నగరంపాలెం: జనసేన కేంద్ర కార్యాలయం కేంద్రంగా నిరుద్యోగులను మోసగించిన కేసులో ఇప్పటికే నిమ్మకాయల పెద్దిరాజుని సీఐడీ గుంటూరు అధికారులు అరెస్ట్ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగటూరు మండలానికి చెందిన అతన్ని రెండు రోజుల కిందట మంగళగిరిలో అరెస్ట్ చేయగా, గురువారం గుంటూరు జిల్లా కోర్టులోని సీఐడీ కోర్టులో హాజరుపరిచారు. దీంతో అతనికి రిమాండ్ విధించగా, గుంటూరు జిల్లా జైలుకి తరలించారు. అతన్ని కోర్టు, జిల్లా జైలుకి తరలించిన తీరు పలు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని నిరుద్యోగులను మోసగించి, సుమారు రూ.7 కోట్లు వసూలు చేయగా, రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. దీనిపై సీఐడీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో పట్టుబడిన పెద్దిరాజుని గుంటూరు మెడికల్ కళాశాల అనుకుని ఉన్న గుంటూరు సీఐడీ ప్రాంతీయ కార్యాలయం నుంచి ఇద్దరు సీఐడీ అధికార సిబ్బంది గురువారం మోటారు సైకిల్‌పై సీఐడీ కోర్టు, జిల్లా జైలుకి తరలించారు. సాధారణ కేసుల్లో మాదిరి పెద్దిరాజుని మోటారుసైకిల్‌పై తరలించారు. మార్గమధ్యలో ఎవరైనా బాధితులు అతనిపై ఆకస్మిక దాడులకు పాల్పడితే ఎవరూ బాధ్యత వహిస్తారనే వాదనలు వినిపిస్తున్నాయి.


