అప్పుడు పాక్‌.. ఇప్పుడు బంగ్లాదేశ్‌.. భారత్ అప్రమత్తం | China-Bangladesh Fighter Jet Deal Raises Strategic Concerns For India Near Siliguri Corridor, More Details Inside | Sakshi
Sakshi News home page

అప్పుడు పాక్‌.. ఇప్పుడు బంగ్లాదేశ్‌.. భారత్ అప్రమత్తం

Jun 25 2026 2:45 AM | Updated on Jun 25 2026 11:44 AM

Bangladesh Considers Chinese Fighter Jets as India Watches Closely

బంగ్లాదేశ్ ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ ప్రస్తుతం చైనాలో అధికారిక పర్యటనలో ఉన్నారు. చైనా ప్రధానమంత్రి లీని, అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ను కలవనున్నారు. ఈ రెండు దేశాల మధ్య చర్చల్లో ప్రధాన అంశంగా బంగ్లాదేశ్ జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రతిపాదన, తుది చర్చలు వంటివి ఉన్నట్లు జాతీయ మీడియా పేర్కొంది.

పాకిస్థాన్ కూడా ఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. ఆపరేషన్ సిందూర్ సమయంలో భారత్‌పై వీటిని ఉపయోగించినట్లు సమాచారం. ఆ సమయంలో భారత వైమానిక దళం పాకిస్థాన్ నుంచి వచ్చిన ఉగ్రవాద ముప్పులను సమర్థంగా నిర్వీర్యం చేసింది.

బంగ్లాదేశ్ 24 చైనా జె-10సీఈ యుద్ధ విమానాల కొనుగోలు ప్రణాళికను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించింది. ప్రధానమంత్రి తారిక్ రెహమాన్ చైనా పర్యటనలో ఈ ఒప్పందం కీలక ఫలితంగా నిలవనుందని భావిస్తున్నారు.

పలు నివేదికల ప్రకారం.. రక్షణ, వాణిజ్యం, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకుంటున్నాయి చైనా, పాకిస్థాన్‌. 2026 ఆగస్టు నాటికి యుద్ధ విమానాల కొనుగోలును ఖరారు చేయాలని బంగ్లాదేశ్‌ ఆశిస్తోంది. జె-10సీ అనేది చైనా వైమానిక దళం వినియోగించే యుద్ధ విమానం. జె-10సీఈ అనేది ఇతర దేశాలకు విక్రయించేందుకు రూపొందించిన వెర్షన్.

ఈ కొనుగోలుతో పాకిస్థాన్ తర్వాత ఈ ప్రత్యేక విమానాన్ని వినియోగించే రెండో విదేశీ దేశంగా బంగ్లాదేశ్ నిలుస్తుంది. ఒక్కో యుద్ధ విమానం విలువ సుమారు $40 మిలియన్లు ఉండవచ్చని నివేదికలు చెబుతున్నాయి. కొనుగోలు ఒప్పందానికి సంబంధించిన తుది వివరాలపై చైనా, బంగ్లాదేశ్ అధికారులు ఇంకా చర్చలు జరుపుతున్నట్లు సోర్సెస్‌ తెలిపాయి.

బంగ్లాదేశ్ వైమానిక దళాన్ని ఆధునికీకరణ చేసుకోవాలనుకుంటోంది. జె-10సీఈ ఆ దేశ వైమానిక యుద్ధ సామర్థ్యాలను బాగా పెంచవచ్చు. అదే సమయంలో దక్షిణాసియాలో వ్యూహాత్మక ప్రభావాలు కూడా ఉంటాయి. ఇది బంగ్లాదేశ్-చైనా రక్షణ సంబంధాలను మరింత బలోపేతం చేయడంతో పాటు బంగాళాఖాతంలో ప్రాంతీయ సమతౌల్యాన్ని ప్రభావితం చేయవచ్చు.

ఎక్కడ మోహరిస్తారు? 
భారత్ విషయానికి వస్తే, మన దేశం రెండు పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఒప్పందం కుదిరి యుద్ధ విమానాలు బంగ్లాదేశ్‌కు చేరితే, వాటిని ఎక్కడ మోహరిస్తారన్నది అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంటుంది.

బంగ్లాదేశ్ ఇప్పటికే ఉత్తర బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్‌హాట్ వైమానిక స్థావరం (బీఏఎఫ్ స్టేషన్ లాల్మొనిర్‌హాట్)ను తిరిగి ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. రెండో ప్రపంచ యుద్ధం సమయంలో మిత్రదేశాల వైమానిక స్థావరంగా ఇది పనిచేసింది. ఈ స్థావరం భారత సరిహద్దుకు కేవలం 12-15 కి.మీ దూరంలో ఉంది. 

వ్యూహాత్మకంగా కీలకమైన సిలిగురి కారిడార్‌కు సమీపంలోనూ ఉంది. ఈ స్థావర పునరుద్ధరణకు చైనా సాయం చేసే అవకాశంపై చర్చలు జరిగాయి. ఈ బంగ్లాదేశ్ వైమానిక దళ కేంద్రంలో కొత్త యుద్ధ విమాన హ్యాంగర్లు నిర్మించే పనులు కూడా ఉన్నాయి.

కేంద్ర సర్కారు ఏమన్నది? 
భారత సరిహద్దుకు అత్యంత సమీపంలో ఈ స్థావరం ఉండటంతో భారత్‌లో భద్రతా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. 2025 ఆగస్టు 8న లోక్‌సభలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి కీర్తి వర్ధన్ సింగ్ మాట్లాడుతూ.. “బంగ్లాదేశ్‌లోని లాల్మొనిర్‌హాట్ వైమానిక స్థావరానికి సంబంధించిన నివేదికలను భారత ప్రభుత్వం గమనించింది. 2025 మే 26న బంగ్లాదేశ్ సైన్యం సైనిక కార్యకలాపాల సంచాలకుడు నిర్వహించిన విలేకరుల సమావేశాన్ని కూడా గమనించింది. ప్రస్తుతం లాల్మొనిర్‌హాట్ వైమానిక స్థావరాన్ని సైనిక అవసరాలకు వినియోగించే ప్రణాళికలు లేవని ఆయన చెప్పారు. జాతీయ భద్రతపై ప్రభావం చూపే అన్ని పరిణామాలను భారత ప్రభుత్వం గమనిస్తూ అవసరమైన చర్యలు తీసుకుంటోంది” అని తెలిపారు.

పాకిస్థాన్ వైమానిక దళం ప్రస్తుతం 36 చైనా తయారీ చెంగ్డు జె-10సీఈ యుద్ధ విమానాలను వినియోగిస్తోంది. జె-10 విమానాల కొనుగోలుపై ఆసక్తి చూపుతున్న ఆగ్నేయాసియా దేశాల్లో ఇండోనేషియా కూడా ఒకటి. కనీసం 42 చెంగ్డు జె-10 యుద్ధ విమానాలను కొనుగోలు చేయనున్నట్లు ఇండోనేషియా ప్రకటించింది. చైనా యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలన్న నిర్ణయం ఇండోనేషియా రక్షణ కొనుగోలు విధానంలో మార్పును సూచిస్తోందని నిపుణులు చెబుతున్నారు. గతంలో ఆ దేశం రష్యా, అమెరికాపై ఆధారపడేది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement