వైభవంగా బొప్పూడిలో ఆలయాల పునఃప్రతిష్ట | - | Sakshi
Sakshi News home page

వైభవంగా బొప్పూడిలో ఆలయాల పునఃప్రతిష్ట

Nov 21 2026 2:26 AM | Updated on Nov 21 2026 2:26 AM

రెండు ధ్వజస్తంభాలు, విజయగణపతి, శిఖరాల ప్రతిష్ట హైకోర్టు న్యాయమూర్తి, అనువంశిక ధర్మకర్త జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహనన్‌ దంపతులు శాస్త్రోక్తంగా నిర్వహణ

చిలకలూరిపేటటౌన్‌/యడ్లపాడు: బొప్పూడి గ్రామంలోని భూ సమేత చెన్నకేశవస్వామి, భ్రమరాంబ సమేత మల్లికార్జునస్వామి దేవస్థానాల పునఃప్రతిష్టా మహోత్సవం శుక్రవారం అంగరంగ వైభవంగా నిర్వహించారు. అర్చకులు పవనాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం 9.45 గంటలకు వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రెండు ధ్వజస్తంభాలతో పాటు విజయగణపతి, నందీశ్వర, చండీశ్వర, శ్రీచక్ర, శిఖర ప్రతిష్టాపన కార్యక్రమాలు శాస్త్రోక్తంగా సాగాయి. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ దంపతులు క్రతువును అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మధ్యాహ్నం ఆలయ మండపంలో స్వామివార్ల కల్యాణ వేడుకలు కనులపండువగా జరిగాయి. అనంతరం భక్తులకు భారీ అన్నదానం ఏర్పాటు చేశారు.

నాటి రాజన్న సంకల్పాన్ని నెరవేర్చాం

–జస్టిస్‌ కృష్ణమోహన్‌

జస్టిస్‌ బొప్పూడి కృష్ణమోహన్‌ మాట్లాడుతూ.. క్రీ.శ. 1098 కార్తిక మాసంలో ఈ రెండు ఆలయాలు నిర్మితమైనట్లు చరిత్ర చెబుతోందన్నారు. 1768లో బొప్పూడి రాజన్న ఆధ్వర్యంలో తొలి జీర్ణోద్ధరణ జరగగా, ఇప్పుడు 8వ తరం వారసుడిగా రెండో జీర్ణోద్ధరణ చేసే భాగ్యం కలిగిందన్నారు. 2024లో శంకుస్థాపన చేసి, పూర్తి రాతి కట్టడాలతో ఆలయాలకు పూర్వవైభవం తెచ్చామని తెలిపారు. ఆలయ జీర్ణోద్ధారణ తిరిగి కార్తికమాసంలోనే జరగడం ఆనందంగా ఉందని చెప్పారు. గతంలో శివాలయ ప్రాంగణంలో ఉన్న గణపతి, భ్రమరాంబ అమ్మవార్లకు ఇప్పుడు ప్రత్యేక ఉపాలయాలు నిర్మించామని... కొట్టాయ పీఠాధిపతి నామకరణం చేసిన మేరకు ఇకపై ఇక్కడి గణపతి విజయగణపతిగా ప్రసిద్ధి చెందుతారని వెల్లడించారు. ఈ ఆధ్యాత్మిక వేడుకలో దేవదాయశాఖ కమిషనర్‌ కె.రామచంద్రమోహన్‌, అటవీశాఖ సలహాదారు పి.మల్లికార్జునరావు, గజల్‌ శ్రీనివాస్‌, మాశర్మ, రవాణాశాఖ అధికారి రమశ్రీ, విశ్రాంత అధికారి ప్రసాదరావు, ఆలయ ఈవో టి.సుభద్ర పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement