
అభిప్రాయం
చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం ప్రైవేట్ విధానాలతో ముందుకు పోతున్నది. పోర్టులను, మెడికల్ కాలేజీలను, విద్య, వైద్యం వంటివాటిని ప్రైవేట్ పరం చేయనుంది. తాజాగా నిత్యం అవసరంగా ఉన్న కరెంట్‌ను కూడా ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెడుతున్నది. అందులో భాగమే ‘యాక్సిస్ రెన్యూవబుల్ ఎనర్జీ పార్క్ ప్రైవేట్ లిమిటెడ్’తో విద్యుత్ కొనుగోళ్ల గురించి చేసుకున్న ఒప్పందం. 400 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టులను నిర్మించి, వాటి నుంచి ఏపీఎస్పీడీసీఎల్ 25 సంవత్సరాల పాటు యూనిట్‌కు 4.60 రూపాయల చెల్లించి కొనుగోలు చేసేందుకు అంగీకారం తెలిపింది. ధర తగ్గించేందుకు వీలు లేకుండా ఒప్పందంలో ‘సీలింగ్’ షరతు విధించారు.
ఇంతకు ముందు కూడా యాక్సిస్ సంస్థ 5 వేల మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టులను ఏర్పాటు చేసుకునేందుకు 2018లో టీడీపీ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చు కుంది. అందుకే 400 మెగావాట్ల ప్రాజెక్టు ఏర్పాటుకు 2019 జనవరి 23న విద్యుత్ సంస్థలు అనుమతించాయి. దీన్ని గమనిస్తే యాక్సిస్‌తో చంద్రబాబు అనుబంధం ఏమిటో తెలుస్తుంది.
2014–18 మధ్య టీడీపీ పాలనలోనే ఏపీ ఎస్పీడీసీఎల్ పరిధిలో 464 మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోలుకు 15 కంపెనీలతో ఒప్పందాలు జరిగాయి. దాని ప్రకారం మొదటి ఏడాది యూనిట్‌కు 5.98 రూపాయల చొప్పున చెల్లించాలి. రెండవ ఏడాది నుంచి ఏటా 3% పెంపుతో పదో సంవత్సరం దాకా కొనుగోలు వ్యయం పెరుగు తుంది. ఫలితంగా పదో ఏడాది నాటికి యూనిట్‌కు 7 రూపాయలకు పైగా చెల్లించాలి. రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ యూనిట్ 4.20 రూపాయలకే అందు బాటులో ఉన్నా, 7 రూపాయలకు ప్త్రెవేట్ సంస్థల నుంచి కొనేందుకు టీడీపీ ప్రభుత్వం ఎలా ఒప్పందం చేసుకుంది?
2019 సాధారణ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం టీడీపీ ప్రభుత్వం లోని పీపీఏల సమీక్షతో పాటు 2019 ఏప్రిల్ 1 ముందు కుదిరిన ఒప్పందాల మేరకు ఇంకా మొదలు కాని పనులను రద్దు చేయాలని ఆదేశించింది. కొత్తగా కేంద్ర ప్రభుత్వ సంస్థ ‘సెకీ’తో యూనిట్ రూ. 2.49 చొప్పున కొనుగోలుకు ఒప్పందం చేసుకుంది. ఈ ఒప్పందాన్ని టీడీపీ వ్యతిరేకించింది. కానీ, ‘చౌకగా విద్యుత్ వస్తున్నప్పుడు ఎందుకు కొనుగోలు చేయకూడదు?’ అనే అభిప్రాయం ప్రజల్లో వ్యక్తమైంది.
యాక్సిస్ సంస్థ నుంచి తొలుత 400 మెగావాట్లకు, తర్వాత మరో 774.9 మెగావాట్లకు ఒప్పందాలు కుదుర్చుకునేలా దస్త్రాన్ని ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం అధికారులు పంపారు. ఆ పీపీఏల ద్వారా యూనిట్ ధర 4.28 రూపాయల చొప్పున ఖరారు చేయాలని డెవలపర్ సంస్థ విద్యుత్ నియంత్రణ మండలిని కోరింది. ప్రస్తుతం బహిరంగ మార్కెట్లో హైబ్రిడ్ ప్రాజెక్టుల నుంచి వచ్చే విద్యుత్ యూనిట్ రూ. 2.90లకు దొరుకుతుంది. అలాంటప్పుడు 4.28 రూపాయలకు ఎందుకు కొనుగోలు చేయాలి?
గత ప్రభుత్వంలో 2022 నవంబర్ 11న యాక్సిస్ సంస్థ నుంచి యూనిట్ 3.50 రూపాయల చొప్పున పీపీఏల కొనుగోలు ఆమోదం కోసం ఏపీఈఆర్‌సీ అనుమతి కోసం డిస్కం పంపింది. ఆ పీపీఏలను ఎలా సమర్థించుకుంటారో వివరణ ఇవ్వాలంటూ డ్రాప్ట్ పీపీఏలను విద్యుత్ నియంత్రణ మండలి డిస్కంకి తిప్పి పంపింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయకత్వాన ఉన్న కూటమి ప్రభుత్వం విద్యుత్ చట్టం 2003 సెక్షన్ 108 ప్రకారం యాక్సిస్ సంస్థతో పీపీఏలను ఆమోదించాలంటూ 2024 సెప్టెంబర్ 24న ఏపీఈఆర్‌సీకి లేఖ రాసి, దీన్ని తిరస్కరించటానికి వీలు లేదనీ, ఒక వేళ తిరస్కరిస్తే చట్టం ప్రకారం ముందుకు పోతా మనీ బెదిరింపు ధోరణిని ప్రదర్శించింది.
యాక్సిస్‌తో కచ్చితంగా పీపీఏలు కుదుర్చుకోవాలంటూ విద్యుత్ సంస్థలను అప్పీలేట్ ట్రైబ్యునల్ ఆదేశించలేదు. కాని ఆ సంస్థతో పీపీఏలు కుదుర్చు కోవటానికి విద్యుత్ సంస్థలు ముందుకు వచ్చాయి. అధికారులు కూడా ఆ సంస్థ నుంచి విద్యుత్ తీసుకోవటం చాలా చౌకనే రీతిలో వివరణ ఇవ్వటం ద్వారా పీపీఏలకు మద్దతు పలికారు. చంద్రబాబు ప్రభుత్వం, విద్యుత్ అధికారుల మద్దతుతో యాక్సిస్ సంస్థకు చెందిన సౌర, పవన ప్రాజెక్టుల నుంచి విద్యుత్ ఒప్పందాలు కుదుర్చుకోవటానికి సిద్ధమయ్యాయి.
ఇప్పటికే వాటి ప్రతిపాదనలను ఏపీఈఆర్‌సీకి చేరాయి. విద్యుత్ యూనిట్ ట్యారిఫ్ ఎంత ఉండాలో కూడా యాక్సిస్ సంస్థే ప్రతిపాదించింది. దాన్ని ఆంధ్రప్రదేశ్ పవర్ కో – ఆర్డినేషన్ కమిటీ (ఏపీపీసీసీ) ఏపీఈఆర్‌సీ ఆమోదం కోసం పంపింది. దీన్ని గమనిస్తే కూటమి ప్రభుత్వ విద్యుత్ ఒప్పందం ద్వారా యాక్సిస్ సంస్థ ఎంత ప్రయోజనం పొందుతుందో తెలుస్తుంది.
బొల్లిముంత సాంబశివరావు
వ్యాసకర్త రైతు కూలీ సంఘం (ఆం.ప్ర.) రాష్ట్ర కార్యవర్గ సభ్యులు
మొబైల్: 98859 83526