ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన (యు.బి.టి.) రాయని డైరీ | Rayani Diary of Uddhav Thackeray | Sakshi
Sakshi News home page

ఉద్ధవ్‌ ఠాక్రే, శివసేన (యు.బి.టి.) రాయని డైరీ

Jun 21 2026 12:41 AM | Updated on Jun 21 2026 12:41 AM

Rayani Diary of Uddhav Thackeray

మాధవ్‌ శింగరాజు

హృదయ వేదనను నేను కవిత్వంతో మాత్రమే దాచగలను. కానీ, కవిత్వం అంటేనే గుండెను పెకిలించుకుని దోసిళ్లతో నివేదించడం కదా! ఏమిటీ కుదరని లెక్క? గుండెకు కుట్లు వేసుకుంటున్నానా, లేక పాత గాయాల కుట్లను తడిమి చూసుకుంటున్నానా? ఢిల్లీ నుంచి సంజయ్‌ రౌత్‌  ఫోన్‌ చేశారు. ‘‘కొత్త పొయెట్రీ ఏమైనా చదివారా ఉద్ధవ్‌జీ? లేదంటే, కొత్తగా వైల్డ్‌ లైఫ్‌ ఫొటోలు ఏమైనా తీశారా?’’ అని! అతడు నా మనసుకు నచ్చిన రాజకీ–యేతర విషయాలతో సంభాషణను ప్రారంభించాడంటే, అక్కడ నా మనసును నొప్పించే రాజకీయాలేవో జరిగి ఉంటాయని! ‘‘వైల్డ్‌ లైఫ్‌ ఫొటోలు తీయటం కంటే కూడా కష్టమైన పని... నాకు ఈ మనుషుల అసలు ఛాయలను పట్టుకోవటం సంజయ్‌జీ! నా లెన్స్‌ చూస్తున్న దృశ్యం ఒకటైతే, నా కెమెరాలో పడుతున్న చిత్రం మరొకటి. పులుల్ని ఫొటో తీస్తే ప్రింట్‌లోకి పులులు కాకుండా వేరే ఏవో వచ్చి పడ్డాయి’’ అన్నాను.

‘‘ఉద్ధవ్‌జీ... కోపానికే కాదు, కోపగించు కోకపోవటానికీ ఒక హద్దు ఉంటుంది. గుంటనక్కల్ని గుంటనక్కలనే అనాలి తప్ప, ‘పులులు కాకుండా వేరే ఏవో’ అని మెత్తగా అనకూడదు’’ అన్నారు సంజయ్‌ ఆవేశంగా. పార్టీకి లోక్‌సభలో 9 మంది ఎంపీలు, రాజ్యసభలో ఒక ఎంపీ ఉన్నారు. ఆ ఒక ఎంపీ సంజయ్‌ రౌత్‌. 2004 నుంచీ సంజయ్‌ శివసేన రాజ్యసభ సభ్యుడిగా ఉంటున్నారు. ‘‘ఉద్ధవ్‌జీ, మన 9 మంది ఎంపీలలో ఆరుగురు శిందే వైపు వెళ్లిపోయారు. లోక్‌సభలో శిందే ఎంపీలు ఉండే వైపు తమకు సీట్లు కేటాయించాలని స్పీకర్‌కి లెటర్‌ కూడా ఇచ్చారు’’ అని చెప్పారు సంజయ్‌. నిన్నటి వరకు ‘ఉద్ధవ్‌ శివసేన’లో ఉన్న వారు ఇవాళ ‘శిందే శివసేన’లో చేరిపోయారు! ఉద్ధవ్‌ పార్టీ, శిందే పార్టీ అని చూస్తున్నారు తప్పితే... శివసేనను బాలాసాహెబ్‌ ఠాక్రే పార్టీగా ఎవరూ చూడటం లేదు! మరాఠీ కవి సురేష్‌ భట్‌ రాసిన మాటలు గుర్తొస్తున్నాయి నాకు. ‘‘మిత్రులెవరో, శత్రువు లెవరో అనే చిన్న లెక్క కూడా నాకు అర్థం కాలేదు’’ అని వగచి, వాపోయారు భట్‌! 

2022లో ఇదే జూన్‌ నెలలో, ఇదే 21వ తేదీన ఏక్‌నాథ్‌ శిందే 11 మంది శివసేన ఎమ్మెల్యేలను చీల్చుకొని వెళ్లి, ఆ తర్వాత మరో 29 మంది ఎమ్మెల్యేలను తన వైపుకు తిప్పుకొని, తను సీఎం అయ్యారు! అదేమీ గుర్తు లేనట్లు, 2026 మే నెలలో నాతో సహా తొమ్మిది మంది ఎమ్మెల్సీలకు పదవీ విరమణ వీడ్కోలు ఇస్తూ, శిందే గొప్ప ఔన్నత్యంతో నన్ను ‘ఉద్ధవ్‌ సాహెబ్‌ ఠాక్రే’ అని సంబోధించారు. నన్ను ‘ఉద్ధవ్‌ సాహెబ్‌ ఠాక్రే’ అనటం ద్వారా తను ‘శిందే సాహెబ్‌ ఠాక్రే’ అవుతానని ఆయన అనుకున్నారా!! సంజయ్‌ రౌత్, శిందే మీద తీవ్రమైన అసహనంతో ఉన్నారు. ‘‘మన ఎమ్మెల్యేలను లాక్కున్నాడు, మన పార్టీ గుర్తును లాక్కున్నాడు. మన ఎంపీలను లాక్కున్నాడు. ఇప్పుడు... ‘ఇది కేవలం ట్రైలర్‌ మాత్రమే, అసలు సినిమా ముందుంది’ అని మాట్లాడుతున్నాడు. ఈ నమ్మక ద్రోహిని వదిలిపెట్టకూడదు ఉద్ధవ్‌ జీ’’ అంటున్నారు సంజయ్‌.

నవ్వాన్నేను. ‘‘మనల్ని వదిలివెళ్లిన వాళ్లను, మనం వదిలిపెట్టకుండా ఏం చేసుకుంటాం సంజయ్‌జీ?!’’ అన్నాను. జూన్‌ 19న, శివసేన 60వ ఆవిర్భావ దినోత్సవంలో... శిందే బహిరంగంగా పెద్ద అబద్ధం ఆడేశారు. ‘ఉద్ధవ్‌  శివసేన’ కాంగ్రెస్‌లో విలీనమవుతుందనే భయంతోనే ఆరుగురు ఎంపీలు తన వైపు వచ్చేశారట! శివసేన 30 ఏళ్లు బీజేపీతో ఉన్నా ఏనాడూ బీజేపీలో విలీనం కాలేదు. అలాంటప్పుడు కాంగ్రెస్‌తో మాత్రం ఎలా విలీనం అవుతుంది? చుట్టూ ఉన్నవన్నీ కదిలిపోతున్నప్పుడు మనం ఎలా ఉన్నాం అన్నదే మన వ్యక్తిత్వం. బలం అనేది ‘మూడింట రెండు వంతుల్లో’ ఉండేదే అయితే, ప్రజల అఫెక్షన్‌ ముందు మెజారిటీ ‘డిఫెక్షన్‌’ ఏపాటిది? 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement