breaking news
Mental health care bill
-
ఆవేదన విందాం ఆదరణ అవుదాం
ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం అక్టోబర్ 10న ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. 1992లో వరల్డ్ ఫెడరేషన్ ఫర్ మెంటల్ హెల్త్ ప్రారంభించిన ఈ కార్యక్రమం ద్వారా మానసిక ఆరోగ్యంపై అవగాహన పెంచడం; అపోహలు, వివక్షను తగ్గించడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రజారోగ్య ప్రాధాన్యతగా నిలపడం లక్ష్యంగా పెట్టుకున్నారు.2026 సంవత్సరానికి ప్రకటించిన నినాదం ‘జీవన అనుభవాలు వినటం, నిజమైన స్వరాలు, నిజమైన మార్పు’. మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తున్న వారి మాటలను వినడం, వారి అనుభవాలకు విలువ ఇవ్వడం, ఆ అనుభవాలను నిజమైన మార్పుకు ఉపయోగించడం ఈ నినాదం ప్రధాన సందేశం.చూసే చూపు మారితే కోలుకునే జీవితాలెన్నో!ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 2023లో ప్రపంచవ్యాప్తంగా సుమారు 97 కోట్ల మంది ఏదో ఒక మానసిక రుగ్మతతో జీవిస్తున్నారు. అవసరమైన చికిత్స అందని వారి సంఖ్య భారీగానే ఉంది. భారతదేశంలో కూడా చికిత్సకు రాకపోవడానికి... అవగాహన లోపం, అపోహలు, సాంస్కృతిక నమ్మకాలు, లభ్యం కాని సేవలు, మానవ వనరుల కొరత, చికిత్స ఖర్చు వంటి అనేక కారణాలు ఉన్నాయి. 147 కోట్ల జనాభా కల మన దేశంలో అర్హులైన మానసిక వైద్యులు కేవలం 9,000 మంది ఉండటం గమనించదగ్గ విషయం. అయితే మానసిక ఆరోగ్య సమస్యలతో జీవిస్తున్న వ్యక్తులను మనం చూసే దృష్టికోణం కూడా ఒక పెద్ద సమస్య. ఒక వ్యక్తికి స్కిజోఫ్రీనియా వంటి ఇతర మానసిక సమస్య ఉందని తెలిసిన తర్వాత, అతని మాటకు, సామర్థ్యానికి, నిర్ణయాలకు విలువ తగ్గిస్తుంటారు. ఉద్యోగం, వివాహం, కుటుంబ బాధ్యతలు లేదా నాయకత్వం వంటి విషయాల్లో అతని ప్రస్తుత సామర్థ్యాన్ని కాకుండా ఆ వ్యక్తికి వచ్చిన జబ్బునే ముందుగా చూడటం పరిపాటి. ఇక్కడే వ్యక్తిగత అనుభవం ప్రాధాన్యత పొందుతుంది.ఆసుపత్రిలో తన అనుభవం, మందుల ప్రభావాలు, సమాజం చూపిన వివక్ష, ఉద్యోగంలో ఎదురైన సమస్యలు, కుటుంబంలో మారిన తన పాత్ర, తిరిగి జీవితాన్ని నిర్మించుకోవడానికి అవసరమైన మద్దతు వంటి విషయాలను ఆ వ్యక్తి మాత్రమే పూర్తిగా వివరించగలడు. పుస్తకాల్లో వ్యాధి లక్షణాలు, పరిశోధనల్లో గణాంకాలు, వైద్యుల అనుభవాలు వంటివి ఉంటాయి. కానీ ఆ అనారోగ్యంతో జీవించడం ఎలా ఉంటుందో చెప్పే జ్ఞానం ఆ వ్యక్తి అనుభవంలోనే ఉంటుంది.నినాదం కాదు... మార్పుకు ముందడుగు2025లో ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల చేసిన రోడ్‌మ్యాప్‌లో కూడా మానసిక ఆరోగ్య సమస్యలను స్వయంగా అనుభవిస్తున్న వ్యక్తుల ప్రత్యేక అనుభవాల, అవగాహన, నైపుణ్యాన్ని మానసిక ఆరోగ్య విధానాలు, సేవల రూపకల్పన, వాటి అమలులో ఉపయోగించాల్సిన అవసరాన్ని స్పష్టంగా గుర్తించింది. అయితే వారి మాటను వినడం అంటే వారు చెప్పే ప్రతి నిర్ణయాన్నీ ప్రతి పరిస్థితిలోనూ అమలు చేయడం కాదు. ముఖ్యంగా తీవ్రమైన ఉన్మాదం లేదా ఇతర తీవ్రమైన మానసిక జబ్బుల విషయంలో అవగాహన, నిర్ణయాత్మక శక్తి, తాత్కాలికంగా దెబ్బతినవచ్చు. అలాంటి సందర్భాల్లో వ్యక్తి అభిప్రాయాన్ని, వైద్య నిర్ణయంతో పాటు రోగి భద్రత, కుటుంబ పరిస్థితులు, చట్టపరమైన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి.మానసిక జబ్బు వారి జీవితంలో ఒక భాగం మాత్రమే. వారే వారి జబ్బు కాదు. వారి అనుభవాలను వినడం జాలి కాదు, ఉపకారం కాదు. అది వారి హక్కు. అయితే ఆ స్వరాన్ని వైద్య విజ్ఞానం, ఆధారపూర్వక చికిత్స, భద్రతతో సమన్వయం చేయడం కూడా అంతే ముఖ్యం. అప్పుడే ‘జీవన అనుభవాలు వినడం, నిజమైన స్వరాలు, నిజమైన మార్పు’ ఒక నినాదంగా మాత్రమే మిగలకుండా నిజమైన సామాజిక మార్పుకు దారితీస్తుంది.- డా. ఇండ్ల రామసుబ్బా రెడ్డి, వ్యాసకర్త ప్రముఖ మానసిక వైద్య నిపుణులు, 93481 14948ఇదీ చదవండి: సవాళ్ల నడుమ భారత వాయుసేన -
మెరుగైన బిల్లు
మానసిక ఆరోగ్య సంరక్షణ బిల్లుకు ఎట్టకేలకు మోక్షం లభించింది. ఏడాదిక్రితం రాజ్యసభ ఆమోదించిన ఆ బిల్లును సోమవారం లోక్‌సభ కూడా అంగీకరించడంతో దానికి పార్లమెంటు ఆమోదముద్ర పడినట్టయింది. ఈ బిల్లు చట్టమయ్యాక మూడు దశాబ్దాలనాటి మానసిక ఆరోగ్య చట్టం రద్దవుతుంది. మానసిక అస్వస్థులను చాలా దేశాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని, ఈ ధోరణిని మార్చుకుని వారి హక్కులను పరిర క్షిస్తూ చట్టం తీసుకురావాలని పదేళ్లనాడు ఐక్యరాజ్యసమితి తీర్మానించింది. ఆ తీర్మా నాన్ని అంగీకరించిన దేశాల్లో భారత్ కూడా ఒకటి. కానీ బిల్లు రూపొందడానికీ... అది పార్లమెంటు ఉభయ సభల్లో ఆమోదం పొందడానికీ ఇన్నేళ్ల సమయం పట్టడం ఒక దురదృష్టకరమైన విషయం. బ్రిటిష్ వలస పాలకులు 1912లో తీసుకొచ్చిన ఉన్మాద రోగుల చట్టం దాదాపు 75 ఏళ్లు కొనసాగింది. దాని స్థానంలో 1987లో మానసిక ఆరోగ్య చట్టం వచ్చినా అది కూడా ఎన్నో లోటుపాట్లతోనే ఉంది. మాన సిక రోగులకుండే హక్కులు, వారి సంరక్షణ, ఆ రోగులపై వివక్ష చూపిన సంద ర్భాల్లో తీసుకోవాల్సిన చర్యల తదితర అంశాల్లో అది మౌనంగానే ఉంది. ఇతర రోగాల్లా మానసిక అనారోగ్యాన్ని ప్రారంభ దశలో లేదా విస్తరిస్తున్న దశలో గుర్తించడం అంత సులభం కాదు. అప్పుడప్పుడు అలాంటి వ్యక్తులు అస్వా భావికంగా, అసాధారణంగా లేదా విచిత్రంగా ఉంటున్న వైనాన్ని ఎవరూ పోల్చుకో లేరు. ఆ ధోరణుల్ని అప్పటికప్పుడు ఏర్పడ్డ సమస్యపై వారి స్పందనగానే పరి గణిస్తారు. వారిలో కట్టలు తెంచుకొని వచ్చిన ఆగ్రహం వల్ల సహనం కోల్పోయి ఉండొచ్చునన్న అభిప్రాయం ఏర్పడుతుంది. ఆత్మహత్యకు పాల్పడ్డ వారి విష యంలో వారి సన్నిహితులు తరచుగా వాపోయేది ఇదే. వారిపై తమకు కొంచెమైనా అనుమానం కలగలేదని అంటుంటారు. ఒకవేళ రోగి ఆత్మహత్యకు చేసిన ప్రయత్నం విఫలమైతే అది నేర చర్యగా మారుతుంది. వాస్తవానికి ఆ దురదృష్టకర పరిస్థితికి చేరుకున్న వ్యక్తిని రోగిగా పరిగణించి తక్షణం వైద్య చికిత్సకు పంపాలి. అందుకు బదులుగా పోలీసులు అరెస్టు చేస్తారు. ఐపీసీ 309 సెక్షన్‌కింద కేసు నమోదు చేస్తారు. ఆ సెక్షన్‌కింద సంవత్సరకాలం వరకూ జైలు, జరిమానా విధిం చవచ్చు. ఇప్పుడు పార్లమెంటు ఆమోదించిన బిల్లు ఆత్మహత్యాయత్నాన్ని నేరంగా పరిగణించడం కాక దాన్ని మానసిక కుంగుబాటుగా గుర్తిస్తోంది. అలాంటివారికి వైద్య చికిత్స అందించాలని నిర్దేశిస్తోంది. సమాజం సరిగా గుర్తించని ఒక పెను సమస్య మానసిక అస్వస్థత. నిరుడు అంతర్జాతీయ వైద్య జర్నల్ లాన్సెట్ ఈ విషయంలో కీలకమైన సమాచారాన్ని వెలువరించింది. వయసుతో నిమిత్తం లేకుండా అందరినీ చుట్టుముడుతున్న ఈ సమస్యపై భారత్ నిర్లక్ష్యంగా ఉంటున్నదని హెచ్చరించింది. అభివృద్ధి చెందిన దేశాలన్నిటా ఉన్న రోగులకు సమాన సంఖ్యలో భారత్, చైనాల్లో రోగులున్నారని... వీరి పెరుగుదల రేటు చైనాతో పోలిస్తే భారత్‌లో అధికమని కూడా ఆ జర్నల్ వెల్లడించింది. ప్రపంచంలోని మానసిక రోగుల్లో మూడో వంతు కంటే ఎక్కువ (37 శాతం)మంది ఈ రెండు దేశాలవారేనని... భారత్‌లో పదిశాతం మంది జనాభాకు ఏదో రూపంలో ఈ సమస్య ఉన్నదని చెప్పింది. మానసిక అస్వస్థతకు బహు రూపాలు, కారణాలు ఉంటాయి. పిచ్చితనంగా, ఉన్మాదంగా, మానసిక ఒత్తిడిగా, నరాల బలహీనతగా, మాదకద్రవ్యాలు లేదా మద్యసేవనం వల్ల వచ్చిన సమస్యగా దీన్ని పరిగణిస్తారు. వ్యాధిగ్రస్తులు నిరుపేదలైతే ఒకలా, ధనవంతులైతే ఒకలా చూసే ధోరణి ఉంది. అన్నిచోట్లా ఉన్నట్టే ఆడా, మగా వివక్ష కూడా ఇందులో చెప్ప లేనంతగా ఉంది. పైగా మన దేశంలో మానసిక వ్యాధిగ్రస్తులకు సత్వర చికిత్స అందించడానికి అవసరమైన ప్రాథమిక సదుపాయాలు లేవు. దేశంలో పది లక్షల మంది రోగులకు ముగ్గురు సైకియాట్రిస్ట్‌లు అందుబాటులో ఉన్నారని లాన్సెట్ నివేదిక చెబుతోంది. చైనా ఈ విషయంలో చాలా మెరుగు. అక్కడ పది లక్షల మందికి దాదాపు 17 మంది ఉంటారు. అసలంటూ వైద్య నిపుణులుంటే జనంలో ఆ వ్యాధి పట్ల చైతన్యం కలుగుతుంది. ఆ రోగుల విషయంలో శ్రద్ధ ఉంటుంది. అది లేకపోవడం వల్ల మానసిక రోగం పట్లా, ఆ రోగులపట్లా సమాజంలో అజ్ఞానం రాజ్యమేలుతోంది. నగరాలు, పట్టణాలు, పల్లెటూళ్లు అన్న తేడా లేకుండా ఎక్కడైనా తారసిల్లే ఈ రోగులను ఎవరూ పెద్దగా పట్టించుకోరు. ఆ రోగులు సైతం సాధార ణంగా తమ లోకంలో తాముంటారు. రోగం ప్రకోపించి దాడులకు దిగినప్పుడు చుట్టూ ఉండే వారు వారితో నిర్దయగా వ్యవహరిస్తారు. ఆ రోగుల కుటుంబ సభ్యులు సైతం వారు తమవారని చెప్పుకోవడానికి సిద్ధపడరు. వారికి వెంటనే వైద్యం అందించా లన్న తాపత్రయం కంటే... ఆ సంగతి బయటపడకుండా చూడ టం ముఖ్యమను కుంటారు. అందువల్లే ఆ రోగులతో వ్యవహరించాల్సిన తీరుపై సన్నిహితులకు కౌన్సెలింగ్ అవసరమవుతుంది. తాజా బిల్లు అనేక విధాల మేలైనది. జిల్లా స్థాయిలో సైకియాట్రిస్టుల నియా మకం, రోగులను చేర్చుకుని చికిత్స అందించడం లేదా ఎప్పటికప్పుడు మందులు అందజేయడం వంటి సేవలకు ఇది వీలు కల్పిస్తోంది. అలాగే ఈ రోగులకు ఇతర వైకల్యాలున్నవారికిచ్చే తరహాలోనే వైద్య బీమా సదుపాయం అందించాలని బీమా సంస్థలను నిర్దేశిస్తోంది. ఆ రోగుల ఆస్తుల పరిరక్షణ, చికిత్స విషయంలో వారి మనోభావాలను పరిగణనలోకి తీసుకోవడం, విద్యుత్‌తో చేసే చికిత్సకు కూడా పరిమితులు విధించింది. అయితే ఈసీటీ చికిత్సే అశాస్త్రీయమైనదని, దీన్ని రద్దు చేయాలని అంతర్జాతీయ నిపుణులంటున్నారు. మానసిక వ్యాధిగ్రస్తులకు పిల్లలు పుట్టకుండా చేయడాన్ని ఈ బిల్లు నిషేధిస్తోంది. వ్యాధిగ్రస్తులైన మహిళలకు అందించే చికిత్స విషయంలోనూ బిల్లు ప్రత్యేక శ్రద్ధ చూపింది. మానసిక రోగులపై వివక్ష చూపడం, వారిని గొలుసులతో బంధించడం లాంటివి చేస్తే జైలుశిక్ష, జరి మానా విధించే ఏర్పాటు కూడా ఇందులో ఉంది. మొత్తానికి ఆలస్యమైనా కూలం కషమైన చర్చ జరిపి, ఉన్నంతలో సమగ్రమైన బిల్లును రూపొందించినందుకు కేంద్రాన్ని, రాజకీయ పక్షాలను అభినందించాలి.


