ఆవేదన విందాం ఆదరణ అవుదాం | World Mental Health Day-2026 Lived Experiences | Sakshi
Sakshi News home page

ఆవేదన విందాం ఆదరణ అవుదాం

Oct 10 2026 4:38 AM | Updated on Oct 10 2026 4:53 AM

World Mental Health Day-2026 Lived Experiences

సందర్భం

నేడు ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం

ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్‌ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1992లో వరల్డ్‌ ఫెడరేషన్‌ ఫర్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం; అపోహలు, వివక్షను తగ్గించడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రజారోగ్య ప్రాధాన్యతగా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు.

2026 సంవత్సరానికి ప్రకటించిన నినాదం ‘జీవన అనుభవాలు వినటం, నిజమైన స్వరాలు, నిజమైన మార్పు’. మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తున్న వారి మాటలను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, ఆ అనుభవాలను నిజమైన మార్పుకు ఉపయోగించడం ఈ నినాదం ప్రధాన సందేశం.చూసే చూపు మారితే కోలుకునే జీవితాలెన్నో!

ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. అవసరమైన చికిత్స అందని వారి సంఖ్య భారీగానే ఉంది. భారతదేశంలో కూడా చికిత్సకు రాకపోవడానికి... అవగాహన లోపం, అపోహలు, సాంస్కృతిక నమ్మకాలు, లభ్యం కాని సేవలు, మానవ వనరుల కొరత, చికిత్స ఖర్చు వంటి అనేక కారణాలు ఉన్నాయి. 

147 కోట్ల జనాభా కల మన దేశంలో అర్హులైన మానసిక వైద్యులు కేవలం 9,000 మంది ఉండటం గమనించదగ్గ విషయం. అయితే మానసిక ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులను మనం చూసే దృష్టికోణం కూడా ఒక పెద్ద సమస్య. ఒక వ్యక్తికి స్కిజోఫ్రీనియా వంటి ఇతర మానసిక సమస్య ఉందని తెలిసిన తర్వాత, అతని మాటకు, సామర్థ్యానికి, నిర్ణయాలకు విలువ తగ్గిస్తుంటారు. ఉద్యోగం, వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా నాయకత్వం వంటి విషయాల్లో అతని ప్రస్తుత సామర్థ్యాన్ని కాకుండా ఆ వ్యక్తికి వచ్చిన జబ్బునే ముందుగా చూడటం పరిపాటి. ఇక్కడే వ్యక్తిగత అనుభవం ప్రాధాన్యత పొందుతుంది.

ఆసుపత్రిలో తన అనుభవం, మందుల ప్రభావాలు, సమాజం చూపిన వివక్ష, ఉద్యోగంలో ఎదురైన సమస్యలు, కుటుంబంలో మారిన తన పాత్ర, తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మద్దతు వంటి విషయాలను ఆ వ్యక్తి మాత్రమే పూర్తిగా వివరించగలడు. పుస్తకాల్లో వ్యాధి లక్షణాలు, పరిశోధనల్లో గణాంకాలు, వైద్యుల అనుభవాలు వంటివి ఉంటాయి. కానీ ఆ అనారోగ్యంతో జీవించడం ఎలా ఉంటుందో చెప్పే జ్ఞానం ఆ వ్యక్తి అనుభవంలోనే ఉంటుంది.

నినాదం కాదు... మార్పుకు ముందడుగు
2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన రోడ్‌మ్యాప్‌లో కూడా మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తున్న వ్యక్తుల ప్రత్యేక అనుభవాల, అవగాహన, నైపుణ్యాన్ని మానసిక ఆరోగ్య విధానాలు, సేవల రూపకల్పన, వాటి అమలులో ఉపయోగించాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించింది. అయితే వారి మాటను వినడం అంటే వారు చెప్పే ప్రతి నిర్ణయాన్నీ ప్రతి పరిస్థితిలోనూ అమలు చేయడం కాదు. ముఖ్యంగా తీవ్రమైన ఉన్మాదం లేదా ఇతర తీవ్రమైన మానసిక జబ్బుల విషయంలో అవగాహన, నిర్ణయాత్మక శక్తి, తాత్కాలికంగా దెబ్బతినవచ్చు. అలాంటి సందర్భాల్లో వ్యక్తి అభిప్రాయాన్ని, వైద్య నిర్ణయంతో పాటు రోగి భద్రత, కుటుంబ పరిస్థితులు, చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.

మానసిక జబ్బు వారి జీవితంలో ఒక భాగం మాత్రమే. వారే వారి జబ్బు కాదు. వారి అనుభవాలను వినడం జాలి కాదు, ఉపకారం కాదు. అది వారి హక్కు. అయితే ఆ స్వరాన్ని వైద్య విజ్ఞానం, ఆధారపూర్వక చికిత్స, భద్రతతో సమన్వయం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ‘జీవన అనుభవాలు వినడం, నిజమైన స్వరాలు, నిజమైన మార్పు’ ఒక నినాదంగా మాత్రమే మిగలకుండా నిజమైన సామాజిక మార్పుకు దారితీస్తుంది.

- డా. ఇండ్ల రామసుబ్బా రెడ్డి, వ్యాసకర్త  ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, 93481 14948

ఇదీ  చదవండి: సవాళ్ల నడుమ భారత వాయుసేన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement