రాంగోపాల్‌పేట్(హైదరాబాద్): ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూమ్‌లు మంజూరయ్యాయని నమ్మించి వారి నుంచి డబ్బు వసూళ్లకు పాల్పడుతున్న ఓ ముఠాకు చెందిన ముగ్గురు నిందితులను కార్ఖానా పోలీసులు అరెస్టు చేశారు. అల్వాల్ ఏసీపీ రమేష్, కార్ఖానా ఇన్స్పెక్టర్ అనూరాధ తెలిపిన వివరాలు.. గుంటూరుకు చెందిన కస్తూరి సాయిరామ్ అలియాస్ సాయికుమార్(30), పల్నాడు జిల్లా వినుకొండకు చెందిన రాచకొండ తిరుపతిరావు అలియాస్ చందు(33), బాపట్ల జిల్లా చెరుకుపల్లికి చెందిన పులుగుజ్జు జగదీష్‌బాబు అలియాస్ పండు (30) ఏడాది క్రితం ముఠాగా ఏర్పడ్డారు. ప్రభుత్వ పథకాల కింద డబుల్ బెడ్రూమ్, ఇందిరమ్మ ఇళ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను ప్రభుత్వ అధికారిక వెబ్సైట్ ద్వారా సంపాదించే వారు. వారి ఫోన్‌కు ఫోన్ చేసి తాము జీహెచ్ఎంసీ అధికారులమని మీకు ఇళ్లు మంజూరయ్యాయని నమ్మించే వారు. వారికి నమ్మకం కలిగించేందుకు వారి పేర్ల మీద ఇళ్లు మంజూరైనట్లు నకిలీ ఇంటి కేటాయింపు ఉత్తర్వులను పంపించే వారు. అవి నిజమైన వాటిగానే ఉండటంతో అమాయక ప్రజలు సులభంగా నమ్మేవారు. అటు తర్వాత ప్రాసెసింగ్, కేటాయింపు చార్జీల పేరుతో రూ.3 వేల నుంచి రూ.10వేల వరకు వసూలు చేశారు. ఇలాగే కాకాగూడకు చెందిన కావలి అంజప్పకుతో పాటు నేరెడ్మెట్, చందానగర్‌కు చెందిన మరో ముగ్గురికి ఇలాగే పంపించి ఒక్కొక్కరి నుంచి రూ.7,800 వసూళ్లు చేసి బీరంగూడ, పటాన్చెరువు ప్రాంతాల్లో ఇళ్లు మంజూరయ్యాయని నమ్మించారు. బాధితులు అక్కడికి వెళ్లి పరిశీలించగా వారి పేర్లపై ఎలాంటి ఇళ్లు మంజూరు కాలేదని తేలింది. దీంతో కార్ఖానా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా పోలీసులు శుక్రవారం ముగ్గురు నిందితుల అరెస్టు చేసి వారి నుంచి 17 నకిలీ అలాట్మెంట్ లెటర్లు ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇలా నిందితులు ముగ్గురు సుమారు రూ.10 నుంచి 12 లక్షల వరకు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. డబుల్ బెడ్రూమ్లు, ఇందిరమ్మ ఇళ్లు ఇప్పిస్తామని చెప్పే వారిని నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ పథకాలకు అధికారులు డబ్బులు అడగరని ఏసీపీ సూచించారు.
ముగ్గురు నిందితుల అరెస్టు


