వణికిన వెనెజువెలా  | Buildings collapse after powerful earthquake hits Venezuela | Sakshi
Sakshi News home page

వణికిన వెనెజువెలా 

Jun 26 2026 4:46 AM | Updated on Jun 26 2026 4:46 AM

Buildings collapse after powerful earthquake hits Venezuela

రెండు శక్తివంతమైన భూకంపాల ధాటికి అతలాకుతలం 

కుప్పకూలిన వేలాది భవనాలు 

188 మంది దుర్మరణం 

వేయి మందికి పైగా గాయాలు 

శిథిలాల కింద పెద్దసంఖ్యలో జనం! 

కొనసాగుతున్న సహాయక చర్యలు 

మృతుల సంఖ్య పెరిగే అవకాశం

కరాకస్‌/న్యూఢిల్లీ/టోక్యో/ఫోర్ట్‌ బ్రాగ్‌: దక్షిణ అమెరికా ఖండంలోని వెనెజువెలా దేశం బుధవారం రెండు శక్తివంతమైన భూకంపాలకు చివురుటాకులా గజగజా వణికిపోయింది. 39 సెకన్ల వ్యవధిలో వచ్చిన భూకంపాల ధాటికి దేశంలో వేలాదిగా కట్టడాలు పేకమేడల్లా కుప్పకూలాయి. చాలా ప్రాంతాలు శిథిలాలతో నిండిపోయి మరుభూమిగా మారాయి. భవనాలు కూలడంతో, శిథిలాలు మీద పడటంతో 188 మంది సజీవ సమాధి అయ్యారు. 1,000 మందికిపైగా గాయాలపాలయ్యారు. 

చాలా మంది జాడ గల్లంతైంది. శిథిలాల కింద పెద్దసంఖ్యలో జనం చిక్కుకున్నారన్న వార్తల నడుమ మృతుల సంఖ్య భారీగా పెరగొచ్చని సహాయక బృందాలు వెల్లడించాయి. స్థానిక కాలమానం ప్రకారం బుధవారం సాయంత్రం రాజధాని కరాకస్‌ నగరానికి పశ్చిమంగా 170 కిలోమీటర్ల దూరంలో రిక్టర్‌ స్కేల్‌పై 7.2 తీవ్రతతో మొదటి భూకంపం సంభవించింది. 39 సెకన్ల తర్వాత అంతకంటే అధిక తీవ్రత(7.5)తో మరో భూకంపం వచ్చింది. 

రెండు భూకంపాల దెబ్బకు భవనాలు కుప్పకూలాయి. ఇంత తీవ్రతతో వెంట వెంటనే భారీభూకంపాలు రావడం వెనెజువెలాలో గత వందేళ్లలో ఇదే తొలిసారి. భూప్రకంపనలతో ఇళ్లు, దుకాణాలు, కర్మాగారాలు దారుణంగా దెబ్బతిన్నాయి. దేశంలోని ప్రధాన సైమన్‌ బొలివర్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సైతం దెబ్బతింది. దీంతో విమాన రాకపోకలను నిలిపేశారు. 

కూలిన భవనాల నుంచి క్షతగాత్రులను రక్షించేందుకు సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. యుద్ధప్రాతిపదికన సహాయక, అన్వేషణ చర్యలు చేపడుతున్నామని దేశ తాత్కాలిక అధ్యక్షురాలు డెల్సీ రోడ్రెజ్‌ తెలిపారు. ఉత్తర కరాకస్‌లోని లా గువైరా నగరం అన్నింటికన్నా ఎక్కువగా నాశనమైంది. నగరంలో ఎటుచూసిన ప్రకృతి ప్రకోప విలయం కన్పిస్తోంది. కుప్పకూలిన భవనాలతో నగరం మరుభూమిని తలపిస్తోంది. 

రక్తమోడుతున్న స్థానికులను అతి కష్టంమీద శిథిలాల నుంచి బయటకు తీసుకొచ్చి అక్కడే నేలమీదనే పడుకోబెట్టి చికిత్సచేస్తున్న దృశ్యాలు, భూకంపం వేళ జనం భవనాల నుంచి ప్రాణభయంతో బయటకు పరుగులు తీస్తున్న దృశ్యాలు మీడియాలో ప్రసారమయ్యాయి. దక్షిణ అమెరికా, కరీబియా భూఫలకాల కూడలిలో ఉండే వెనెజువెలాలో భూకంపాలు సర్వసాధారణం. కానీ ఇలాంటి భారీభూకంపాలు తక్కువే.

 తొలి భూకంప కేంద్రాన్ని కరీబియన్‌ తీరంలోని పశ్చిమ మోరాన్‌లో భూమికి 22 కిలోమీటర్ల లోపల గుర్తించామని అమెరికా జియోలాజికల్‌ సర్వే తెలిపింది. తర్వాత వచ్చిన భూకంపం కేంద్రాన్ని ఈశాన్య మోరాన్‌లో భూమికి 10 కిలోమీటర్ల లోతులో గుర్తించారు. భూకంప కేంద్రం తక్కువ లోతులో ఉంటే భూకంప వినాశనం దారుణంగా ఉంటుంది. ‘‘మేమున్న భననం కదలడం చూసి భయంతో వణికిపోయాం. కూలి మీదపడుతుందని అనుకున్నా. 

చలిలో అమ్మ, కూతురుతో ఆరుబయటే ఉండిపోయాం. కంటిమీద కనుకులేదు. భయంతో ఏడుస్తూ ఉండిపోయాం. బతుకుతామని అనుకోలేదు’’అని 41 ఏళ్ల స్థానికురాలు మేరియా క్రిస్టినా డియాజ్‌ తెలిపారు. పైపులు పేలి మరింత ప్రమాదం సంభవిస్తుందని ముందు జాగ్రత్తగా ఇళ్లకు సహజవాయు పైప్‌లైన్‌ సరఫరాను అధికారులు నిలిపేశారు. విద్యుత్‌ సరఫరా ఆగపోవడంతో కరాకస్‌ నగరంలో అంధకారం అలుముకుంది. మొబైల్‌ సేవలు నిలిచిపోయాయి. విద్యాశాఖ స్కూళ్లకు సెలవులు ప్రకటించింది. సబ్‌వే సర్వీసులను రద్దుచేశారు. 

దేశంలో అంతర్గత సమస్యల కారణంగా విధించిన సోషల్‌మీడియాపై ఆంక్షలను ఆపత్కాలంలో ఎత్తేసి భూకంపబాధితులకు, బంధువులకు సాయపడాలని ప్రభుత్వాన్ని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కమిషన్‌ కోరింది. 2025 ఆగస్ట్‌లో నాటి అధ్యక్షుడు నికొలస్‌ మదురో ‘ఎక్స్‌’వంటి సామాజికమాధ్యమాలపై నిషేధం విధించారు. ప్రకృతి విపత్తు నేపథ్యంలో ఈ ఘటనను జాతీయ విపత్తుగా అధ్యక్షురాలు ప్రకటించారు. భూకంప ప్రభావిత ప్రాంతాల పునర్‌నిర్మాణం కోసం 20 కోట్ల డాలర్ల నిధిని ఏర్పాటుచేస్తున్నట్లు తెలిపారు. వీటికితోడు ప్రపంచదేశాల నుంచి విరాళాలు వెల్లువెత్తాయి. 

సాయం చేస్తాం: ప్రధాని మోదీ 
ఘటనపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మిత్రదేశానికి తగు సాయం అందజేస్తామని ‘ఎక్స్‌’వేదికగా ప్రకటించారు.

జపాన్,అమెరికాలోనూ.. 
జపాన్‌ ఈశాన్య తీర భూభాగంలో 7.2 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. గురువారం ఉదయం భూప్రకంపనలకు హషికామీ, సెండాయ్, మొరియోకమీ నగరాల్లో జనం భయంతో భవనాల నుంచి బయటకు పరుగులు పెట్టారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని, సునామీ హెచ్చరికలనూ జారీచేయలేదని జపాన్‌ ప్రభుత్వం తర్వాత వెల్లడించింది. భూమి నుంచి 50 కిలోమీటర్ల లోతులో భూకంపకేంద్రం ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. టోక్యోలోనూ స్వల్ప భూకంపం సంభవించింది. అమెరికాలోని ఉత్తర కాలిఫోర్నీయా రాష్ట్రంలోనూ ఫోర్ట్‌ బ్రాగ్‌ నగరంలో 5.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. అయితే ప్రాణ, ఆస్తినష్టం వివరాలు తెలియరాలేదు. 
 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement