జీవనశైలి మార్పులతోనే అసంక్రమిత వ్యాధుల నియంత్రణ | - | Sakshi
Sakshi News home page

జీవనశైలి మార్పులతోనే అసంక్రమిత వ్యాధుల నియంత్రణ

Nov 21 2026 2:32 AM | Updated on Nov 21 2026 2:32 AM

గుంటూరు లీగల్‌: జీవనశైలి మార్పులతోనే అసంక్రమిత వ్యాధుల నియంత్రణ సాధ్యమని పుట్టపర్తి శ్రీ సత్యసాయి మొబైల్‌ హాస్పిటల్‌ డైరెక్టర్‌, శ్రీ సత్యసాయి జనరల్‌ హాస్పిటల్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కృష్ణమూర్తి నరసింహన్‌ పేర్కొన్నారు. గుంటూరు వైద్య కళాశాలలో శుక్రవారం మెటబాలిక్‌ హెల్త్‌, అసంక్రమిత వ్యాధుల నివారణపై ప్రత్యేక సదస్సు నిర్వహించారు. కళాశాల జీఎంసీఏఎన్‌ఏ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లోపం కారణంగా మధుమేహం, అధిక రక్తపోటు, ఊబకాయం, గుండె సంబంధిత వ్యాధులు ప్రధాన ఆరోగ్య సమస్యలుగా మారుతున్నాయని చెప్పారు. వ్యాధులను ప్రారంభ దశలోనే గుర్తించడం, సమతుల ఆహారం, క్రమం తప్పని వ్యాయామం, ఆరోగ్యకరమైన జీవనశైలి ద్వారా అనేక అసంక్రమిత వ్యాధుల ముప్పును తగ్గించవచ్చని వివరించారు. వైద్యులు చికిత్సతో పాటు వ్యాధుల నివారణపై ప్రజల్లో అవగాహన పెంపొందించాలని సూచించారు. గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌, అదనపు వైద్య విద్యా సంచాలకులు డాక్టర్‌ ఎన్‌.వి.వి.సుందరాచారి మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పరిజ్ఞానంతో పాటు ప్రముఖ వైద్య నిపుణుల అనుభవం ఎంతో అవసరమన్నారు. విద్యార్థుల్లో క్లినికల్‌ నైపుణ్యాలు, ఆధునిక వైద్య పరిజ్ఞానాన్ని పెంపొందించేందుకు ఇటువంటి ప్రత్యేక ఉపన్యాసాలను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమం నిర్వహణలో విశాఖపట్నానికి చెందిన ప్రముఖ న్యూరాలజిస్ట్‌ డాక్టర్‌ లలిత ప్రత్యేక చొరవ చూపారు. బయోకెమిస్ట్రీ విభాగం అసోసియేట్‌ ప్రొఫెసర్‌ డాక్టర్‌ సుధారాణి, ప్రొఫెసర్‌ డాక్టర్‌ హరిత ఆధ్వర్యంలో కార్యక్రమ ఏర్పాట్లు పర్యవేక్షించారు. కార్యక్రమంలో కళాశాల అడ్మినిస్ట్రేటివ్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ బి.శ్రీధర్‌, అకడమిక్‌ వైస్‌ ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ మాధవి పాల్గొన్నారు.

డాక్టర్‌ కృష్ణమూర్తి నరసింహన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement