం మొస్సాద్‌ సీక్రెట్‌ ఆపరేషన్‌?! | Mossad Plot To Assassinate Pakistan Army Chief Asim Munir? Explosive Claims Trigger Global Buzz | Sakshi
Sakshi News home page

పాక్‌ సైన్యాధ్యక్షుడి కోసం మొస్సాద్‌ సీక్రెట్‌ ఆపరేషన్‌?!

Jun 25 2026 7:34 AM | Updated on Jun 25 2026 12:01 PM

Did Netanyahu Order a Mossad Hit on Asim Munir

ఇరాన్‌-అమెరికా శాంతి చర్చల నేపథ్యంలో.. పాకిస్థాన్‌ సైన్యాధ్యక్షుడు ఫీల్డ్‌ మార్షల్‌ అసీం మునీర్‌ను హత్య చేయడానికి ఇజ్రాయెల్‌ ప్లాన్‌ చేసిందా?.. ఇందుకోసం ఆ దేశపు గూఢచారి సంస్థ మొస్సాద్‌ను ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు రంగంలోకి దించారా?.. ఓ  బ్రెజిలియన్‌ జర్నలిస్టు చేసిన సంచలన ఆరోపణలు ఇప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. 

ఇరాన్‌-అమెరికా మధ్య ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాల్లో భాగంగా.. పాకిస్థాన్‌తో పాటు ఖతార్‌ దేశాలు మధ్యవర్తిత్వం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియలో రూపొందిన ఒప్పందానికి సైతం "ఇస్లామాబాద్‌ మెమొరాండం ఆఫ్‌ అండర్‌స్టాండింగ్‌"గా పిలిచారు. ఆపై తదుపరి చర్చలు స్విట్జర్లాండ్‌లోని జెనీవాలో జరిగాయి. వీటికి అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్‌తో పాటు పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌, ఆ దేశపు సైన్యాధ్యక్షుడు అసీం మునీర్‌ కూడా హాజరయ్యారు.

అయితే.. ఈ నేపథ్యంతో ప్రముఖ రాజకీయ వ్యాఖ్యాత మారియో నాఫల్‌ నిర్వహించిన పోడ్‌కాస్ట్‌లో బ్రెజిలియన్‌ జర్నలిస్టు, జియోపాలిటికల్‌ విశ్లేషకుడు పెపే ఎస్కోబార్‌ సంచలన ఆరోపణలకు దిగాడు. మొస్సాద్‌(Mossad) సంస్థ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహూ ఆదేశాల మేరకు అసీం మునీర్‌తో పాటు పాకిస్థాన్‌ ప్రతినిధి బృందంపై హత్యాయత్నానికి సిద్ధమైంది. ఈ విషయమై పాకిస్థాన్‌ మిలిటరీ ఇంటెలిజెన్స్‌కు అత్యంత విశ్వసనీయ సమాచారం అందింది అని పేర్కొన్నాడు. 

అంతేకాక.. ఈ సమాచారం అందిన వెంటనే పాకిస్థాన్‌ తన మధ్యవర్తుల ద్వారా ఇజ్రాయెల్‌కు గట్టి హెచ్చరిక పంపిందని ఎస్కోబార్‌ చెప్పారు. "మా ప్రతినిధి బృందాన్ని తాకితే మిమ్మల్ని ప్రపంచ పటంలో నుంచి చెరిపేస్తాం" అనే సందేశం పాక్‌ ఇజ్రాయెల్‌కు పంపిందని ఆయన ఆ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు. 

మొస్సాద్‌ అనేది ఇజ్రాయెల్‌కు చెందిన అత్యంత కీలక విదేశీ గూఢచారి సంస్థ. దీని పూర్తి పేరు "ది ఇన్‌స్టిట్యూట్‌ ఫర్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ స్పెషల్‌ ఆపరేషన్స్‌". 1949లో స్థాపించబడిన ఈ సంస్థ.. విదేశాల్లో గూఢచర్యం, ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్లు, రహస్య సమాచార సేకరణ వంటి బాధ్యతలు నిర్వహిస్తుంది. శత్రు దేశాల్లో రహస్య ఆపరేషన్లు నిర్వహించడంలో, ఇజ్రాయెల్‌కు ముప్పుగా భావించే వ్యక్తులను గుర్తించి నిర్వీర్యం చేయడంలో మొస్సాద్‌కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు ఉంది. ప్రపంచంలోని అత్యంత శక్తివంతమైన ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీలైన అమెరికా సీఐఏ, బ్రిటన్‌ ఎంఐ6, రష్యా ఎఫ్‌ఎస్‌బీ(గతంలో KGB)  వంటి ప్రముఖ గూఢచారి సంస్థల సరసన దీనికి చోటు ఉంది.

ఇదిలా ఉండగా, పాకిస్థాన్‌-ఇజ్రాయెల్‌ సంబంధాలు ఎప్పటి నుంచో ఉద్రిక్తంగానే ఉన్నాయి. పాకిస్థాన్‌ ఇప్పటికీ ఇజ్రాయెల్‌ను దేశంగా అధికారికంగా గుర్తించలేదు. గాజా విషయంలోనూ ఇజ్రాయెల్‌పై పాక్‌ ఎప్పటికప్పుడు విరుచుకుపడుతూ వస్తోంది. ఈ విషయమై ఇటీవల పాకిస్థాన్‌ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్‌ కూడా ఇజ్రాయెల్‌పై తీవ్ర విమర్శలు గుప్పించారు. దీంతో పాకిస్థాన్‌ ‘ఇరాన్‌-అమెరికా’ చర్చల్లో నిజంగా తటస్థ మధ్యవర్తిగా వ్యవహరించగలదా? అనే సందేహాలు ఇజ్రాయెల్‌ వర్గాలు వ్యక్తం చేశాయి.

అయితే మునీర్‌ హత్యకు కుట్ర జరిగిందన్న ఆరోపణలపై పాకిస్థాన్‌ ప్రభుత్వం గానీ, సైన్యం గానీ ఈ విషయాన్ని అధికారికంగా ధ్రువీకరించలేదు. అలాగే ఇటు ఇజ్రాయెల్‌ ప్రభుత్వం కూడా ఈ ఆరోపణలపై స్పందించలేదు. అయితే.. ఎస్కోబార్‌ చేసిన ఆరోపణలను పాకిస్థాన్‌కు చెందిన పలువురు సీనియర్‌ జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. 

పాక్‌ ప్రముఖ జర్నలిస్టు సయ్యద్‌ తలత్‌ హుస్సేన్‌ సోషల్‌ మీడియాలో స్పందిస్తూ "ఇందులో ఒక్క ముక్క నిజం కూడా లేదు. అలాంటి ఘటన ఏదీ జరగలేదు" అని స్పష్టం చేశారు. ఒక సీనియర్‌ భద్రతాధికారి కూడా ఈ కథనాన్ని "వక్రీకృత ప్రచారం"గా అభివర్ణించినట్లు వెల్లడించారు. దీంతో ప్రస్తుతానికి అసీం మునీర్‌పై మొస్సాద్‌ హత్యాయత్నం జరిగిందన్న ప్రచారం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో.. కొన్ని వర్గాల్లో మాత్రమే చక్కర్లు కొడుతున్న ఆరోపణగానే ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement