గుంటూరు ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల స్థాయిలో అండర్–19 చదరంగ పోటీలను భారతీయ విద్యాభవన్‌లో ఆదివారం నిర్వహించనున్నట్లు భారతీయ విద్యాభవన్ కార్యదర్శి పి.రామచంద్రరాజు తెలిపారు. శుక్రవారం కలెక్టర్ బంగ్లారోడ్డులోని పాఠశాలలో పోటీలకు సంబంధించిన బ్రోచర్ ఆవిష్కరించారు. రామచంద్రరాజు మాట్లాడుతూ భవన్స్ అకాడమీ ఆఫ్ కల్చరల్ అండ్ ఫైన్ ఆర్ట్స్, ఆనంద్ చెస్ వింగ్స్ సంయుక్త ఆధ్వర్యంలో పోటీలు ఉంటాయన్నారు. విజేతలకు రూ.70 వేల నగదుతోపాటు వివిధ రకాల ప్రోత్సాహక బహుమతులు అందజేయనున్నట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన వారు ఆనంద్ చెస్ వింగ్స్ డైరెక్టర్ ఎం.గోపీనాథ్‌ను ఫోన్ నంబరు 97030 49378లో సంప్రదించాలని సూచించారు. ఇంటాక్ జిల్లా కన్వీనర్ రవి శంకర్, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.
తొలిరోజు 155 మంది
దరఖాస్తుదారులు హాజరు
నెహ్రూనగర్: గుంటూరు నగరపాలక సంస్థ (జీఎంసీ) పరిధిలో లేఅవుట్ క్రమబద్ధీకరణ పథకం (ఎల్‌ఆర్‌ఎస్) కింద దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించేందుకు చేపట్టిన ‘ఎల్‌ఆర్‌ఎస్ మేళా’కు శుక్రవారం స్పందన లభించింది. నగర కమిషనర్ కె.మయూర్ అశోక్ ఆదేశాల మేరకు జీఎంసీ ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్‌తోపాటు బృందావన్ గార్డెన్స్‌లోని సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఈ మేళాకు తొలిరోజు 155 మంది దరఖాస్తుదారులు హాజరయ్యారు. సిటీ ప్లానర్ డి.రాంబాబు మాట్లాడుతూ మేళా శనివారం కూడా కొనసాగుతుందని చెప్పారు. పట్టణ ప్రణాళిక విభాగం సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ఫీజు చెల్లించాల్సిన వారు, దరఖాస్తుల పరిశీలనలో షార్ట్ ఫాల్ ఎండార్స్‌మెంట్లు జారీ అయి అవసరమైన పత్రాలు సమర్పించాల్సిన వారు వచ్చి క్లియర్ చేసుకోవచ్చని సూచించారు. దరఖాస్తుదారులు సంబంధిత పత్రాలు, రశీదులతో హాజరై ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.
భక్తిశ్రద్ధలతో
కార్తిక మాస పూజలు
పెనమలూరు: యనమలకదురులో పార్వతీ సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్తిక మాసం సందర్భంగా ఏకాదశ పర్వదినం కావటంతో స్వామివారికి రుద్రాభిషేకం, భస్మాభిషేకం అత్యంత వైభవంగా చేశారు. స్వామి వారిని మహా కాళేశ్వరుడిగా అలంకరించారు. అనంతరం భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు విశేషంగా పాల్గొని స్వామి వారి పూజా కార్యక్రమాలు తిలకించారు.


