కెనడా దేశ చరిత్రలోనే అతిపెద్ద బంగారు దోపిడీగా గుర్తింపు పొందిన కేసులో ప్రధాన నిందితుడైన సిమ్రాన్ ప్రీత్ పనేసర్‌ను తమకు అప్పగించాలని కెనడా అధికారులు అధికారికంగా భారత ప్రభుత్వాన్ని కోరారు. ఈ దోపిడీకి సంబంధించి దాదాపు 20 మిలియన్ డాలర్లకు పైగా విలువైన కార్గో మాయం అయింది.
ఎయిర్ కెనడా మాజీ ఉద్యోగి, బ్రాంప్టన్‌కు చెందిన 33 ఏళ్ల సిమ్రాన్ ప్రీత్ పనేసర్ 2023 ఏప్రిల్‌లో టొరంటో పియర్సన్ అంతర్జాతీయ విమానాశ్రయంలో జరిగిన భారీ దోపిడీలో కీలక పాత్ర పోషించినట్లు కెనడా పోలీసులు ఆరోపిస్తున్నారు. స్విట్జర్లాండ్‌లోని జ్యూరిచ్ నుంచి వచ్చిన అధిక విలువైన రవాణాను మళ్లించడంలో అతడు లోపలి వ్యక్తిగా సహకరించాడని దర్యాప్తు అధికారులు తెలిపారు.
ఈ రవాణాలో సుమారు 400 కేజీల .9999 స్వచ్ఛమైన బంగారం అంటే దాదాపు 6,600 గోల్డ్ బార్‌లు (కడ్డీలు), అలాగే 2.5 మిలియన్ డాలర్ల విదేశీ కరెన్సీ ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దోపిడీ అనంతరం పనేసర్ భారత్‌కు పారిపోయినట్లు కెనడా అధికారులు అనుమానిస్తున్నారు. దీంతో అతనిపై కెనడా వ్యాప్తంగా అరెస్ట్ వారెంట్ జారీ చేయడమే కాకుండా, భారతదేశానికి అధికారిక అప్పగింత అభ్యర్థన పంపారు.
‘ప్రాజెక్ట్ 24K’ అనే కోడ్ నేమ్‌తో ఈ దర్యాప్తు కొనసాగుతోంది. 2023 ఏప్రిల్ 17న టొరంటో పియర్సన్ విమానాశ్రయంలోని ఎయిర్ కెనడా కార్గో ఫెసిలిటీలో ఈ దోపిడీ జరిగింది. ఒక నిందితుడు ఐదు టన్నుల డెలివరీ ట్రక్కులో వచ్చి గిడ్డంగి నుంచి రవాణాను తీసుకెళ్లినట్లు అధికారులు తెలిపారు. రవాణా తాత్కాలికంగా భద్రత కలిగిన హోల్డింగ్ ఏరియాలో ఉంచినప్పటికీ, మరుసటి రోజు అది కనిపించకుండా పోయినట్లు గుర్తించారు.
ఈ దోపిడీ అత్యంత పక్కా ప్రణాళికతో, లోపలి వ్యక్తులు, బయటి సహచరుల సహకారంతో జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటి వరకు పది మందిపై కేసులు నమోదు కాగా, 21 మిందికి పైగా క్రిమినల్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే దొంగిలించిన బంగారం ఎక్కువ భాగం ఇంకా స్వాధీనం కాలేదు.
పీల్ రీజినల్ పోలీస్ చీఫ్ నిషాన్ దురైయప్ప ఈ అప్పగింత అభ్యర్థన ప్రాధాన్యతను నొక్కి చెబుతూ.. “మీరు ఎక్కడ దాక్కున్నా, మేము మిమ్మల్ని కనుగొంటాం. సరిహద్దులను దాటిన సంక్లిష్ట నేరాలను ఎదుర్కొనే మా సామర్థ్యాన్ని ప్రాజెక్ట్ 24Kతో చూపిస్తాం” అన్నారు.
పనేసర్‌పై 5,000 డాలర్లకు పైగా దొంగతనం, నేరానికి కుట్ర వంటి తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. ఎయిర్ లైన్ ఉద్యోగిగా అతనికి ఉన్న అంతర్గత ప్రాప్యతే ఈ దోపిడీకి కీలకంగా మారిందని అధికారులు పేర్కొన్నారు. న్యాయ సలహా తీసుకుని స్వచ్ఛందంగా లొంగిపోవాలని పోలీసులు అతనిని కోరుతూ, దర్యాప్తు ఇంకా కొనసాగుతుందని, మరిన్ని అరెస్టులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించారు.
ఇక ఈ అప్పగింత అభ్యర్థన భారత్–కెనడా న్యాయ సహకారాన్ని పరీక్షించనుంది. ఇప్పటికే ఉన్న ద్వైపాక్షిక ఒప్పందాలు, భారతదేశ దేశీయ చట్టాల ప్రకారం ఈ అభ్యర్థనను భారత అధికారులు పరిశీలించి నిర్ణయం తీసుకోనున్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న మరో కీలక పరిణామంగా, జనవరిలో దుబాయ్ నుంచి కెనడాకు వచ్చిన అనంతరం మరో 43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసినట్లు వెల్లడించారు. పనేసర్ కోసం గాలింపు చర్యలు మాత్రం ఇంకా కొనసాగుతున్నాయి.


