మూసీపై ఆ రెండు వంతెనల వ్యథ.. | Guest Column Special Story On The Musi River Dr Ramakrishna Manimadde | Sakshi
Sakshi News home page

మూసీపై ఆ రెండు వంతెనల వ్యథ..

Jun 25 2026 1:08 PM | Updated on Jun 25 2026 1:09 PM

Guest Column Special Story On The Musi River Dr Ramakrishna Manimadde

అభిప్రాయం

హైదరాబాదులో మూసీ నదిపై చాలా వంతెనలున్నాయి. అందులో రెండు వంతె నలు నగరానికి రెండు ముఖాలను చూపి స్తాయి. ఒకటి చారిత్రక ప్రాధాన్యం గల చాదర్‌ఘాట్‌ వంతెన, రెండోది ఆధునిక డిజైన్‌తో కూడిన నాగోల్‌ వంతెన. మొద టిది నగరం నడిబొడ్డున ఉక్కిరిబిక్కిరి అవుతోంది. రెండోది నగర శివారులో వరదను దాటించలేకపోతోంది. ఈ రెండు వంతెనల పరిస్థితి తెలిస్తే హైదరాబాద్‌ వరద సమస్యకు అసలు కారణం బోధపడుతుంది.

నిజాం కాలంలో పాతబస్తీకీ, రెసిడెన్సీకీ మధ్య వారధిగా చాదర్‌ ఘాట్‌ వంతెన నిర్మించారు. అప్పట్లో ఎడ్లబండ్లు, గుర్రపు బగ్గీల కోసం కట్టిన ఈ వంతెన నేడు లక్షలాది వాహనాల భారాన్ని మోస్తోంది. కోఠి, సుల్తాన్‌ బజార్, బేగంబజార్‌ వ్యాపార కేంద్రాలకు ఇది జీవనాడి. ఇటీవలి కాలంలో పిల్లర్ల బలోపేతానికి చేపట్టిన పనులవల్ల, పిల్లర్ల మధ్య ఖాళీ కుంచించుకుపోయింది. వర్షాకాలంలో నీటితో పాటు వచ్చే వ్యర్థాలు ఈ ఇరుకు సందుల్లో చిక్కుకుపోతున్నాయి. వంతెన కిందే అవరోధం ఏర్పడి, నీరు వెనక్కి పొంగి కోఠి మార్కెట్‌ను ముంచెత్తుతోంది.

క్షేత్రస్థాయి పరిశీలనల ప్రకారం, గత కొన్ని దశాబ్దాలలో చాదర్‌ఘాట్‌ వద్ద పురాతన కాలం నుండి సహజంగా ఉన్న నది వెడల్పు చాలావరకు తగ్గినట్లు కనిపిస్తుంది. నది గర్భంలో విస్తృతంగా పార్కింగ్, మెకానిక్‌ షెడ్లు వెలిశాయి. వర్షం రాగానే అవే మొదట మునుగుతున్నాయి. ఆ వాహనాలు, సామగ్రి నీటి ప్రవాహా నికి అడ్డుపడి వరద తీవ్రతను అనేక రెట్లు పెంచుతున్నాయి..

  • చాదర్‌ఘాట్‌ వంతెన గత కాలపు దూరదృష్టికి నిదర్శనం. నాగోల్‌ వంతెన ఆధునిక ఇంజినీరింగ్‌కు కొలమానం. కానీ రెండూ వరదల్లో మునుగుతున్నా యంటే తప్పు వంతెనలది కాదు, నది సహజ స్వభా వాన్ని అర్థం చేసుకోని మనది!

ఇక నాగోల్‌ వంతెన ఔటర్‌ రింగ్‌ రోడ్‌లో భాగంగా ఎల్బీ నగర్‌–ఉప్పల్‌ ట్రాఫిక్‌ను తగ్గించేందుకు నిర్మించారు. ఆధునిక డిజైన్, వెడల్పాటి రోడ్డు, ఎత్తైన పిల్లర్లు– పైకి అన్నీ బాగానే కనిపి స్తాయి. కానీ సమస్య వంతెనలో లేదు, కట్టిన ప్రదేశ స్వభావంలో ఉంది. నాగోల్‌ వంతెన మూసీ నది పెద్ద మియాండర్‌ (వంపు తిరిగే) ప్రాంతంలో ఉంది. వరద సమయంలో నీరు నేరుగా పారదు. మియాండర్‌ వద్ద నీటి వేగం తగ్గి ఒడ్డును బలంగా కోస్తుంది. ఫలితంగా 2020 అక్టోబర్‌ వరదల్లో నాగోల్‌ వంతెన వద్ద నీటిమట్టం వంతెన స్థాయికి చేరి పక్కనే ఉన్న బండ్లగూడ, నాగోల్‌ కాలనీలు ముంపునకు గురయ్యాయి. నాగోల్‌ వంతెనకు ఇరువైపులా కాల క్రమేణా నిర్మాణాలు వెలిశాయి. దీనితో వరద మైదానం విస్తీర్ణం తగ్గింది. 2023లో నాగోల్‌ ప్రాంతంలోని కొన్ని అపార్ట్‌మెంట్ల సెల్లార్లు మునిగి వాహనాలు పాడయ్యాయి. భారీ వర్షం వస్తే నీళ్లు పోవడానికి తగినంత స్థలం లేకుండా పోయింది.

ఏం చెయ్యాలి?
హైడ్రాలిక్‌ అధ్యయనాలు చెబుతున్నదేమిటంటే, భారీ వర్షాల సమయంలో మూసీలోకి చేరే నీటి పరిమాణం అధికంగా ఉంటుంది. కానీ ఆక్రమణల వల్ల చాదర్‌ఘాట్, నాగోల్‌ వంటి కీలక పాయింట్ల వద్ద నది మోయగలిగే సామర్థ్యం తగ్గిపోయింది. ‘మూసీ రివర్‌ఫ్రంట్‌ రీజువెనేషన్‌’ పథకంలో భాగంగా ఇక్కడ రియల్‌ టైమ్‌ వాటర్‌ లెవల్‌ సెన్సార్‌ ఏర్పాటు చేసి స్థానిక వ్యాపార సంఘాలతో అనుసంధానిస్తే వరద సమయంలో వ్యాపారులు నష్టపోకుండా కాపాడుకోగలుగుతారు. నాగోల్‌ వద్ద వంతెనకు ఎగువన, దిగువన నది సహజ ప్రవాహానికి ఆటంకం కలగకుండా వరద మైదానాన్ని శాస్త్రీయంగా పునరుద్ధరించే ప్రణాళికను అమలు చేయాలి.

అలాగే నదీ తీరంలో కొత్తగా నిర్మించే భవనాలకు ‘స్టిల్ట్‌ ఫ్లోర్‌’ విధానాన్ని తప్పనిసరి చేసి, సెల్లార్ల నిర్మాణాన్ని పరిమితం చేసే దిశగా విధానపరమైన నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. చాదర్‌ఘాట్‌ నుంచి నాగోల్‌ వరకు డ్రోన్‌ సర్వేతో త్రీడీ మ్యాపింగ్‌ చేపట్టి ఎక్కడ వరద ముప్పుందో, ఎక్కడ నీటి ప్రవాహం నిరోధించ బడుతోందో ముందుగానే గుర్తిస్తే వర్షాకాలంలోపు నివారణ చర్యలు తీసుకోవచ్చు.


- డా. రామకృష్ణ మనిమద్దె, వ్యాసకర్త ఎర్త్‌ సైంటిస్ట్‌ – నదీ వ్యవస్థల పరిశోధకులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement